Business

అనీల్ రాజీనామా ఒప్పుకోలేదు

Anil Ambani Resignation Rejected-Telugu Business News

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) డైరెక్టర్‌ బాధ్యతల నుంచి అనిల్‌ అంబానీ వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన రాజీనామాను రుణ సంస్థల కమిటీ (సీఓసీ) తిరస్కరించినట్లు ఆర్‌కామ్‌ తెలిపింది. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్లు ఛాయా విరాని, రైనా కరాని, మంజరీ కాకర్‌, సురేశ్‌ రంగాచార్‌, సీఎఫ్‌ఓ మణికంఠన్‌.వి కూడా రాజీనామా చేశారు. వీరిందరి రాజీనామాలను పరిశీలనార్థం రుణ సంస్థల కమిటీ (సీఓసీ)కు పంపగా తాజాగా సీఓసీ వాటిని తిరస్కరించినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌ సందర్భంగా ఆర్‌కామ్‌ తెలిపింది. రుణ సంక్షోభంలో చిక్కుకొని సతమతమవుతున్న ఆర్‌కామ్‌ ప్రస్తుతం దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా జులై- సెప్టెంబరు త్రైమాసికానికి భారీగా రూ.30,142 కోట్ల నష్టాన్ని కూడా ప్రకటించింది. ఇప్పటివరకు ఒక భారతీయ కార్పొరేట్‌ కంపెనీ ప్రకటించిన రెండో అత్యధిక నష్టం ఇదే. త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన మర్నాడే అనిల్‌ అంబానీ రాజీనామాల విషయం వెలుగుచూడటం గమనార్హం. అనిల్‌ అంబానీ, ఛాయా విరాని, మంజరీ కాకర్‌ నవంబరు 15న రాజీనామా చేయగా.. రైనా కరాని 14న, సురేశ్‌ రంగాచార్‌ 13న రాజీనామా సమర్పించారు. ‘సీఓసీ కమిటీ ఆ రాజీనామాలను ఏకగీవ్రంగా తిరస్కరించింది. ఆర్‌కామ్‌ డైరెక్టర్లు యథావిధిగా తమ విధుల్లో కొనసాగవచ్చు. దివాలా ప్రక్రియ పరిష్కారానికి వారంతా కృషి చేయాలి’ అని ఆర్‌కామ్‌ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది.