ఆన్‌లైన్ భద్రత ప్రశ్నార్థకమవుతున్నది. నెట్టింట్లో ఉంచిన డాటా నట్టేట ముంచుతున్నది. మరో భారీ డాటా చౌర్యం ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన 120 కోట్లకుపైగా రికార్డులు లీకయ్యాయి. ఇందులో ఈమెయిల్ ఐడీలు, ఎంప్లాయర్ వివరాలు, సామాజిక మాధ్యమ ఖాతాలు, ఫోన్ నంబర్లు, పేర్లు, జాబ్ టైటిల్, జియోగ్రాఫిక్ లొకేషన్ వంటి వివరాలన్నీ ఉన్నాయి. సెక్యూరిటీ పరిశోధకులు విన్నీ ట్రోయా, బాబ్ డియాచెన్‌కో ఈ విషయాన్ని గుర్తించారు. పీపుల్ డాటా ల్యాబ్స్ (పీడీఏ) అనే డాటా ఎన్రిచ్‌మెంట్ కంపెనీ నుంచి ఈ సమాచారం లీకైంది. ఎలాంటి రక్షణ లేని ఆ సర్వర్‌లో సుమారు 62.2 కోట్ల ఈమెయిల్ అడ్రస్‌లు ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ‘ఆ సర్వర్ పీడీఎల్‌కు చెందినది కాదు. డాటాబేస్‌కు సరైన భద్రత కల్పించడంలో ఒక కస్టమర్ విఫలమైనట్లు భావిస్తున్నారు. బహిర్గతమైన డాటాలో ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ప్రొఫైళ్లు, ఉద్యోగ చరిత్ర వంటి వివరాలు ఉన్నాయి’ అని ఈమెయిల్ నోటిఫికేషన్‌లో వెల్లడించారు. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఆ కంపెనీ లింక్డ్ ఇన్ ఖాతా వివరాల ప్రకారం.. 150 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఆ కంపెనీ వద్ద ఉన్నది. అక్టోబర్ 16న ఈ డాటా చౌర్యం ఘటన చోటుచేసుకున్నది. లీకైన సమాచారం సాధారణంగానే కనిపించినా సైబర్ నేరగాళ్ల్లు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నది. ఫిషింగ్, స్పామ్‌కు పాల్పడడంతోపాటు సమాచారాన్ని డార్క్ వెబ్‌కు సైతం విక్రయించే ప్రమాదం ఉన్నది. ‘డేటా ఎన్‌రిచ్‌మెంట్ కంపెనీలు తమ సిస్టమ్‌కు ఎంత భద్రత కల్పించినా.. ఒక్కసారి సమాచారం కస్టమర్ చేతుల్లోకి వెళ్లాక అది వారి నియంత్రణలో ఉండదు. మిస్ హ్యాండిల్ కారణంగా నా డాటా, మీ డాటా బహిర్గతమైంది. ఇక మనం చేసేదేమీ లేదు’ అని సెక్యూరిటీ రీసెర్చర్ ట్రోయ్ హంట్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
120కోట్ల మంది వివరాలు లీక్
Related tags :