రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారని.. కానీ గత ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో రాజధానిని అభివృద్ధి చేస్తామని మాటిచ్చి ఇప్పుడు ఎందుకు తప్పారని ఆయన ప్రశ్నించారు. మందడం, వెలగపూడిలో రైతుల దీక్షలకు కన్నా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని మారుస్తామని అనడం అవివేకమన్నారు. జగన్ నాయకత్వంలో రాజధానికి అడ్రస్ లేని పరిస్థితి దాపురించిందని మండిప్డడారు. రాజధానిని ఇష్టం వచ్చినట్లు ఇది వైకాపా కార్యాలయం కాదని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అనేది పిచ్చి ఆలోచన అని.. దీనిని అమరావతిలోనే ఉంచాలనేది భాజపా విధానమని కన్నా స్పష్టం చేశారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ అమరావతిలో అవినీతి జరిగిందని చెబుతూ విశాఖ కేంద్రంగా వైకాపా ప్రభుత్వం మరో అవినీతికి తెరలేపుతోందని విమర్శించారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే రీతిలో రాజధాని తరలింపు వ్యవహారం ఉందని ఆక్షేపించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ఓట్లనే వెతుక్కుంటోందని ఆయన ఆరోపించారు. ప్రతి జిల్లాలోనూ రాజధాని ఉండాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ…రాజధాని వికేంద్రీకరణ కాదన్నారు. మరో నేత రావెల కిశోర్‌బాబు మాట్లాడుతూ రాజధాని తరలింపు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కేంద్రం ఆశీస్సులు రాజధాని రైతులకు ఉంటాయన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధానిలో అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై ఆరోపణలున చేసిన మంత్రి బుగ్గన వాటిని నిరూపించగలరా? అని సవాల్ విసిరారు.
అదో పిచ్చి ఆలోచన
Related tags :