Fashion

పాత దుస్తులు పారేయకుండా నూతనంగా చేసుకోవచ్చు

How to convert old clothes to new using designs

చీరలు, టీ షర్ట్‌లు… డ్రెస్‌లు ఏవైనా పాతబడ్డాక పారేయాల్సిందే! కానీ అలా పారేయడానికి మనసొప్పకపోతే హిమాన్షికి పంపితే చాలు ఆమె తన కళా నైపుణ్యంతో వాటిని కొత్తవాటిలా మారుస్తారు. పాత దుస్తులపైన సరికొత్త అద్భుతాలు చేస్తారు. హిమాన్షికి పాత దుస్తులు అప్పజెప్పి, కావాల్సిన డిజైన్ల వివరాలు చెబితే చాలు.. వాటిని కొత్త దుస్తుల్లా మార్చి ఖాతాదారుల చేతుల్లో పెడతారు. వాటిని ధరించి మురిసిపోవాల్సిందే! రకరకాల పద్ధతుల్లో సృజనాత్మకంగా పాత వస్త్రాల మీద ఆమె పెయింటింగ్‌లు, డిజైన్లు వేస్తారు.

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ‘‘వారానికి 15 నుంచి 20 వరకూ ఆర్డర్లు వస్తున్నాయి. వాటిలో భువనేశ్వర్‌, కటక్‌ల నుంచి వచ్చేవే ఎక్కువ. వినియోగదారులతో మాట్లాడి, వారి అభిరుచి మేరకు ఎలాంటి డిజైన్‌లు వేయాలో నిర్ణయిస్తారు. ముందుగా రఫ్‌ డ్రాఫ్ట్‌ గీసి, కస్టమర్‌ అంగీకారం తెలిపాక దుస్తులపైన వాటిని డిజైన్‌ చేస్తా’’ అని ఈ నవతరం యువతి చెప్పారు. ఎక్కడైనా ప్రింట్‌ను బట్టి ధర ఉంటుంది. కానీ పాత దుస్తులపైన ప్రింట్‌ వేసినందుకు హిమాన్షి మాత్రం 200 రూపాయలే తీసుకుంటున్నారు. హిమాన్షి పనితనం ఇప్పుడు ఎంతోమందిని ఆకర్షిస్తోంది. చిత్రమేమిటంటే… పాత దుస్తులే కాదు, కొంతమంది కొత్త దుస్తులు కూడా తెచ్చి ఇస్తున్నారు. వాటిపైన ఫ్రెష్‌ ప్రింట్స్‌ వేసి అందిస్తారు హిమాన్షి.
‘‘ప్రత్యేకమైన డిజైన్లు, ప్రింట్లు నా సొంతంగా రూపొందిస్తాను.

ఇవి బయట ఎక్కడా కనిపించవు. మొదట్లో నా కోసమే సొంతంగా తయారు చేసుకునేదాన్ని. అవి బాగా నచ్చడంతో కొత్త దుస్తుల కన్నా ఎక్కువగా పెయింటింగ్‌ వేసిన పాత దుస్తులనే ధరించేదాన్ని. ఈ విధానం ఇప్పటి ట్రెండ్‌కు బాగా సూటవుతుంది. అలాగే పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. బూట్లపైన కూడా నేను ఇలాంటి డిజైన్లు వేయగలను. కానీ ప్రస్తుతం పరీక్షలు ఉండడంతో పక్కనపెట్టాను. పెయింటింగ్‌ నా హాబీ మాత్రమే. దాన్ని నేను వృత్తిగా చేపట్టాలనుకోవడం లేదు. చదువు పూర్తయ్యాక అడ్డర్టైజింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నా’’ అని హిమాన్షీ శర్మ చెప్పారు. మొత్తానికి హిమాన్షి పనితనాన్ని తమ పాత దుస్తులపై చూసి, మురిపిపోతున్న వారంతా ‘‘కొత్త కళ తెచ్చేసిందే బాలా…’’ అని ఆనందంగా పాడుకుంటున్నారు.