మరమ్మతుల కోసమని ఇచ్చిన తన సైకిల్ తిరిగి ఇవ్వడం లేదని దుకాణ యజమానిపై ఓ బాలుడు ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశాడు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ కూడా చేయడం విశేషం. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కోలికోడ్ జిల్లాలో జరిగింది. యూపీఎస్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన సైకిల్ మరమ్మతులు చేయమని ఓ రిపేర్ దుకాణంలో ఇచ్చాడు. అయితే ఆ దుకాణ యజమాని ఆ విద్యార్థి సైకిల్ తీసుకున్న తర్వాత కొద్ది రోజుల నుంచి షాప్ తెరవడం లేదు. దీంతో ఆ విద్యార్థి ఎన్నిసార్లు దుకాణం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాడు. వెంటనే పోలీసులకు ఈ విధంగా లేఖ రాశాడు. ‘నేను, మా తమ్ముడు మా సైకిల్ రిపేర్ కోసం సెప్టెంబర్ 5న ఒక దుకాణదారుడికి ఇచ్చాం. ఆ దుకాణదారుడు మా సైకిల్‌ను ఇప్పటి వరకు రిపేర్ చేయలేదు. మేం ఎన్నిసార్లు వెళ్లినా షాప్ మూసే ఉంటుంది. అంతేకాకుండా మా నుంచి రూ.200 తీసుకున్నాడు. సర్ మీరు ఇందులో జోక్యం చేసుకుని మా సైకిల్ ఇప్పించగలరు’ అని లేఖలో పేర్కొన్నారు. ఇది వినడానికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం సీరియస్‌గానే తీసుకున్నారు. సివిల్ పోలీసు అధికారి రాధిక విచారణ చేపట్టి సైకిల్ ఇప్పించేలా దుకాణ యజమానితో మాట్లాడారు. కాగా ఈ ఘటన నెటిజన్లను ఎంతో ఆకర్షించింది.
సైకిల్ తిరిగివ్వట్లేదని పోలీసులకు ఫిర్యాదు
Related tags :