యావత్ భారతావనికి దశ, దిశ నిర్దేశిస్తున్న రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 వసంతాలు పూర్తయ్యాయి. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి 70 ఏండ్లయిన ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ (సంవిధాన్ దివస్) వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ ఎగ్జిబిషన్‌ను రాష్ట్రపతి కోవింద్ ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభల సమావేశం జరుగుతుంది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, బాధ్యతల గురించి ప్రజలకు తెలియజేసేందుకు మంగళవారం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు భంగం వాటిల్లకుండా ఇప్పటివరకూ 103 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 1951లో తొలిసారి రాజ్యాంగాన్ని సవరించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది జనవరిలో 103వ రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యసభ-1952 నుంచి ప్రయాణం అన్న శీర్షికన వెలువడిన రాజ్యసభ ప్రచురణలో అన్ని సవరణల వివరాలు పొందుపరిచారు. ఆ వివరాలను రాజ్యసభ సచివాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. 1951లో తాత్కాలిక పార్లమెంట్ (నాటికి రాజ్యసభ ఉనికిలో లేదు) తొలి సవరణ చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 103 సార్లు రాజ్యాంగాన్ని సవరించినట్లు పెద్దల సభ సచివాలయం తెలిపింది. ఈ 103 సవరణల్లో, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన 99వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1952లో ఉనికిలోకి వచ్చాక, రాజ్యసభ ఇప్పటివరకు 107 రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించగా, అందులో ఒక బిల్లును లోక్‌సభ తిరస్కరించింది. మరో నాలుగు మురిగిపోయాయి. మొత్తంగా, 102 రాజ్యాంగ సవరణల్లో రాజ్యసభ భాగస్వామిగా ఉన్నది. లోక్‌సభ 106 రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించింది.
70ఏళ్లలో 103 సవరణలు
Related tags :