* మూడు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయలు పెరిగింది. దీంతో 39,750 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 36,440 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి 10 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,860 రూపాయల వద్ద నిలిచింది.
* జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. కాగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.10కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేసినట్లు జాతీయ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) వెల్లడించింది. ‘ఇప్పటివరకు పలు పాయింట్ ఆఫ్ సేల్స్ ద్వారా 1.10కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశాం. రోజుకు దాదాపు 1.5 నుంచి 2 లక్షల వరకు ఫాస్టాగ్‌లు విక్రయమవుతున్నాయి. అంటే డిజిటల్ వ్యవస్థను వాహనదారులు అంగీకరిస్తున్నారు’ అని ఎన్‌హెచ్‌ఏఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఫాస్టాగ్‌ల వల్ల టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ టోల్ వసూలు రోజుకు రూ.46కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. రోజువారీగా దాదాపు 24లక్షల ఫాస్టాగ్ టోల్ లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిపారు.
* పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన ఆరోపణలతో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరక్టర్ జగదీష్ ఖట్టర్‌ను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అదుపులోకి తీసుకుంది. ఖట్టర్, ఆయన కంపెనీ కార్‌నేషన్ ఆటో ఇండియా లిమిటెడ్‌లు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు (పీఎన్‌బీ) రూ.110 కోట్ల రూపాయల మేరకు నష్టం కలిగించినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఖట్టర్ మారుతిలో 1993 నుంచి 2007 లో తాను పదవీ విరమణ చేసేంతవరకు కొనసాగారు. అనంతరం కార్‌నేషన్‌ను స్థాపించిన ఆయన, దానికోసం 2009లో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.170 కోట్ల రుణాన్ని పొందారు. కాగా ఈ రుణం 2012 నుంచి నిరర్ధక ఆస్థిగా ఉన్నట్టు 2015లో ప్రకటించారు. ఖట్టర్, కార్‌నేషన్‌లు బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తులను అనధికారికంగా, అనుమతి లేకుండా అమ్మేసినట్టు, ఆ నిధులను దారి మళ్లించినట్టు సీబీఐ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు నేరపూరిత కుట్ర, మోసాలకు పాల్పడినందుకు జగదీష్ ఖట్టర్, ఆయన సంస్థలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ రుణ వ్యవహారంలో కార్‌నేషన్‌కు ఖట్టార్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కార్‌నేషన్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, కార్‌నేషన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడు సంస్థలు హామీ ఇచ్చాయి. కాగా కార్‌నేషన్‌కు హామీ ఇచ్చిన కంపెనీలతో సహా మరో ఐదుగురు వ్యక్తులకు ఈ విషయంలో ప్రమేయం ఉన్నట్టు పీఎన్‌బీ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ కుంభకోణంలో వారి పాత్ర ఏ మేరకు ఉన్నదీ విచారణ అనంతరం మాత్రమే వెల్లడవుతుందని సీబీఐ అంటోంది.
* ఆటోమొబైల్ అభిమానులకు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే నిరాశ ఎదురుకానుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆటోమొబైల్ కంపెనీలకు కూడా ఇబ్బందికరమైన విషయమే. ఆర్థిక మందగమనం కారణంగా అసలే కార్ల విక్రయాలు పడిపోయి గగ్గోలు పెడుతున్న సమయంలో తప్పనిసరిగా ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటి వరకు ఒకటి రెండు కంపెనీలు తప్ప మిగిలినవన్నీ 2020 నుంచి ధరల పెంపు ఖాయమని ప్రకటించేశాయి. అసలు ధరల పెంపునకు కారణాలేంటీ.. ధరలను పెంచే కంపేనీలు ఏవో తెలుసుకుందాం..! కేలండర్ మారగానే ధరలు పెంచడం ఆటోమొబైల్ కంపెనీలకు కొత్తేమీ కాదు.. 2019 ప్రారంభంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ, ఈసారి పెంపు కొంచె భిన్నంగా ఉండనుంది. కొన్ని కంపెనీలు ఈ ఏడాది మధ్యలోనే ధరలు పెంచాయి కూడా . ఉదాహరణకు హోండా కార్ల ధరలు రెండుసార్లు పెరిగాయి. అన్ని కంపెనీల కార్లపై ఈసారి పెంపు గతంతో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉండొచ్చు. చాలా కంపెనీలు ఏఐఎస్ 145 నిబంధనలను అమలు చేస్తూ డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లను జతచేయడంతో కూడా ఈ ధరల పెంపు చోటు చేసుకొంది. భారత్‌స్టేజ్-6 నిబంధనలు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటంతో ఆటోమొబైల్ తయారీదారులపై భారం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా కొత్త ఇంజిన్ల అభివృద్ధి కోసం పరిశోధన-అభివృద్ధి విభాగాలపై పెట్టుబడులు ఎక్కువ కావడంతో ఈపరిస్థితి నెలకొంది. దీంతో పెట్రోల్ ఇంజిన్లు 1.5శాతం నుంచి 2శాతం వరకు పెరిగే అవకాశం ఉండగా.. డీజిల్ ఇంజిన్లు 10శాతం వరకు ధర పెరగొచ్చు. మరోపక్క విడిభాగాలు, విడిభాగాలకు ఉపయోగించే మెటీరియల్ ధరలు కూడా పెరిగాయి. ఈ భారాన్ని తయారీదారులు వినియోగదారులకు బదిలీ చేస్తున్నారు. దీంతోపాటు రవాణా ధరలు కూడా 2 నుంచి 2.5శాతం పెరగడంతో రేట్లపెంపు తప్పలేదు. కార్ల విక్రయాలు పడిపోవడంతో ఉత్పత్తి తగ్గింది.. దీంతో కొన్ని రకాల నిర్వహణ వ్యయాలు తప్పవు. ఇవన్నీ కంపెనీలకు భారంగా మారాయి. దీంతో అవి ధరలను పెంచుతున్నాయి.
* మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలో మరిన్ని మార్పులు చోటు చేసుకొన్నాయి. ఇవి 1 ఏప్రిల్ 2020 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే వచ్చే 15నెలల్లో కంపెనీ కీలక లీడర్లు పవన్ గోయంకా, రాజీవ్ దుబే వంటి వారు రిటైరైపోతున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త నాయకత్వాన్ని కొత్త మేనేజింగ్ పొజిషన్లలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆటోమోటీవ్ విభాగంలో పనిచేస్తున్న రాజన్ వాదేరా ఏప్రిల్2020లో పదవీవిరమణ చేయనున్నారు. ఇక విజయ్ నక్రను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సీఈవోగా నియమించనున్నారు. ‘‘ప్రయాణికుల, వాణిజ్య వాహనాల వ్యాపారాల లాభనష్టాలను వచ్చే ఏడాది నుంచి చూసుకొంటారు. వాహనాల అభివృద్ధి మాత్రం ఆయన పరిధిలో ఉండదు’’ అని ఎంఅండ్‌ఎం తెలియజేసింది. ఇక ఆటోమోటీవ్ విభాగం చీఫ్ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అధికారిగా ఆర్. వేలుస్వామిని నియమించారు. హేమంత్ సిక్కాను పరికరాల విభాగానికి చీఫ్‌గా నియమించారు. ప్రస్తుతం మహీంద్రా ట్రక్ అండ్ బస్ విభాగానికి, నిర్మాణ విభాగానికి సీఈవోగా ఉన్న వినోద్ సహాయన్‌ను ఆటోవిభాగంలో చీఫ్ పర్చేజింగ్ ఆఫీసర్‌గా నియమించనున్నారు. వీరంతా ప్రస్తుత వ్యవసాయ విభాగం అధ్యక్షుడు రాజేష్ జెజుర్కర్‌కు రిపోర్టు చేస్తారు. రాజేష్ ఏప్రిల్ నుంచి ఆటోమోటీవ్, వ్యవసావిభాగానికి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా నియమితులు అయ్యారు.