* ఏపీ రాజధానిని విశాఖ తరలించడం వల్ల భీమిలి నియోజకవర్గం బాగుపడుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం భీమిలిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాజధాని కార్యకలాపాలతో భీమిలి మహాపట్టణంగా ఎదిగేందుకు అవకాశం ఉందన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో భీమిలిలో రాజధాని ఏర్పాటు కానుండటం సంతోషంగా ఉందన్నారు.
* ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని, సీఎం జగన్ వద్ద నుంచే ఈ పరిస్థితి చూస్తున్నామని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజధాని విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం మారితే ప్రభుత్వ విధానాలు మారిపోతాయా అని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ భాజపా కోరుకోవటంలేదన్నారు.
* దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ప్రధాని మోదీ మంత్రులతో సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తైన సందర్భంగా మంత్రుల పనితీరుపై సమీక్షించేందుకు శనివారం ఈ సమావేశం నిర్వహించినట్లు చెబుతున్నా.. సీఏఏపై ఆందోళనల అంశంపై వీరు ప్రధానంగా చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
* మహారాష్ట్ర రైతులకు ఊరట కల్పిస్తూ రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. రైతుల రుణాలు రూ. 2లక్షల వరకు మాఫీ చేస్తామని శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. ‘2019 సెప్టెంబరు 30 వరకు ఉన్న పంట రుణాలపై ఒక్కో రైతుకు గరిష్ఠంగా రూ. 2లక్షల వరకు మాఫీ చేస్తాం. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పేరుతో ఈ రుణమాఫీ పథకం తీసుకొస్తున్నాం. మార్చి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది’ అని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
* జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఖర్చుతో కూడున్నదని గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…రాజకీయం కోసం రాజధానిని వికేంద్రీకరించడం తగదన్నారు.‘‘అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రభుత్వ భవనాలు నిర్మించటం కాదు. మూడు రాజధానులకు మంత్రులు, అధికారులు తిరగటం వ్యయప్రయాసలతో కూడుకున్నది’’ అని గల్లా జయవేవ్ అన్నారు.
* పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రాంతంలో శనివారం చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనలను నియంత్రించేందుకు పోలీసులు బ్యారికేడ్లు అడ్డుపెట్టగా నిరసనకారులు వాటిపై నుంచి దూకేసి మరీ పోలీసులపైకి రాళ్లు విసిరారు. యూపీలో నిన్నటి నుంచి జరుగుతున్న ఆందోళనల్లో 11మంది మరణించినట్లు సమాచారం.
* రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆప్రాంత రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఐదోరోజు(ఆదివారం) ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.
* తనను జైలులో ఉంచినా, ఉరి తీసినా అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానానికి ఎలాంటి సమాధానం ఇవ్వనని ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె అన్నారు. ఆ దేశంలో మాదక ద్రవ్యాల బెడద పెరిగిపోవడంతో ఆయన దానిపై యుద్ధం ప్రకటించారు. అయితే ఈ డ్రగ్స్ సరఫరాచేస్తున్న వారిని ఎలాంటి విచారణ జరపకుండా చంపేయమని ఆయన పిలుపు ఇవ్వడంతో ఇప్పటివరకు వేలాదిమంది హతమయ్యారు.
* సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ ఔషధాల కుంభకోణం కేసులో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో ఇద్దరిని ఈకేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. భూపాల్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డి కలిసి 25 డొల్ల కంపెనీలు సృష్టించి నకిలీ బిల్లుల ద్వారా పెద్ద ఎత్తున నగదు దండుకున్నట్లు అనిశా విచారణలో తేలింది. మాజీ డైరెక్టర్ దేవికారాణికి వీరిద్దరూ సహకరించడంతో… ఈ ముగ్గురూ కలిసి సొమ్ము కొల్లగొట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
* దిల్లీ అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 2015లో 70 సీట్లకు గానూ 67 స్థానాల్లో గెలుపొందామని, ఈ సారి ఆ సంఖ్య తగ్గకూడదన్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన పార్టీ జాతీయ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు.
* పేదవర్గాలకు మేలు చేస్తూ నవరత్నాలను అమలు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆయన ప్రారంభించారు. దీని ద్వారా మగ్గం ఉన్న చేనేతల కుటుంబానికి ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చేనేతలు పేదరికం, అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఆప్కో వ్యవస్థను ప్రక్షాలను చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
* మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూ… ఈమేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్ధికి నిపుణుల కమిటీ సిఫార్సులు .. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. రాజధానులుగా మార్చే ఆలోచనను అంతా స్వాగతించాలన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు.
* మూడు రాజధానుల అంశంపై తుది నిర్ణయం దిశగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 27న జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చించనుంది. అనంతరం జనవరి మొదటివారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించే యోచనలో ఉంది. రాజధాని వ్యవహారంపై జీఎన్‌రావు కమిటీతోపాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ)నకు కూడా ప్రభుత్వం అధ్యయన బాధ్యతలు అప్పగించింది. బీసీజీ నుంచి పూర్తి నివేదిక వచ్చాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
* మూడు రాజధానుల గురించి జీఎన్‌రావు కమిటీ సమర్పించిన నివేదికపై వైకాపా సమాధానం చెప్పాకే భాజపా స్పందిస్తుందని ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు శనివారం ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మొదటి నుంచీ భాజపా సమర్థిస్తోందన్నారు.
* పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 12కు చేరింది. మృతుల్లో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
* ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని జగన్ ఎలా మారుస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిలదీశారు. ప్రధాని నిర్ణయాన్ని జగన్ లెక్కచేయడం లేదని దుయ్యబట్టారు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ వెలగపూడిలో రైతులు రిలే నిరాహార దీక్షకు కృష్ణా జిల్లా తెదేపా నేతలు దేవినేని, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మద్దతు తెలిపారు. రైతులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలుపుతూ రైతులతో దీక్షలో కూర్చున్నారు.
* భారత్‌లోకి డ్రైవర్‌లెస్ కార్లను ఇప్పట్లో అనుమతించేది లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో 22లక్షల డ్రైవర్ల కొరత ఉందని తెలిపారు. దిల్లీలో శుక్రవారం జరిగిన అసోచామ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘డ్రైవర్‌లెస్ కార్ల గురించి నన్ను అడుగుతుంటారు. నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నంత కాలం దాన్ని మర్చిపోవాల్సిందే. అలాంటి కార్లు భారత్‌కు వచ్చేందుకు నేను అనుమతించను’’ అని తెలిపారు.
* గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సుందర్ పిచాయ్‌కి భారీగా వేతనం పెరిగింది. ఆయనకి రెండు మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో సహా, సంతృప్తికరమైన పనితీరుతో లక్ష్యాలను చేరుకోగలిగితే 2020 నుంచి మూడు సంవత్సరాల పాటు 240 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్ అవార్డు లభించనుంది. అంతేకాకుండా ఆల్ఫాబెట్ షేర్ల విలువ పెరుగుదలకు అనుగుణంగా 90 మిలియన్ డాలర్ల విలువగల షేర్లు అదనపు బోనస్‌గా లభించనున్నాయి.
* మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌పై కొందరు ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి తనకు, తన కుటుంబసభ్యులకు ఫోన్‌కాల్స్ వచ్చాయని గంభీర్ తెలిపారు. ఫోన్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. గంభీర్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
* ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జీఎన్‌రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదని ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘కమిటీ నివేదికపై క్యాబినెట్‌లో సమగ్రంగా చర్చిస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు. మంత్రివర్గ నిర్ణయం తరువాత ఈవిషయంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తాం. ఆతర్వాత జనసేన పార్టీ నిర్ణయాన్ని ప్రజలముందు ఉంచుతాం’’ అని పవన్ అన్నారు.