Politics

RTC కార్మికులు విధుల్లోకి వచ్చేయండి-కేసీఆర్ శుభవార్త

KCR Calls TSRTC Workers Back To Duty

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు చెప్పారు. వారికి అవకాశం ఇస్తున్నామని.. రేపు ఉదయం అందరూ విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. విధుల్లో చేరేందుకు ఎలాంటి షరతుల్లేవని చెప్పారు. ఆర్టీసీ సమస్యపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేబినెట్‌ నిర్ణయాలను సీఎం వెల్లడించారు. ఆర్టీసీ మనుగడకు తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. బీడీ కార్మికులకు కూడా ఫించను ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. కార్మికులు, పేదల పొట్ట నింపే కార్యక్రమాలు చేశాం కానీ.. పొట్టకొట్టే పనిచేయలేదు. యూనియన్‌ నాయకుల మాట విని ఆర్టీసీ కార్మికులు నష్టపోయారు. ఎవరూ బాధ్యత వహించరు. ఆర్టీసీ యూనియన్లదే పూర్తి బాధ్యత. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేయలేదు. ఇక్కడ మాత్రం విలీనం చేయాలని చెబుతారు. ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించారు. కార్మికుల సమ్మె చట్టవిరుద్ధం..దీనిపై లేబర్‌ కోర్టు డిక్లేర్‌ చేయాల్సిన అవసరంలేదు. కార్మికుల పట్ల సానుభూతి చూపించినవారు ఎవరైనా ఉన్నారంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే. సానుభూతితో కార్మికులను ఆదుకోవాలని నాతో కూడా అన్నారు. ఈవిషయంలో అతి చేసింది ప్రతిపక్షాలే. మమ్మల్ని లేబర్‌ కోర్టుకు వెళ్లమని హైకోర్టు చెప్పింది. లేబర్‌ కోర్టుకు వెళ్లేందుకు మాకు ఇంకా సమయం ఉంది. రాష్ట్రంలోని ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో నూతన రవాణా చట్టానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇది ప్రజలకు తెలియాలి. కేంద్రం ఏం జోక్యం చేసుకుంటుంది. వారి వాటా నష్టాలు చెల్లించమని అడుగుతాం. అన్ని లెక్కలు తీస్తున్నాం.. 31శాతం వాటా ప్రకారం కేంద్రం దాదాపు రూ.21వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా కార్మికులు వాస్తవాలు తెలుసుకోవాలి. కార్మికులంతా రేపు ఉదయానికల్లా విధుల్లో చేరండి..హాయిగా ఉడండి. ఎలాంటి షరతులు పెట్టం. దీనిపై కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేస్తాం. తాత్కాలికంగా ఆర్టీసీకి రూ.100 కోట్లు మంజూరు చేస్తాం. కిలోమీటరుకు 20పైసలు పెంచితే ఏడాదికి రూ.750 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. వచ్చే సోమవారం నుంచి ఛార్జీలు పెంచుకునే అధికారం ఆర్టీసీ ఎండీకీ కల్పిస్తూ ఉత్తర్వులిస్తాం. ప్రైవేటు బస్సులు పెట్టం. ప్రైవేటు రూట్లకు పర్మిట్లు ఇవ్వాలనుకున్న విధానం వేరు.. ప్రతిపక్షాలు చేసిన దుష్ర్పచారం వేరు. ఇప్పటికైనా కార్మికులు వాస్తవాలు తెలుసుకుని భవిష్యత్‌లో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దు. అలా చేస్తే నష్టపోయేది కార్మికులే. ఆర్టీసీ పరిస్థితిని 49వేల మంది కార్మికులకు వివరిస్తాం. ఆర్టీసీ పరిస్థితిపై ప్రగతిభవన్‌కు పిలిచి కార్మికులతో నేరుగా చర్చిస్తాం. యూనియన్లకు మాత్రం ఇందులో అవకాశం కల్పించే ప్రసక్తి లేదు. సమ్మె కారణంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం. కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. తక్షణం వారి కుటుంబాలకు సాయం చేస్తాం. మమ్మల్ని నిందించినా మేం పట్టించుకోలేదు. చిల్లర మాటలు పట్టించుకోను. సింగరేణిని ఎలా చేశామో చూశారు. సంస్థ వేరు, కార్మికులు వేరని యూనియన్లు దుష్ప్రచారం చేశాయి. గతంలో నేను రవాణాశాఖ మంత్రిగా ఉన్నా.. అప్పుడు ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చా. యూనియన్ల స్థానంలో ప్రతి డిపోలో వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తాం. యూనియన్ల మాయలో పడి కార్మికుల బతుకులను నాశనం చేసుకోవద్దు. కార్మికులను కాదని మేము ఎలాంటి నిర్ణయం తీసుకోం, కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం. సంస్థ మీది.. దాని మనుగడతోనే మీ జీవితాలు ఇమిడి ఉన్నాయి. ఆర్టీసీని అద్భుతంగా తీర్చిదిద్దుదాం, మీరు బాధపడాలని మేమెందుకు భావిస్తాం? తాత్కాలిక ఉద్యోగుల విషయంలోనూ సానుభూతితో వ్యవహరిస్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.