DailyDose

పౌరసత్వ బిల్లుపై ఢిల్లీలో అల్లర్లు-తాజావార్తలు-12/15

Protests In Delhi Against CAB-Telugu Breaking News Roundup-12/15

* పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని దిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దక్షిణ దిల్లీలోని ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడి జామియానగర్‌లో పలువురు ఆందోళనకు దిగారు.

* పౌరసత్వ సవరణ చట్టంపై చెలరేగుతున్న ఆందోళనల వెనుక కాంగ్రెస్‌, ఆ పార్టీ మిత్ర పక్షాలు ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఝార్ఖండ్‌లోని దుమ్కాలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఆ పార్టీ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని దుయ్యబట్టారు.

* ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంచేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. విజయవాడలోని బెరం పార్కు వేదికగా ఈ నెల 17న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలకు విందు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జిల్లాల వారీగా టేబుళ్లను ఏర్పాటు చేసి ఆయా టేబుల్‌ వద్ద సంబంధిత జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

* ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తెదేపా నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి వంతపాడుతున్నారని ఆరోపించారు. రాజధాని, పోలవరం వంటి కీలక అంశాలు చర్చకు రాకుండా సభలో వివాదాలు సృష్టిస్తున్నారని వైకాపాపై మండిపడ్డారు. దిశ చట్టం తెస్తామని చెప్పేలోగా మూడు ఘటనలు జరిగాయని, ఈ నిందితులపైనా దిశ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

* మినీలారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురం మండలం హసనబాదలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నున్న రామరాజు(35) అక్కడికక్కడే మృతిచెందగా, నున్న ప్రకాశ్‌రావు(54)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. నున్న సూర్యనారాయణ(60) పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

* రెండు పడకగదుల ఇళ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రాఘవాపూర్‌లో కొందరు మహిళలు మంత్రులను అడ్డుకున్నారు. గ్రామంలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్యను మహిళలు అడ్డగించారు. పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించడంతో రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు.

* వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మంచి స్కోర్‌ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(70; 88 బంతుల్లో 5×4, 1×6), రిషభ్‌పంత్‌(71; 69 బంతుల్లో 7×4, 1×6) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్‌ మెరుగైన స్థితికి చేరుకుంది. మరోవైపు లక్ష్య ఛేదనలో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడుతున్నారు.

* ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. పాలకొల్లు నుంచి శివదేవుని చిక్కాల వరకు ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించారు. పాలకొల్లు బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెరిగిన ఆర్టీసీ ఛార్జీల వల్ల ప్రజలపై దాదాపు రూ.వెయ్యికోట్ల భారం పడుతుందన్నారు. పెంచిన ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

* భవన నిర్మాణ కార్మికులకు రుణాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసం చేసిన నటుడు బషీద్‌ను గుంటూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌బీకే గ్రూప్స్‌ నుంచి రుణాలు ఇప్పిస్తానని, ప్రాసెసింగ్‌ రుసుము పేరుతో రూ.లక్షల్లో వసూలుకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కూడా బషీద్‌పై కేసు నమోదైంది.