కొరియోగ్రాఫర్, నటుడు, సినీ దర్శకుడు రాఘవ లారెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి బయట నిర్వహించే ఏ కార్యక్రమాలకు హాజరుకాబోనని సంచలన ప్రకటన చేశారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు.
‘‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ మీకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక నుంచి బయట జరిగే ఏ కార్యక్రమానికి నేను హాజరుకాను. తలైవర్(రజనీకాంత్) కార్యక్రమానికి కూడా ఆయన అనుమతి లేకుండా రాను. దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ నేను మీతో పంచుకోలేను. ఆయన(రజనీ) దీవెనలు కన్నా ఏదీ ఎక్కువ కాదు’’ -ట్విటర్లో లారెన్స్
రాఘవ లారెన్స్ నిర్ణయం వెనుక ఇటీవల జరిగిన ఒక సంఘటనే కారణమని తెలుస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘దర్బార్’ ఆడియో విడుదల వేడుక డిసెంబరు మొదటి వారంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన లారెన్స్ రజనీకాంత్‌పై తన అభిమానాన్ని చాటుకునేందుకు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.‘నేను చిన్నప్పటి నుంచి రజనీకాంత్ అభిమానిని. ఆ సమయంలో కమల్‌హాసన్ సినిమా విడుదలైతే పోస్టర్లపై పేడ కొట్టేవాడిని. ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తున్నారు. స్నేహబంధం కన్నా గొప్పది ఏదీ కాదని ఇప్పటికి నాకు అర్థమైంది’ అని లారెన్స్ చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి. కమల్‌ను అవమానకరంగా మాట్లాడారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో లారెన్స్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా తాను ఈ కార్యక్రమానికి హాజరుకాబోనని ప్రకటించారు.