Politics

ఈ ఎన్నికలు ముగియగానే మరో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి

zptc mptc elections 2019

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ 11న పూర్తికానుంది. ఓట్ల లెక్కింపునకు నెల రోజులకు పైగా గడువుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమాయత్తమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకూ సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ తాజాగా జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. మే పదో తేదీకి ఓటర్లు జాబితా వెల్లడి, వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిగా సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారు. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ అందరూ క్షణం తీరిక లేకుండా ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. గతేడాది జులై నెలాఖరుతో పంచాయతీ పాలక వర్గాలకు పదవీకాలం ముగిసింది. ఆగస్టు రెండో తేదీ నుంచి పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సమాయత్తమైనా.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ మరుగున పడింది. ఇప్పటికే ప్రత్యేకాధికారులు నియమితులై తొమ్మిది నెలలు కావస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు పూర్తయి నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ భావించారు. అనూహ్యంగా ఈసీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. ఇటు సార్వత్రిక ఎన్నికల్లో ఉన్న సిబ్బందితో వార్డుల విభజన, ఓటర్ల జాబితా ఎలా పూర్తి చేయాలాని తలలు పట్టుకుంటున్నారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి అధికారుల తగు చర్యలు చేపట్టనున్నారు.