ఉరుకుల పరుగుల జీవితం.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కాలంతో పోటీ పడుతూ పరుగెత్తాలి. ఆకలేస్తే ఏది పడితే అది తినాల్సి వచ్చేది. అలా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో నగర వాసుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. భిన్నంగా ఆలోచిస్తూ రోజూ తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు ఉండే విధంగా చూసుకుంటున్నారు. అరికల దోశ, సజ్జలతో ఇడ్లీ, ఊదల ఉప్మా, సామెలతో జామకాయ అన్నం, కొర్రల కొత్తిమీర అన్నం, ఆకుల కషాయం, రాగి జావ, ధనియాలు-జీలకర్ర సూప్, అవిసె గింజలు, తాటిబెల్లంతో లడ్డూ.. ఇలా ప్రతీది నగర ప్రజల రోజువారీ మెనూలో చేరిపోయింది. ఆహార ప్రియులు చిరుధాన్యాల (మిల్లెట్స్)తో చేసిన ఆహారానికే ఇప్పుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
**తీపి పదార్థాలు
చిరుధాన్యాలను ఉయోగించి తీపి పదార్థాలు కూడా తయారు చేసుకోవచ్చు. మధుమేహం బారిన పడతామనే బాధ ఉండదు. అవిసె గింజలు, నువ్వులు, తమలపాకుల మిశ్రమం, తాటిబెల్లం, తాటి కలాకండతో లడ్డూలను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా రాగి సంకటి, జొన్నరొట్టెలను ఉదయం, సాయంత్రం వేళలో అల్పాహారంగా అందుబాటులో ఉంచుతున్నారు మిల్లెట్స్ హోటళ్ల నిర్వాహకులు.
*.సంపూర్ణ ఆరోగ్యానికే..
సంపూర్ణ ఆరోగ్యం కోసం తిరిగి పాత కాలపు ఆహారాన్ని తీసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం 38 గ్రాముల ఫైబర్ కావాలి. రోజూ తీసుకునే ఇతర ఆహారాలలో అంత మోతాదులో ఫైబర్ లభించదని నిపుణులు చెబుతున్నారు. చిరుధాన్యాలను మూడు పూటలా తీసుకోవడంవల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ పుష్కలంగా దొరుకుతుందని సూచిస్తున్నారు. పూర్తిగా కొర్రలు, ఇతర వాటితో చేసిన వంటలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు చర్మ, ఊపిరితిత్తులు, కిడ్నీ, ఆటిజం తదితర సమస్యలున్న వారిలో క్రమంగా మార్పులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
*రోజువారీ ఆహారంలో..
బయటకు వెళ్లి భోజనం చేయాలంటే చాలామంది జంకుతున్నారు. నాణ్యమైన ఆహారం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొంతమంది వైద్యుల సలహాల మేరకు వారు చెప్పిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పద్దతిలో సహజసిద్ధంగా చిరుధాన్యాలను పండిస్తారు. వీటితో చేసిన ఆహారాన్ని రోజూ తీసుకుంటే జీవనశైలిలో మార్పులు వస్తాయని ఆహార నిపుణులు వెల్లడించారు. బరువు తగ్గడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో అందరి అభిరుచులకు తగ్గట్టుగా మిల్లెట్స్ దుకాణాలు, హోటళ్లు నగర వ్యాప్తంగా వెలుస్తున్నాయి.
చిరుధాన్యాలు తీసుకోవడం ఆరంభించండి
Related tags :