Politics

జగన్‌కు వైజాగ్ వాసుల రెడ్ కార్పెట్

Vizag People Grand Welcomes YS Jagan

మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలిసారిగా విశాఖ విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. కైలాసగిరిలో, వైఎస్‌ఆర్‌ సెంట్రల్‌ పార్క్‌లో జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్‌ను సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రారంభ వేడుకలో పాల్గొన్న విశాఖ తూర్పు నౌకా దళాధిపతి వైఎస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ను సీఎం జగన్‌ శాలువాతో సత్కరించారు. సీఎం జగన్‌ను మంత్రి అవంతి శ్రీనివాస్‌ జ్ఞాపికతో సత్కరించారు. విశాఖ ఉత్సవ్‌ ప్రారంభం సందర్భంగా.. విశాఖ ప్రత్యేకతను ఆవిష్కరించేలా ప్రత్యేక లఘుచిత్రం ప్రదర్శించారు. భారీ బాణ సంచా పేలుడుతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్‌ షో సందర్శకులను ఆకట్టుకుంది. భారీగా తరలివచ్చిన విశాఖ వాసులతో సాగరతీరం కళకళలాడింది. విశాఖ ఉత్సవ్‌లో అరగంట పాటు గడిపిన సీఎం.. తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అమరావతి వెళ్లారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విశాఖ ఉత్సవ్‌లో పాల్గొన్న సీఎం … ఎక్కడా ప్రసంగించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి విశాఖలో ఘన స్వాగతం లభించింది. వీఎంఆర్డీఏ చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు విశాఖ విచ్చేసిన జగన్‌కు దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా కైలాసగిరికి సీఎం కాన్వాయ్‌ బయలుదేరింది. ఈక్రమంలో అభిమానులు ఒక్కసారిగా సీఎం కాన్వాయ్‌ వద్దకు దూసుకొచ్చారు. దీంతో సీఎం వాహనాన్ని పక్కకు నిలిపి జనాలను పోలీసులు అదుపు చేశారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరి వరకు దాదాపు 27కి.మీ పొడవునా మానవహారంగా ఏర్పడి విశాఖ వాసులు స్వాగతం పలికారు. కారులో ఉన్న సీఎంతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.