* భారత వాహన రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ మారుతీ సుజుకీకి చెందిన ‘డిజైర్’ కారుకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో అత్యధిక విక్రయాలతో తొలి స్థానంలో నిలిచింది. ఏప్రిల్-నవంబరు మధ్య 1.2లక్షల ‘డిజైర్’ కార్లు అమ్ముడు పోయినట్లు మారుతీ సుజుకీ మంగళవారం ప్రకటించింది. ఏటా భారీ విక్రయాలు నమోదు చేస్తున్న ఈ మోడల్ ఇటీవలే 20లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఒక్క 2018-19 సంవత్సరంలోనే 2.5లక్షల కార్లు అమ్ముడు పోవడం గమనార్హం. స్విఫ్ట్ డిజైర్ తొలితరం మోడల్ 2008లో మార్కెట్లోకి వచ్చింది. అనంతరం కొన్ని మార్పులతో 2012లో రెండోతరం రోడ్లపైకి ప్రవేశించింది. ప్రస్తుతం ఉన్న మూడోతరం డిజైర్ పేరిట 2017లో మార్కెట్లోకి అడుగుపెట్టింది.
* ప్రభుత్వ ఆదాయం స్థిరపడే వరకు జీఎస్‌టీ రేట్లను పెంచేది లేదని బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. ఏడాదికి ఒక సారి మాత్రమే రేట్లను సవరించాలని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయంచిందని ఆయన అన్నారు. అంతేకానీ, ప్రతి సమావేశంలో సవరించే అవకాశం లేదని తెలిపారు. ‘‘ఒక్క రాష్ట్రం, కేంద్రం కూడా పన్నురేట్లను పెంచేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవని నేను చెప్పగలను. అదే సమయంలో రేట్లను తగ్గించే అవకాశం కూడా లేదు. ఆర్థిక మందగమనం సమయంలో మీరు పన్ను తగ్గించలేకపోతే.. పన్నును పెంచకూడదు. వినిమయాన్ని పెంచాలంటే మాత్రం మీరు సుంకాలు, పన్ను రేట్లను తగ్గించాలి. పెంచకూడదు.’’ అని ఫిక్కీ 92వ వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జీఎస్‌టీ అమలుకు ముందుతో పోలిస్తే 99శాతం వస్తువులపై పన్నుభారం తగ్గిందని సుశీల్ మోదీ తెలిపారు. ప్రస్తుతం తప్పుడు బిల్లులు పెద్ద తలనొప్పిగా మారాయన్నారు. దీని నివారణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
* ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా 2019 సంవత్సరానికి శనివారం విభిన్నంగా వీడ్కోలు పలికారు. ఇదే రోజు తన 82వ పుట్టిన రోజు కావడంతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారికి ధన్యవాదాలు చెబుతూ.. ఈ దశాబ్దంలో తన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. బెంగళూరు ఎయిర్ షోలో ఎఫ్18 సూపర్ హార్నెట్ విమానంతో దిగిన చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఈవిధంగా పేర్కొన్నారు. ‘ఇది కేవలం 2019 సంవత్సరానికి మాత్రమే కాదు.. ఈ దశాబ్దానికి కూడా ఇది చివరి అంకం. రాబోయే కొత్త దశాబ్దానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. ఇది మీ ఆశయాలు నిర్వర్తించడానికి, ఏదైనా సృష్టించడానికి, కొత్త బంధాలు కలపడానికి, చరిత్రలు రాయడానికి మంచి సమయం. బెంగళూరు ఎయిర్ షో సందర్భంగా నేను ఎఫ్18 సూపర్ హార్నెట్‌లో విహరించాను. అది నాకు ఈ దశాబ్దంలో ఎంతో ప్రత్యేకమైన సందర్భం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. ఆయన పోస్ట్ చేసిన వెంటనే లక్షల మంది ఆ ఫొటోను వీక్షించారు. 1.7లక్షల మంది ఆయన పోస్ట్‌ను లైక్ చేశారు.