* తెలంగాణలో పురపాలక ఎన్నికల నగరా మోగింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 22న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జనవరి 7న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జనవరి 8న రిటర్నింగ్ అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎలక్షన్ నోటీస్ ఇస్తారు. జనవరి 10న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు.
* ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌరపట్టిక)పై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీలకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఎన్‌ఆర్‌సీకి ఏపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతివ్వదన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా రిమ్స్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా ఎన్‌ఆర్‌సీపై ప్రకటన చేశారని.. తనతో చర్చించాకే దీనిపై ఆయన మాట్లాడారన్నారు.
* రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క కులానికీ, మతానికి కొమ్ముకాయదని చెప్పారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. అమరావతి ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని జీఎన్ రావు కమిటీ నివేదికలో పేర్కొందన్నారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని.. ఆందోళన విరమించాలని చెప్పారు.
* పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేడు మహాత్మాగాంధీ స్మారకం రాజ్‌ఘాట్ వద్ద ‘సత్యాగ్రహం’ చేపట్టింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం ఇటీవల చేపడుతున్న చర్యలపై యావత్ దేశ ప్రజలు, ముఖ్యంగా యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
* తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చింతపల్లి వెంకటరాములు, ఉప లోకాయుక్తగా విశ్రాంత జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి వొలిమినేని నిరంజన్‌రావు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరితో ప్రమాణం చేయించారు.
* నూతనంగా అమలులోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ పశ్చిమ బంగాల్ రాజధాని కోల్‌కతాలో భాజపా భారీ ర్యాలీ చేపట్టింది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ర్యాలీని ప్రారంభించారు. సెంట్రల్ కోల్‌కత్తాలోని హింద్ సినిమా ప్రాంతం నుంచి శ్యాంబజార్ ప్రాంతం వరకు నాలుగున్నర కిలోమీటర్లు మేర ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం కార్యకర్తలనుద్దేశించి నడ్డా ప్రసంగిస్తూ.. బంగాల్ మొత్తం ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచిందన్నారు.
* స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన నల్లధనం వివరాలు కూడా ఇవ్వలేమని పేర్కొంది. ఈ మేరకు ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. గోప్యంగా ఉంచాలన్న నిబంధనతో స్విట్జర్లాండ్‌తో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ వివరాలు ఇవ్వలేమని పేర్కొంది.
* ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఓటమి పాలయ్యారు. జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సరయి రాయ్ చేతిలో 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. సరయి రాయ్ భాజపా రెబల్ అభ్యర్థి కావడం గమనార్హం. సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు, స్పీకర్ కూడా ఓటమి పాలయ్యారు.
* రాజ్యాంగానికి విరుద్ధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై దేశవ్యాప్తంగా భయం, ఆందోళన ఉందన్నారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో భట్టి మాట్లాడారు. ఇలాంటి చట్టాల ద్వారా దేశం పెనుప్రమాదంలో పడుతుందని ఆయన ఆరోపించారు. లౌకక పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు దేశం సుభిక్షంగా ఉందన్నారు.
* ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఆంథమ్ వచ్చేసింది. ఈ పాట తనకు చాలా నచ్చిందని అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ చక్కటి సంగీతం అందించారని, ఈ పాట వ్యక్తిగతంగా తన హృదయానికి చేరువైందని అన్నారు. సైనికుల విలువ, వారి త్యాగాల్ని గుర్తు చేస్తూ రూపొందించిన ఈ పాట నిజంగా మనసులు కదిలించే విధంగా ఉంది.
* పారిశ్రామిక రంగంలో కడప జిల్లా పరుగులు పెట్టాలని కలలు కన్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన సున్నపురాళ్లపల్లెలో నిర్మించనున్న ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత కడప జిల్లాను పట్టించుకునేవారు కరవయ్యారన్నారు. గతంలో ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు టెంకాయ కొట్టి మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తే దానిని చిత్తశుద్ధి అంటారని పేర్కొన్నారు.
* ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నట్లు కన్పిస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ మహాకూటమి మెజార్టీ మార్క్ దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలిచి మరో 10 చోట్ల ముందంజలో ఉండగా.. జేఎంఎం 5 స్థానాల్లో గెలిచి 23 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ 3 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మొత్తంగా ఈ కూటమి 45 స్థానాల్లో(ఆధిక్యం+గెలుపు) జోరు కొనసాగిస్తోంది.
* ఎవరు అధికారంలోకి వచ్చినా అభివృద్ధిని కొనసాగించాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో రైతులు చేస్తున్న మహాధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం భావిస్తే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు సవాల్ విసిరారు.
* దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించారు. దిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టాన్ని పూర్తిచేసింది. దాదాపు 4 గంటలపాటు ఈ ప్రక్రియను ఎయిమ్స్ వైద్యులు నిర్వహించారు. రెండ్రోజుల్లో పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ వైద్యులు హైకోర్టుకు ఇవ్వనున్నారు. పోస్టుమార్టం అనంతరం నాలుగు మృతదేహాలను బంధువులకు పోలీసులు అప్పగించారు.
* కడప జిల్లాలోని కుందూ నదిపై జొలదరాశి, రాజోలి, బ్రహ్మంసాగర్ ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. గండికోట నుంచి వెళ్లే కాల్వల సామర్థ్యాన్ని 4వేల నుంచి 6వేల క్యూసెక్కులకు పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వరద వచ్చే సమయంలో ప్రాజెక్టులను నీటితో నింపేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.
* ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో సచివాలయాలు, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని గుర్తుచేశారు. కానీ, ఎక్కడా సచివాలయం, అసెంబ్లీ వేరుగా లేవని తెలిపారు. సచివాలయం ఒకచోట, మంత్రుల నివాసాలు మరోచోట ఉంటే విహారయాత్రలా ఉంటుంది తప్ప పరిపాలన సౌలభ్యంగా ఉండదని ఎద్దేవా చేశారు.
* సంచలనం సృష్టించిన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగీ హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తీర్పు వెల్లడించింది. మరో ముగ్గురికి 24ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ హత్యతో ప్రత్యక్షంగా సంబంధమున్న ఐదుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణశిక్ష విధించిందని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
* ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌కు విముక్తి లభించిందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదం కారణంగా జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో వెనుకంజలో ఉండిపోయిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి జమ్ము, కశ్మీర్‌లు పురోగమించడం ప్రారంభించాయన్నారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన పలువురు విద్యార్థులు ఉపరాష్ట్రపతిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పలు ట్వీట్లు చేశారు.
* కర్నూలు జిల్లాకు హైకోర్టు ఒక్కటే ఇచ్చి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేతులు దులుపుకోవడం సరికాదని మాజీ మంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ మండిపడ్డారు. ఈమేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రాయలసీమ ప్రజలు కోరుకునేది నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. హైకోర్టు వచ్చినంత మాత్రాన ఇవన్నీ వస్తాయా?’ అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు.
* దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంతోనే మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 38 పాయింట్లు నష్టపోయి 41,642 వద్ద ముగించగా.. నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 12,266 వద్ద ముగించింది. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.15 వద్ద కొనసాగుతోంది.