అన్ని విటమిన్లు శరీరారోగ్యానికి అవసరమే అయినా ఒక్కొక్క విటమినుకి శరీరంలో ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. విటమిన్ ‘డి’ మన శరీరంలోని ఎముకలకి, గుండెకు చాలా అవసరం. డి విటమిన్ 30 నుంచి 100 యూనిట్ల వరకు ఉండడం అత్యవసరం. 30 కంటే తక్కువ ఉన్నవారికి రకరకాల బాధలు చిన్నవి, పెద్దవి కంప్లయింట్లు ఉంటాయి. ఇవి చాపకింద నీరులా మెల్లమెల్లగా చేరి, చివరికి నడుములోని ఎముకలు, కాలి తుంటి ఎముకలు, చేతి ఎముకలలోని పటిష్టతను దెబ్బతీస్తాయి. అయితే ఈ విటమిను శరీరానికి ఎలా లభ్యమవుతుంది? ఆహారం ద్వారా, సూర్యరశ్మి ద్వారా కూడా లభిస్తుంది. ఆహారం అంటే విటమిన్లు చేర్చిన పాలు, పండ్లరసాలు, వెన్న, జున్ను, చేపలు(ముఖ్యంగా ట్యూనా చేప), పుట్టగొడుగులు, కాడ్లివర్ ఆయిల్ మొదలైన పదార్థాల్లో మొదలైన పదార్థాలలో పుష్కలంగా దొరుకుతుంది. గుడ్డులోని పచ్చసొనలో కూడా బాగా దొరుకుతుంది. అయితే శాకాహారులకి ఇది కొంచెం తక్కువ కనుక వారిలో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుంది. శాకాహారులు చాలామంది వంగిపోయిన నడుముతో ఉండడానికి ఇది ఒక కారణం. ఎముకలు త్వరగా విరుగుతాయి కూడా. విటమిన్ డి తక్కువైన వారికి సంతానలేమి, గర్భిణీలకు రక్తపోటు ఎక్కువ కావడం..(దీనే్న గర్భవాతం అంటారు) కలుగుతాయి. చిన్నపిల్లలకి రికెట్సు అనే మరుగుజ్జు వ్యాధి వస్తుంది. ఎముకలు వంకరగా పెరిగి దొడ్డి కాళ్లు, వంకర కాళ్లు వస్తాయి. వాళ్లు పొట్టిగా కూడా ఉంటారు. పుట్టిన శిశువు బరువు మామూలు కంటే తక్కువగా ఉంటుంది. దీనికి తోడు నెలలు పూర్తికాకుండా కాన్పు వచ్చే అవకాశం హెచ్చు. ఈ విటమిన్ లోపం గల తల్లులకు నవజాత మరణాలు, శిశుమరణాలు కూడా ఎక్కువ.
ఒకవేళ ఆడపిల్లకి చిన్నతనంలో లోపం వస్తే ఆమె పెల్విక్ బోను చిన్నదిగాను, వంకరగాను ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆమె భవిష్యత్తులో గర్భం ధరిస్తే ప్రసవం కష్టతరమవుతుంది. దీనే్న రికెట్ ఫ్లాట్ పెల్విస్ అంటారు. వీరికి సిజేరియన్ ద్వారా పాపను తీయవలసి ఉంటుంది. విటమిన్ డి లోపం ఎలా కనిపెట్టాలి? కొన్ని లక్షణాలు జాగ్రత్తగా గమనిస్తే త్వరగా ఈ లోపం బయటపడుతుంది. ఉదాహరణకు అప్పుడే జన్మించిన శిశువుకి తలలో విపరీతమైన చెమట పడుతుంది. ఎందుకంటే స్వేదగ్రంధులు సరిగా పనిచేయవు కాబట్టి. స్ర్తిలకి ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు, దంతాల్లో పుచ్చులు కనిపిస్తాయి. విపరీతమైన ఎముకల నొప్పులు ఉంటాయి. చేతులను వత్తినప్పుడు చాలా నొప్పి, ముంజేతుల దగ్గర ఎముకల బలహీనత వంటి లక్షణాలు ఉన్నప్పుడు అది విటమిన్ డి లోపంగా అనుమానించాలి. ఛాతి ఎముక ఒత్తినప్పుడు కూడా నొప్పి వస్తుంది. ఎందుకంటే ఛాతి ఎముక మిగిలిన ఎముకల కంటే పల్చగా, సున్నితంగా ఉంటుంది.
ఈ సమస్యను అధిగమించాలంటే పౌష్టికాహారం అవసరం. పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ప్రొటీను ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వాలి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉండే ఎండ ద్వారా అల్ట్రావయొలెట్ కిరణాలు శరీరానికి లభిస్తాయి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు, బురఖాలు విటమిను డి లోపానికి కారణం అవుతాయి. ఆహారం వల్ల లభించే విటమిన్ డి కంటే ఎండవల్ల లభించే విటమిన్ డి రెండు రెట్లు ఎక్కువకాలం శరీరంలో నిల్వ ఉంటుంది. శరీరం చామనఛాయలో ఉన్నవారు ఎక్కువ సమయం ఎండలో గడపాలి. ఎందుకంటే అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మంలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుంది నల్లవారికి. అయితే వృద్ధులు, పసిపిల్లలు ఎక్కువ ఎండలో ఉండలేరు కనుక వారికి విటమిన్ డి మాత్రలు కానీ, సిరప్కానీ, శిశువులకు చుక్కలమందుగా కానీ ఇవ్వవలసి ఉంటుంది. రక్తపరీక్షలో తక్కువ అంటే 30 నానోగ్రాములకంటే తక్కువగా ఉంటే వారానికి అరవై వేల యూనిట్లు గల ఒక మాత్ర చొప్పున ఎనిమిది వారాలు అంటే రెండు నెలలు కాల్షియంతో పాటుగా తినిపిస్తే పరిస్థితి చక్కబడుతుంది. పాపలకి డి డ్రాప్సు చుక్కల మందు ఇవ్వాలి. ఇలా ముందే విటమిన్ డి లోపాన్ని గుర్తిస్తే ఎన్నో చికాకులు రాకుండా చూసుకోవచ్చు. *