కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 110 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సారెస్పీలో నిండుకుండలాగా 90 టీఎంసీల నీళ్లున్నాయని, ఎస్సారెస్పీ కింద.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్లు వస్తున్నాయని, గోదావరి నదిపై ఎల్లంపల్లి, లక్ష్మి, పార్వతి, సరస్వతి.. ఈ మూడు బరాజ్‌లలో కలిపి 60 టీఎంసీల నీరు నెట్ నిల్వ ఉంటుందని వివరించారు. శ్రీరాజరాజేశ్వర, ఎల్‌ఎండీ.. రెండు రిజర్వాయర్లు కలిపి 50 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందన్నారు. 110 టీఎంసీల నీరు ఇక్కడ ఉంటుందని తెలిపారు. మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లాలో 2.70 లక్షల ఎకరాల్లో పంటలు పండే ఆస్కారం ఏర్పడిందని, ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గమైన హుజూరాబాద్ వరకు ఈ రోజు చింతనే లేదని చెప్పారు. ఒకటి, ఒకటిన్నర నెలల్లో మల్లన్నసాగర్ నీరు వచ్చేస్తుందని వెల్లడించారు. అతి త్వరలో దేవాదుల, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు యుద్ధప్రాతిపదికన పూర్తవుతాయని తెలిపారు. త్వరలో ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరుతానని సీఎం చెప్పారు.
నెలన్నరలో మల్లన్నసాగర్‌కు నీళ్లు
Related tags :