Agriculture

రాయలసీమ టమాటా రైతుల కష్టాలు

Rayalaseema Tomato Farmers Are In Deep Troubles

టమాటా రైతుల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంట వర్షాల కారణంగా తెగుళ్ళ బారినపడి నాశనమైందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకూ శ్రమించినా.. ఫలితం దక్కడం లేదని వాపోతున్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో సుమారు 20 వేల హెక్టార్లకుపైగా టమాటా సాగు అయ్యింది. తెగుళ్లు, అధిక వర్షాలతో కాయలు పాడైపోయాయి. ఇందుకు తోడు దళారుల చేతిలో మోసపోతున్న కారణంగా.. రైతుకు నష్టాలే మిగులుతున్నాయి.

”పంట చేతికొచ్చే సమయంలో కురిసిన చెదురు మదురు వర్షాలకు.. చెట్లకు బూడిద తెగులు సోకి కాయలు నల్లగా మాడిపోతున్నాయి. ఎన్ని పురుగు మందులు వాడినా ఫలితం ఉండడం లేదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేస్తే చివరికి చేతికొచ్చేది వేలల్లోనే. తీవ్ర నష్టాలు వస్తున్నాయి. వర్షాలు, తెగుళ్ళు తట్టుకొని కాస్తోకూస్తో దిగుబడి వచ్చేసరికి మార్కెట్లో మద్దతు ధర ఉండటంలేదు. అధిక కూలీ ఇచ్చి కాయలు తెంపించి మార్కెట్​కు తరలిస్తే అక్కడ దళారుల చేతిలో మోసపోతున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతూ దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కోసారి రవాణా ఖర్చులు రాక టమాటాలు కోసి రోడ్లమీద పారబోస్తున్నాం’ అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురంలో టమాటాను అత్యధికంగా సాగు చేస్తారు. టమాటా విక్రయానికి మదనపల్లి మార్కెట్ పెట్టింది పేరు. రైతులు పంటను ఇక్కడికే ఎక్కువగా తీసుకొస్తుంటారు. తీరా ఇక్కడికొచ్చాక గిట్టుబాటు ధర లేక.. తిరిగి తీసుకెళ్లలేక దళారులు అడిగిన రేటుకు ఇచ్చేయడమో లేదా రోడ్డుమీద పారబోయడమో చేస్తున్నారు. కడప జిల్లాలోని చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి, గాలివీడు.. చిత్తూరు జిల్లాలోని కలకడ, తంబళ్లపల్లి, పెద్దమండ్యం, గుర్రంకొండ, మదనపల్లి ప్రాంతాల్లో సుమారు 20 వేల హెక్టార్లకుపైగా టమాటా సాగు ఉందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2, 3 నెలలపాటు పొలాల్లో శ్రమించి.. ఖర్చులన్నీ భరించి.. చివరకు ధరలేక.. చేసిన అప్పులు తీరక టమాటా రైతులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వాలు సీమ జిల్లాల్లో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని చెప్పినప్పటికీ… ఆచరణలో అమలు కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి.. కనీసం తమకు పరిహారమైనా ఇప్పించి ఆదుకోవాలని టమాటా రైతులు కోరుతున్నారు.