Sports

కూతురి పోస్టుకు గంగూలీ వివరణ

Saga Ganguly Posts On CAA Bill-Ganguly Joins To Explain

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విపక్ష నేతలతో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా బీసీసీఐ ఛైర్మన్‌, టీమిండియా మాజీ సారథి సౌరబ్‌ గంగూలీ కుమార్తె సనా గంగూలీ కూడా సీఏఏపై తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ప్రముఖ రచయిత కుశ్వంత్‌ సింగ్‌ రాసిన ‘ది ఎండ్‌ ఆఫ్‌ ఇండియా’ నవలలోని సారాంశాన్ని పోస్ట్‌ చేసిన సనా.. జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను, పౌరసత్వ చట్ట సవరణను పరోక్షంగా వ్యతిరేకించారు. అయితే సనా పోస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంత చిన్న వయసులో ఎంతో పరిణతితో ఆలోచించిందని కొందరు ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు. ఇది కాస్తా వివాదానికి దారితీస్తుండటంతో గంగూలీ స్పందించారు. తన కుమార్తె చిన్న పిల్ల అని, ఆమె చేసిన పోస్ట్‌ నిజం కాదని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. ‘ఈ వివాదాల నుంచి సనాను దూరంగా ఉంచండి ప్లీజ్‌. ఆ పోస్ట్‌ నిజం కాదు. తను చాలా చిన్న పిల్ల. రాజకీయాల గురించి ఇప్పుడే తెలుసుకోలేదు’ అని దాదా ట్వీట్ చేశారు.