NRI-NRT

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ఘనంగా ఏర్పాట్లు

2019 4th Telugu Writers Conference In Vijayawada

విజయవాడలో డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో జరిగే 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు దేశవిదేశాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లండ్‌, మారిషస్‌, మలేసియా, దక్షిణకొరియా తదితర దేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు. మొత్తం 1600 మంది తెలుగు రచయితలు, సాహితీవేత్తలు ఇప్పటివరకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి ఎక్కడా లోటు లేకుండా ఉండేలా ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు సాదరంగా స్వాగతం పలకడంతో పాటు నోరూరించే తెలుగు రుచులను వడ్డించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో అరిసెలు, చక్రాలు, బూందీ, లడ్డూ, బొబ్బట్లు, పూర్ణం బూరెలు సహా అన్ని తెలుగు వంటకాలనూ వడ్డించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రకాశం జిల్లా నుంచి 45 మందితో కూడిన సాహితీ బృందం, ఖమ్మం, కర్నూలు నుంచి 35 మందితో కూడిన బృందాలు వస్తున్నాయి. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది పాల్గొనేందుకు నమోదు చేయించుకున్నారు. మహోత్సవానికి వస్తున్న వారిలో మహిళా రచయితలు 50 శాతం కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. పాల్గొంటున్న వారిలో 1100 మంది డాక్టరేట్లు పొందిన ప్రముఖులు, వంద మంది వరకు అధ్యాపకులు ఉన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు రచయితలూ 50 మంది వరకు పేర్లు నమోదు చేయించుకున్నారని ప్రపంచ తెలుగు రచయితల సంఘం నిర్వాహక కార్యదర్శి జి.వి.పూర్ణచందు తెలిపారు.