DailyDose

జగన్ తప్పక జైలుకే-తాజావార్తలు-12/25

Jagan Will Go To Jail-Telugu Breaking News Roundup-12/25

* దేశంలో భూగర్భ జలాల సమర్థ యాజమాన్యానికై ఉద్దేశించిన అటల్‌ భూజల్‌ యోజన పథకాన్ని (ఏబీవై) ప్రధానమంత్రి మోదీ నేడు ప్రారంభించారు. ఏడు రాష్ట్రాలలో ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకం అమలు జరుగుతుందని, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 95వ జన్మదినం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ప్రకటించారు. మొత్తం రూ.6000 కోట్ల వ్యయం కానున్న ఈ కేంద్ర ప్రభుత్వ పథకం, 2020-21 నుంచి 2024-25 వరకు ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.

* తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 58ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. ఈమేరకు సంబంధిత ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా సీఎం ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.

* ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మంత్రిమండలి భేటీ జరిగే రోజు ..మంత్రులు సచివాలయానికి వెళ్లే దారిలో నిరసనలకు అనుమతి నిరాకరించారు. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రహదారి పక్కనున్న ఇళ్ల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 27వ తేదీ రైతుల నివాసాల్లో కొత్త వ్యక్తులు ఉండకూడదని, గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు.

* రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలు ఎప్పుడూ సమాజం కోసమే కృషి చేస్తారని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. సరూర్‌ నగర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సార్వజనిక సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాలు, వైభవాలు, మోక్షం కోరుకోని వాళ్లు ధర్మ విజయం సాధిస్తారన్నారు. ధర్మ విజయంలో అందరి విజయం ఉంటుందని చెప్పారు. ‘‘స్వార్థం కోసం కొంతమంది ఇతరులను భయపెట్టి పైకి వస్తారు. ఇలాంటివారు దేశానికి ప్రమాదకరం’’ అని మోహన్‌ భగవత్‌ అన్నారు.

* రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారని.. కానీ గత ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మందడం, వెలగపూడిలో రైతుల దీక్షలకు కన్నా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని మారుస్తామని అనడం అవివేకమన్నారు. మూడు రాజధానులు అనేది పిచ్చి ఆలోచన అని.. దీనిని అమరావతిలోనే ఉంచాలనేది భాజపా విధానమని కన్నా స్పష్టం చేశారు.

* మన పెద్దల నుంచి తరతరాలుగా ఎలాంటి వీలునామా రాయకుండానే సంక్రమించిన ఆస్తి తెలుగు పద్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టులో ఏర్పాటు చేసిన ‘పద్య వైభవం’ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంగ్ల భాష మోజులోపడి నేటి తరం మాతృభాషను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆంగ్లం నేర్చుకోవడం తప్పుకాదు.. అవసరమే, కానీ అమ్మ భాషను మర్చిపోకూడదన్నారు.

* ఝార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ను ఆ రాష్ట్ర గవర్నర్‌ ద్రౌపది ముర్ము ఆహ్వానించినట్లు పార్టీ వెల్లడించింది. అటు హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబరు 29న సోరెన్‌ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ​​​​​​​​​​​​​​

* సీఎం జగన్‌కు గ్రేటర్‌ రాయలసీమ నేతలు లేఖ రాశారు. గ్రేటర్‌ సీమలో రాజధాని ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే 2014, 2019 ఎన్నికల్లో వైకాపా నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఒరిగిందేమీ లేదన్నారు. అసెంబ్లీలో సీఎం ఏం చెప్పారో.. జీఎన్‌ రావు కమిటీలో అదే ఉందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ సమర్థిస్తూనే.. రాయలసీమకు న్యాయం జరగాలని లేఖలో ఆకాంక్షించారు. ​​​​​​​

* అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన పైలట్లు కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరికి ఘాటు లేఖ రాశారు. తమకు సత్వరమే బకాయిలు చెల్లించాలని, ఎలాంటి నోటీసు పీరియడ్‌ లేకుండా ఉద్యోగాల నుంచి వైదొలిగే సదుపాయం కల్పించాలని కోరారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఇండియన్‌ కమర్షియల్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ (ఐసీపీఏ) ఈ మేరకు లేఖ రాసింది. ​​​​​​​

* సీఎం జగన్‌ మూడు రోజుల కడప జిల్లా పర్యటన ముగిసింది. చివరిరోజు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.పులివెందుల నియోజకవర్గానికి 26 పథకాలకు సంబంధించిన రూ.1327 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

* క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడలోని సెయింట్‌పాల్‌ కేథడ్రిల్‌ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర సందేశం అందించిన క్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. దయ, కరుణ, శాంతి సందేశాలు క్రీస్తు అందించారని, మంచిని గుర్తించడం, గౌరవించడం బైబిల్లో పొందుపరిచారని చెప్పారు.

* విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిగితే సీఎం జగన్‌ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా మాట్లాడుతూ… గత ఏడు నెలలుగా విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమాలను వెలుగులోకి తెస్తామన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికే రాజధాని మారుస్తున్నారని మండిపడ్డారు.

* అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు అభిమానుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద అభిమానులతో కలిసి ఫోటోలు దిగేందుకు బుధవారం నిర్వాహకులు షూట్ ఏర్పాటు చేశారు. మహేశ్‌ను చూసి, ఆయనతో ఫొటోలు దిగేందుకు అధిక సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. వేల సంఖ్యలో అభిమానులు గుమిగూడటంతో తోపుటాల జరిగి, పలువురికి గాయాలైనట్లు సమాచారం.

* వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా ఓపెన్‌కు నగదు బహుమతిని నిర్వాహకులు భారీగా పెంచారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి ఏకంగా 13.6 శాతానికి పెంచారు. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రైజ్‌మనీ రూ.350 కోట్లకు చేరింది. పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు నగదు బహుమతి రూ.20 కోట్లు దక్కనుంది. తొలి రౌండ్‌లోనే నిష్క్రమించేవారికి రూ.44 లక్షలు, రెండో రౌండ్‌లో ఇంటిముఖం పట్టేవారికి రూ.63 లక్షలు ఇవ్వనున్నట్లు టోర్నీ డైరెక్టర్‌ క్రేగ్‌ టిలే తెలిపారు.

* మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే భద్రతను పెంచారు. ఇప్పటివరకు ఆయనకు వై ప్లస్‌ కేటగిరీ భద్రత ఇవ్వగా.. తాజాగా దాన్ని జడ్‌ కేటగిరీకి పెంచారు. ఇక క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ భద్రతను తగ్గిస్తూ మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు ఉండే ముప్పు అంశాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వ కమిటీ ఇటీవల సమావేశమై ప్రముఖుల భద్రతను సమీక్షించింది.

* మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం నస్రూల్లాబాద్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, ఏడాది చిన్నారి, దంపతుల బంధువు ఉన్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

* వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)లో ప్రస్తుతమున్న నాలుగు శ్లాబులకు బదులుగా 2 శ్లాబులు ఉంటే సరిపోతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ అన్నారు. అంతేగాక, జీఎస్‌టీ రేట్లను తరచుగా మార్చకుండా.. ఏడాదికోసారి సవరించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

* టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. స్ట్రోక్‌ ప్లేయర్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించడానికి గల కారణాన్ని ఆ జట్టు కోచ్‌, భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే చెప్పాడు. రాహుల్ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని కెప్టెన్‌గా నియమించామని, ఈ బాధ్యతలు అతడికి ఎంతో దోహదపడతాయని తెలిపాడు.