Movies

రాజశేఖర్ రాజీనామా

Rajasekhar Resigns To MAA Position

మా కార్య నిర్వాహక ఉపాధ్యక్ష పదవికి సినీ నటుడు రాజశేఖర్‌ రాజీనామా చేశారు. గురువారం ‘మా’ నూతన  డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి మాట్లాడిన అనంతరం మైక్‌ తీసుకుని రాజశేఖర్‌ ఆవేశంతో ప్రసంగించారు. ‘మా’లో గొడవలున్నాయంటూ మరోసారి ప్రస్తావించారు. దీంతో స్టేజ్‌పై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబుతోపాటు ఇతర నటీనటులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘మార్చిలో ‘మా’ కొత్త కార్యవర్గం ప్రారంభమైన నాటి నుంచి తాను ఒక్క సినిమా కూడా చేయలేదని అసోసియేషన్‌ కోసం తాను కష్టపడుతున్నానని అన్నారు.  అందరం కలిసే నడవాలని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారన్న రాజశేఖర్ నిప్పును కప్పిపుచ్చితే పొగ వస్తుందన్నారు.‘మా’లో గొడవలున్నాయని, రియల్‌ లైఫ్‌లో హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలను చిరంజీవి వెంటనే ఖండించారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ‘మా’ను కోరారు. అనంతరం కొద్దిసేపటికి రాజశేఖర్‌ సతీమణి జీవిత కలగజేసుకుని, జరిగిన దానికి క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న వరుస పరిణామాలకు మనస్థాపానికి గురైన రాజశేఖర్‌ ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేశారు. 

టు,
మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌)
డియర్‌ ఆల్‌..
‘‘ఈ లేఖ ద్వారా నా మనస్సులో ఉన్నదంతా మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. నేను ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి అసోసియేషన్‌ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తూ, ఉత్తమంగా పనిచేస్తున్నా. అయితే, ‘మా’లో సమస్యలను పరిష్కరించడానికి బదులు అధ్యక్షుడు నరేశ్‌ కమిటీ సభ్యులను ఉద్దేశించి కించపరిచేలా, అవమానకరంగా మాట్లాడుతున్నారు. పారదర్శకతకు నీళ్లొదిలి, పదే పదే తప్పులు మీద తప్పులు చేస్తూ, మెజార్టీ సభ్యులు ఆమోదించిన నిర్ణయాలను పక్కన పెడుతున్నారు. అదే సమయంలో ఆయనకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడిన ఏ విషయాన్ని మాతో చర్చించలేదు. జీవితకు వాట్సాప్‌ సందేశం మాత్రమే పంపారు. మేము ‘మా’ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇదే జరుగుతోంది. అధ్యక్షుడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల  గురించి ఇండస్ట్రీలోని పెద్దలకు, మా సభ్యులకు స్నేహపూర్వక సమావేశం పెట్టి వివరించాం. అయినా, ఆయన చర్యల్లో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో ఈరోజు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో  తీవ్ర భావోద్వేగానికి గురయ్యా. నేను భావోద్వేగాలను నియత్రించుకోలేను. అదే సమయంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. అది మీకు నచ్చవచ్చు. నచ్చలేకపోవచ్చు. మీ అందరికీ ఈ విషయాన్నేచెప్పాలనుకుంటున్నా. అదే సమయంలో ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే మిస్టర్‌ నరేశ్‌ వ్యవహారశైలి నాకు ఏమాత్రం నచ్చడం లేదు. నా ఆవేదనను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా’’

ధన్యవాదాలతో, 
మీ రాజశేఖర్‌.