DailyDose

తెలంగాణా “వన్యప్రాణి” ఛైర్మన్‌గా కేసీఆర్-తాజావార్తలు-12/18

KCR As Chairman Of Telangana Vanyaprani-Telugu Breaking News-12/18

* రాజధానిపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఆగ్రహంతో ఉన్న రైతులు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రైతులు సమావేశమయ్యారు. సీఎం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సీఎం నిర్ణయాన్ని నిరసిస్తూ రాజధాని గ్రామాల్ల గురువారం బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు.

* తెలంగాణలో రాష్ట్ర వన్యప్రాణి మండలి ఏర్పాటైంది. సీఎం కేసీఆర్‌ ఛైర్మన్‌గా, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వైస్‌ ఛైర్మన్‌గా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలిలో సభ్యులుగా ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, మర్రి జనార్దన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావుతో పాటు ఆసిఫాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవా లక్ష్మి, పలు ఎన్జీవోల ప్రతినిధులు, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఉన్నారు.

* హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బయో డైవర్సిటీ ప్లైఓవర్‌ ప్రమాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదికను జీహెచ్‌ఎంసీకి అందజేసింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వంతెన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొందని తెలిపారు.

* శాసనసభలో రాజధాని భూముల అంశంలో ‘హెరిటేజ్‌ ఫుడ్స్‌’పై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చేసిన ఆరోపణలను ఆ సంస్థ కొట్టిపారేసింది. ఈ మేరకు ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చింది. వ్యాపార విస్తరణలో భాగంగా గుంటూరు చుట్టుపక్కల భూములు కొనుగోలు చేయాలని 2014 మార్చిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 3నెలలకు జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొంది.

* భాజపా ప్రభుత్వం నియంతృత్వపాలన వైపు పయనిస్తోందని మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ విమర్శించారు. మద్రాస్‌ యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తన సంఘీభావం తెలిపేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. కానీ ఆయన యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు.

* పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తీసుకురావాల్సిన అవసరం ఏముందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలతో దేశరాజధాని దిల్లీ దద్దరిల్లుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌ల నుంచి వచ్చే శరణార్థులకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారు? మన యువతకే ఉద్యోగాలు లేక పరిస్థితి దుర్భరంగా ఉంది’ అని కేజ్రీవాల్ అన్నారు.

* పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వ్యతిరేకించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని.. అదే జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుందని అన్నారు. అప్పుడు తెలంగాణకు రావాల్సిన నీటివాటా రాదని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు.

* వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్లు తొలి మ్యాచ్‌ను ఎవరితో తలపడనున్నాయో ఖరారైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన ఈవెంట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్‌ జరగనున్నాయి. జులై 24న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. తర్వాతి రోజు నుంచి క్రీడా సమరం మొదలవుతుంది.

* వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్‌ అదరగొట్టారు. ఓపెనర్లు రోహిత్‌శర్మ (159), కేఎల్‌ రాహుల్‌(102) శతకాలతో చెలరేగడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు ద్విశతక భాగస్వామ్యం(227) నెలకొల్పాక రాహుల్‌.. ఆల్జరీ జోసెఫ్‌ బౌలింగ్‌లో రోస్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

* ‘రాములో రాములా..’ పాటలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఏ మాత్రం ఆగం అయ్యారో తెలియదు గానీ.. వ్యూస్‌ విషయంలో ఈ పాట ఏమాత్రం ఆగనంటోంది. యూట్యూబ్‌లో విశేషాదరణ పొందిన ఈ గీతం 10 కోట్ల వీక్షకుల మైలురాయిని దాటుకుని మరింత ముందుకు దూసుకుపోతోంది. అతి తక్కువ కాలంలో ఇన్ని వ్యూస్‌ సాధించిన తొలి తెలుగు సినిమా ఇదేనని అంటున్నారు.

* వైమానిక, రక్షణ రంగ ఉత్పత్తుల్లో హైదరాబాద్ దేశంలోనే అనువైన ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. భారత్‌-అమెరికా రక్షణరంగ సంబంధాలు, పరిశ్రమలు, ఐటీ రంగంలో పెట్టుబడులపై తాజ్‌కృష్ణలో నిర్వహిస్తున్న సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రక్షణ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా ఉందని.. ఇప్పటికే డీఆర్డీవో కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ సేవలు అందిస్తోందని మంత్రి తెలిపారు.

* రాష్ట్రాభివృద్ధి కోసం గత ఐదేళ్లపాటు ఎంతో కష్టపడ్డానని..ఎవరికీ ఇబ్బంది ఉండకూడదని అనేక సంక్షేమ పథకాలు తెచ్చామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురంలో తెదేపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘వైకాపా ప్రభుత్వం చేసిన పనులతో తెలంగాణకు మద్యం ఆదాయం బాగా పెరిగింది. శాసనసభ మయసభను తలపిస్తోంది. న్యాయం ఎప్పుడూ పాండవుల వైపే ఉంటుంది’’ అని చంద్రబాబు అన్నారు.

* రాజధానిపై సీఎం జగన్‌ ఏం చెప్పారని ఇంత చర్చ జరుగుతోందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మూడు చోట్ల రాజధాని ఉండొచ్చు అని మాత్రమే సీఎం అన్నారని చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం పేర్కొన్నవిధంగా రాజధానులు అక్కడ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని నాని వ్యాఖ్యానించారు. కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

* నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరిశిక్ష అమలుపై నిర్ణయాన్ని దిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టు వాయిదా వేసింది. మరణశిక్షకు ముందు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు దోషులకు వారం గడువు కల్పించింది. ఈ మేరకు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసేందుకు తాజాగా నోటీసులు జారీ చేయాలని తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించింది. అప్పటివరకు డెత్‌ వారెంట్‌ జారీ చేయలేమని స్పష్టం చేసింది.

* డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహించడంలో భాగంగా నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) సేవల్ని 24గంటలూ కొనసాగించేలా నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ తాజాగా ఖాతాదారులకు మరో శుభవార్తను వెల్లడించింది. నెఫ్ట్‌ ద్వారా జరిపే లావాదేవీలపై జనవరి నుంచి ఎలాంటి ఛార్జీలు ఉండబోవని ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులను సంకేతాలిచ్చిన ఆర్బీఐ తాజాగా అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.

* సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయాలతో రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం చుట్టుపక్కల జగన్‌ సూచనల మేరకు వైకాపా నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపితే అసలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఏంటో బయటపడుతుందని అన్నారు.

* తన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వానికి తిరిగి వాపస్‌ చేస్తానని ప్రముఖ ఉర్డూ రచయిత, హాస్యవేత్త ముజ్తాబా హుస్సేన్‌ నేడు ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అంశాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఉర్దూ సాహిత్యంలో హుస్సేన్‌ కృషికి గుర్తింపుగా 2007లో భారత ప్రభుత్వం ఈ హైదరాబాద్‌ రచయితకు పద్మశ్రీ బిరుదును ప్రదానం చేసింది.

* పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సుప్రీంకోర్టులో ఆసక్తికర ప్రతిపాదన చేశారు. కోర్టులో ఒకేసారి అనేక మంది న్యాయవాదులు వాదించడంతో ఇబ్బంది తలెత్తుతోందని ధర్మాసనానికి వివరించారు. దీనికి పరిష్కారంగా పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు అనుసరిస్తున్న విధానాన్ని మనం కూడా అవలంబించాలని సూచించారు.

* ఏపీ సీఎం జగన్‌ ప్రకటనతో రాజధానిపై కొంత స్పష్టత వచ్చినట్టు కనిపిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు. కమిటీ నివేదిక ఇస్తుందని చెబుతూనే తన ఆలోచనను సీఎం జగన్‌ బయటపెట్టారన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్‌ మాట్లాడారు. అనేక దేశాలు, రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరొక నగరంలో ఉన్నాయన్నారు. అమరావతి అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.

* టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని మళ్లీ నియమిస్తున్నట్లు నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌క్లాట్‌) ప్రకటించింది. దాదాపు మూడేళ్ల తర్వాత మిస్త్రీ మళ్లీ ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నటరాజన్‌ చంద్రా నియామకాన్ని ఎన్‌క్లాట్‌ నిలుపుదల చేసింది. ఎన్‌.చంద్ర నియామకం చట్ట విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది.