ScienceAndTech

భారత సైన్యంపై సైబర్ దాడులు

Cyber Attacks On Indian Army-Telugu ScienceTech News Dec 2019

భారత దేశ సైనిక రహస్యాలను ఛేదించేందుకు శత్రు దేశాలు సైబర్‌ వార్‌కు తెగబడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సైనిక అధికారులకు, జవాన్లకు హైపర్‌ లింక్‌లతో కూడిన మెయిళ్లను పంపడం ద్వారా వారి కంప్యూటర్ల హ్యాకింగ్‌కు అగంతకులు కుట్ర చేస్తున్నారు. రెండు రోజుల కిందట వచ్చిన హెచ్‌ఎన్‌క్యూ నోటీస్‌ ఫైల్‌ పేరుతో హైపర్‌లింక్‌ మెయిళ్లపై భారత ఆర్మీ అప్రమత్తమైంది. దీనిని సైబర్‌ దాడులకు సంబంధించిన ప్రక్రియగా గుర్తించింది. సైబర్‌వింగ్‌ రక్షణ సిబ్బంది అత్యవసర హెచ్చరిక జారీచేసింది. ఇలాంటి నోటీస్‌ సందేశం మెయిళ్లను తెరవొచ్చని అన్ని స్థాయిల అధికారులకు శనివారం ఆదేశాలు పంపింది. ఒకవేళ ఇలాంటి మెయిల్స్‌ వస్త్తే సంబంధిత సైబర్‌ విభాగానికి తెలియజేయడమో లేదా వాటిని తొలగించి వేయడమో చేయాలని పేర్కొంది. భారత ఆర్మీ కీలక మౌలిక వ్యవస్థలపై సైబర్‌ దాడులకు చైనా, పాక్‌ నుంచి కుట్రలు జరుగుతున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇటువంటి దాడులు పెరిగినందున, సైబర్‌ యూనిట్లు మరింత అప్రమత్తం అయినట్లు చెప్పారు. సాయుధ దళాలకు శక్తివంతమైన రక్షణ సైబర్‌ ఏజెన్సీ ఏర్పాటు అవసరమని ప్రభుత్వం ఇదివరకే గుర్తించింది. చైనా లేదా పాకిస్తాన్‌ వంటి దేశాల నుండి విదేశీ హ్యాకర్ల ముప్పును ఎదుర్కొనేందుకు ఈ తరహా వ్యవస్థ అనివార్యమని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.

భారత సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌ ఇతర దేశాల నుంచి రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు సందేహిస్తు న్నాయి. అనేక సందర్భాల్లో, ఇతర దళాల నుండి భద్రతా అధికారుల మారువేషంలో ఆర్మీ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లలో ఆపరేటర్లు విజయవంతంగా చొరబడ్డారని రక్షణవర్గాలు తెలిపాయి. ఎక్చేంజ ఆపరేటర్లు, వివిధ యూనిట్ల సహాయకులు, మాజీ సైనికుల గురించి సమాచారాన్ని సేకరించడమే లక్ష్యంగా పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ క్రియాశీలక ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. భారతదేశంలోని స్కార్పెన్‌ జలాంతర్గామి విమానాల సామర్థ్యానికి సంబంధించిన వేలాది ఫైళ్ళను సైబర్‌ క్రూక్స్‌ దొంగిలించినట్లు 2016 లో గుర్తించారు.

ఆరు స్కార్పియన్‌ జలాంతర్గాముల సామర్థ్యాన్ని వివరించే 22,400 పేజీల సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలిం చారని, వీటిని ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ఎస్‌ డిజైన్‌ చేసిందంటూ ఈ లీకుల విషయం ఆస్ట్రేలియాలో ప్రకటించారు. ఆస్ట్రేలియాకు కొత్త తరం జలాంతర్గాములను నిర్మించేందుకు ఫ్రెంచ్‌ షిప్‌ తయారీ సంస్థ 38.06బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చు కుంది. డేటా లీక్‌ కావడంతో ఒప్పందం నిలిచింది. ఈ నేపథ్యంలో తాజా మెయిల్‌ క్రూక్స్‌ ఆందోళన కలిగిస్తున్నాయి.