Devotional

సన్మార్గానికి 18 సోపానాలు

The meaning of 18 steps of Sabarimala Ayyappa temple

మెట్టు మెట్టుకూ జీవిత పరమార్థం- ఆద్యాత్మిక వార్తలు – 03/01
ఆధ్యాత్మిక జీవనంలో అయ్యప్ప దీక్ష ప్రత్యేకం. మండల రోజులు నియమ నిబంధనలతో నిష్ఠగా పూజలు చేసి ఇరుముడి నెత్తిన పెట్టుకుని కొండలు దాటి పదునెట్టాంబడి (18 మెట్లు) ఎక్కేందుకు భక్తులు దీక్షబూనుతారు. నియమాల మాల వెనుక ఆరోగ్య మంత్రం, 18 మెట్లలో ప్రగతి సోపానంతోపాటు జీవిత పరమార్థం దాగి ఉంది. చెడు అలవాట్లకు దూరంగా 41 రోజులపాటు కొనసాగించిన దీక్షను విరమించిన తర్వాత సన్మార్గంలో ముందుకు సాగితే జీవితానికి సార్ధకత చేకూరుతుందని గురుస్వాములు చెబుతున్నారు. శబరిమల సన్నిధిలో పదునెట్టాంబడికి ఉన్న విశిష్టత.. ఒక్కో మెట్టులో ఉన్న జీవిత పాఠాలపై ప్రత్యేక కథనం.
**శబరికొండలో 18 మంది దేవతలు 18 మెట్లుగా ఏర్పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప భక్తులు దీక్షలు చేపట్టి నియమాలు పాటించి ఈ మెట్లు ఎక్కితే వారికి ఆయా దేవతల అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. శాస్త్రీయ కోణంలో ఒక్కో మెట్టు మనిషిలోని ఒక్కో వ్యసనాన్ని పారద్రోలేందుకు సూచికగా ఉన్నాయని చెబుతుంటారు.
**1 నుంచి 5
ఒకటి నుంచి ఐదు మెట్లను పంచ ఇంద్రియాలుగా అభివర్ణిస్తారు. మొదటి మెట్టు చెవులు, రెండో మెట్టు కనులు, మూడో మెట్టు చర్మం, నాలుగో మెట్టు ముక్కు, ఐదో మెట్టు నాలుక. ఈ పంచేంద్రియాలను అనుసరిస్తే లక్ష్యసాధనకు మార్గాలుగా నిలుస్తాయి.
**6 నుంచి 13
ఆరో మెట్టు కామ, ఏడో మెట్టు క్రోద, ఎనిమిదో మెట్టు లోబ, తొమ్మిదో మెట్టు మోహ, పదో మెట్టు మద, పదకొండో మొట్టు మత్సర్య, పన్నెండో మెట్టు అహంకారం, పదమూడో మెట్టు తత్వం నియంత్రణకు సూచికలుగా నిలుస్తాయి. మనిషిలోని చెడుని పలికించే ఈ ఎనిమిది అలవాట్ల వల్ల మనిషి నాశనం వైపు పయనించేందుకు అవకాశం అధికంగా ఉంటుంది. వీటి నియంత్రణకు ఈ మెట్లు ఎక్కే భక్తులు అధిక ప్రాధాన్యం ఇచ్చి మార్పుని స్వీకరిస్తే ప్రశాంతమైన జీవనం గడపడానికి నాంది అవుతుంది.
**14 నుంచి 16
పద్నాలుగో మెట్టు సత్యం, పదిహేనో మెట్టు రజో, పదహారో మెట్టు తామసలైన త్రిగుణాలను సూచిస్తున్నాయి. ఎప్పుడు సత్యం పలుకుతూ మంచినే కోరుకోవాలని ఈ మెట్ల పరమార్థం.
**17 నుంచి 18
చివరి రెండు మెట్లు ఎంతో ప్రత్యేకమైనవి. పదిహేడో మెట్టు అజ్ఞానాన్ని తొలగించడానికి, పద్దెనిమిదో మెట్టు విజ్ఞానంతో విజయం సాధించాలని సూచిస్తున్నాయి. ఈ 18 మెట్లు (పదునెట్టాంపడి) ఏడాదికి ఒకటి చొప్పున మాలలు ధరించే భక్తుల్లో మార్పును సూచిస్తున్నాయి.
**నియమాల తోరణం
అయ్యప్ప మాలధారణ కఠినమైన నియమాలతో ముడిపడి ఉంటుంది. ఈ నియమాలను పాటిస్తే ఆధ్యాత్మిక తన్మయత్వంతోపాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
**శిరస్నానం
అభ్యంగ స్నానం దేవునికి ప్రీతికరం. మనసుకు చన్నీటి స్నానం హాయినిస్తుంది. చెడు భావాలను దూరం చేస్తుంది. లక్ష్యంపై ఏకాగ్రత కుదురుతుంది. ఆలోచనలకు కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. పని చేస్తున్నప్పుడు ఉష్ణం పుడుతుంది. అధికం ఉష్ణం వల్ల ఆరోగ్యానికి నష్టం. చన్నీటి స్నానం వల్ల ఉష్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.
**మితాహారం
మితాహారమే ఆరోగ్యం. మితాహారం తీసుకోవడం ద్వారా కొవ్వు శరీరంలో చేరేందుకు ఆస్కారం ఉండదు. ఒక్కపూట భోజనం రెండు పూటల అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఏ పనికైనా ఉత్సాహంగా అడుగులు వేయవచ్చు.
**వస్త్రధారణ
అయ్యప్ప భక్తులు నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల వారిపై శనిదేవుడు చూపు పడదని భక్తుల విశ్వాసం. నలుపు ఆకర్షణలకు దూరంగా ఉండి ఇహపర సుఖాలను త్యజించమని చెబుతుంది. నలుపు రంగు ఉష్ణాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. దేహ ఉష్ణోగ్రతను దీక్ష ఉపవాసాలుగా తగ్గించేస్తాయి. ఈ దుస్తులు ఉష్ణాన్ని సమతుల్యం చేస్తాయి.
**భూతల శయనం
భూమి తల్లితో సమానం. నేలపై పడుకుంటే దేవుని ఒడిలో పడుకున్నట్లే. హంస తూలికాతల్పాలు ఇవ్వలేని మనశ్శాంతి, సుఖం భూతల శయనం ఇస్తుందనేది ప్రాచీనుల విశ్వాసం. మనసు కకావికలం అయినప్పుడు భూమి మీద నిశ్చలంగా కొద్దిసేపు పడుకుంటే అన్నీ దూరమవుతాయని యోగ శాస్త్రం చెబుతోంది. సమాంతర స్థితిలో శక్తి మార్పిడి పొందుతుంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది.
**పాదరక్షలతో అపరిశుభ్రం
పాదరక్షలు అపరిశుభ్రతకు చిహ్నం. వాటితో దైవ సన్నిధికి చేరకూడదు. శబరిమలకు వెళ్లే దారంతా అడవి మార్గం. కొండలు, రాళ్ల మధ్యన పాదరక్షలు లేకుండా నడవడం, ఎక్కడం సాధ్యం కాదు. దీనికి ముందస్తు సాధనగానే పాదరక్షల విస్మరణ. పాదాలు నేరుగా భూమిని స్పర్శిస్తుండటం వల్ల భూస్థితికి తగిన రీతిలో రక్తప్రసరణలు, హృదయ స్పందనలు సమమవుతాయి.
**చందనం ఆరోగ్యం
నుదురు దైవస్థానం. భృకుటి స్థానంలో పెట్టుకునే నామం దైవానికి ఎంతో ఇష్టం. రెండు కనుబొమ్మల మధ్యన నుదుటి భాగం యోగ రీత్యా విశిష్ఠమైంది. పాల భాగంగా పిలిచే ఈ ప్రాంతంలో ఇతరుల దృష్టి కేంద్రీకృతమవుతుంది. దానికి అనుగుణంగా అక్కడ కుంకుమ, విభూది, గంధం, చందనాల్లో ఏదో ఒకటి పెట్టుకుంటారు. నాడీ మండలానికి కేంద్రం నుదుటి భాగం. అక్కడ సున్నితమైన ఒత్తిడి ఆరోగ్యదాయం.
2. వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ఈ నెల 6, 7 తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం, మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులు చలిలో ఇబ్బంది పడకుండా 85 వేల మంది సేదదీరేలా షెడ్లను నిర్మించినట్లు తెలిపారు. 3లక్షల నీళ్ల సీసాలు సమకూర్చామని, క్యూలైన్లలోని భక్తులకు నిరంతరం అన్నప్రసాదం, పాలు అందిస్తామని చెప్పారు. ‘ఏకాదశి రోజు తెల్లవారుజామున 1.30గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభిస్తాం. వీఐపీ పాసులున్న వారికి 3 గంటల్లో దర్శనం చేయిస్తాం. ఉ. 5 గంటలకే సర్వదర్శనం మొదలవుతుంది. స్వర్ణ రథోత్సవం ప్రారంభానికి ముందే మాడవీధుల్లోని భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి పంపిస్తాం’ అన్నారు
3. తిరుమలలో ఉత్తరద్వారం ఎక్కడ?
వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం గురించి ఏ పురాణంలో ఉంది? తిరుమలలో వైకుంఠ ఏకాదశిని రామానుజాచార్యుల హయాం నుంచి నిర్వహిస్తున్నారా, మరేదైనా కాలం నుంచా? తిరుమలలో ఉత్తర ద్వారం ఎక్కడుంది? దాని చారిత్రక ఆధారాలేంటి? తదితర వివరాలు తమ ముందుంచాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఆగమ సలహామండలి ఏ ప్రాతిపదికన, దేని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందో, తిరుమలలో వైకుంఠ ద్వారం పదిరోజుల పాటు తెరవడంపై వైఖరేంటో చెప్పాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.వెంకట రమణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ నెల 6న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార ప్రవేశం కల్పించేలా టీటీడీని ఆదేశించాలని అభ్యర్థిస్తూ న్యాయవాది తాళ్లపాక రాఘవన్ కె. హైకోర్టులో గురువారం అత్యవసర పిటిషన్ (లంచ్ మోషన్) దాఖలు చేశారు. దీనిని ధర్మాసనం విచారణకు స్వీకరించగా.. ఆయన స్వయంగా వాదనలు వినిపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీరంగంలో రంగనాథుని ఆలయం, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం సహా అన్ని ప్రముఖ వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారాన్ని పదిరోజులు తెరుస్తున్నారని, తిరుమలలో రెండు రోజులపాటు మాత్రమే తెరుస్తున్నారని తెలిపారు.
ఈ అంశంపై టీటీడీ బోర్డు గత అక్టోబరులోనే చర్చించి ఆగమ సలహా మండలి, మఠాల అభిప్రాయాన్ని కోరిందని తెలిపారు. టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఆగమ సలహా మండలి నుంచి టీటీడీకి ఇప్పటివరకూ ఎలాంటి నివేదికలు అందలేదని, మీడియా కథనాలతో తమకు సంబంధం లేదని తెలిపారు. పండుగకు నాలుగు రోజులే గడువు ఉన్నందున ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేరని చెప్పారు. పదిరోజుల పాటు వైకుంఠద్వారం తెరవాలని ఆగమ సలహామండలి సూచిస్తే.. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పదిరోజుల వైకుంఠద్వార ప్రవేశంపై టీటీడీకి వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్కు సూచించింది. పండుగకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నందున దీనిపై తాము ఆదేశాలు ఇవ్వలేమని, తగిన నిర్ణయం తీసుకోమని మాత్రమే టీటీడీకి చెప్పగలమని పేర్కొంది.
4. శ్రీరామవతారంలో సీతారామచంద్రస్వామివారి దర్శనం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థాన సన్నిధిలో నిర్వహిస్తున్న శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాములోరు శ్రీరామవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అర్చక స్వాములు ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యఃవచనం, చతుర్వేద పారాయణం గావించారు. శ్రీరామవతారంలో స్వామివారిని అలంకరించి పల్లకీపై వేంచేయింపజేశారు. అక్కడి నుంచి నిత్యకల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్తుల కోలాహలం, కోలాట నృత్యాలు, భాజాభజంత్రీల సందడి నడుమ స్వామివారిని మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారిని వేంచేయింపచేసి ప్రత్యేక పూజలు చేశారు.
5. పంచాంగము 03.01.2020
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: హేమంత
మాసం: పౌష్య
పక్షం: శుక్ల
తిథి: అష్టమి రా.09:13 వరకు
తదుపరి నవమి
వారం: శుక్రవారం (భృగు వాసరే)
నక్షత్రం: రేవతి పూర్తి
యోగం: పరిఘ, శివ
కరణం: విష్టి
వర్జ్యం: రా.06:56 – 08:46
దుర్ముహూర్తం: 09:00 – 09:44
మరియు 12:42 – 01:26
రాహు కాలం: 10:56 – 12:20
గుళిక కాలం: 08:10 – 09:33
యమ గండం: 03:07 – 04:30
అభిజిత్ : 11:58 – 12:42
సూర్యోదయం: 06:46
సూర్యాస్తమయం: 05:53
వైదిక సూర్యోదయం: 06:50
వైదిక సూర్యాస్తమయం: 05:49
చంద్రోదయం: ప.12:23
చంద్రాస్తమయం: రా.12:00
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మీనం
దిశ శూల: పశ్చిమం
చంద్ర నివాసం: ఉత్తరం
మహా భద్రాష్టమి
జయంత్యష్టమి
వన శాఖంబరి ఉత్సవారంభం
బనదాష్టమి
6. రాశిఫలం – 03/01/2020
తిథి:
శుద్ధ అష్టమి రా.8.47 , కలియుగం-5121, శాలివాహన శకం-1941
నక్షత్రం:
రేవతి పూర్తి
వర్జ్యం:
సా.6.57 నుండి 8.40 వరకు
దుర్ము:
ఉ.8.24 నుండి 9.12 వరకు తిరిగి మ.12.24 నుండి 1.12 వరకు
రాహు కాలం:
ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనంవల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) అకాల భోజనాదులవల్ల అనారోగ్యమేర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో నుండుట అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. మనోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. క్రొత్త పనులు ప్రారంభించరాదు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్ర్తిల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టంపట్ల అప్రమత్తంగా నుండుట అవసరం.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు ఉంటాయ. దానికై డబ్బు ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి వుంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి.
7. చరిత్రలో ఈ రోజు/జనవరి 3
1921 : ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు కథా రచయిత చేతన్ ఆనంద్ జననం.(మ. 1997)
1831 : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీ ఫులే జననం.
1981 : ప్రముఖ భారతీయ సినిమా నేపధ్య గాయకుడు నరేష్ అయ్యర్‌ జననం.
1985: రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరో ను ప్రవేశపెట్టారు.
2013 : ప్రఖ వాయులీన విద్వాంసుడు ఎం.యస్. గోపాలకృష్ణ మరణం (జ. 1931).
8. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి 2020 ఏప్రిల్‌లో జరిగే విశేష ఆర్జిత సేవా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. కరెంట్‌ బుకింగ్‌ కింద 54,600 అర్జితసేవా టికెట్లు, ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,680 సేవా టికెట్లు, సుప్రభాతం 7,920, విశేషపూజ 1500, కల్యాణోత్సవం 12,825, తోమాల 140, అర్చన 140, అష్టాదళ పాదపద్మారాధన 180, వసంతోత్సవం 13,200, సహస్ర దీపాలంకరణ 15,600, నిజపాద దర్శనం 2,300 టికెట్లను తితిదే ఆన్‌లైన్‌ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 10 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానంలో భక్తులను తితిదే ఎంపిక చేస్తుంది.
9. 2019లో తిరుమల ఆదాయం ఎంతో తెలుసా ?
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల ఆదాయం ఎంతో తెలుసా…? విక్రయించబడిన లడ్డూలు ఎన్నో తెలుసా? మొత్తం ఆదాయం ఎంత? వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వార్త చదవాల్సిందే.తిరుమల పుణ్యక్షేత్రంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి క్యూ కడుతుంటారు. వారి సంఖ్య ప్రతి రోజు కనీసం 80 వేల నుంచి 1 లక్ష మంది వరకూ ఉంటుంది.ఇక పర్వదినాలలో ఆ సంఖ్య 1.5 లక్షలకు చేరుకుంటుంది. వారు స్వామివారికి సమర్పించిన కానుకలు కావచ్చు వారు హుండీ ద్వారా విడిది ఉండడవలన, లేదా లడ్డూలను కొనుగోలు చేయడం ద్వారా 2019 లెక్కలను టిటిడి విడుదల చేసింది.టీటీడీ ఇచ్చిన లెక్కల ప్రకారం 2,78,02,047 (2.78 కోట్లు) మంది స్వామిని దర్శించుకున్నారు.ఇది గత యేడాదితో పోల్చుకుంటే 4 శాతం పెరుగుదలతో అదనంగా ఇంచుమించు 11 లక్షల మంది అదనంగా స్వామిని దర్శించుకున్నారు.ఇక లడ్డూలను చూస్తే 12.50 కోట్ల లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసి భక్తులకు అందించింది. గత ఏడాదితో పోల్చుకున్నప్పుడు 13 శాతం వృద్ధి రేటు ఉంది. గతేడాది 11 కోట్ల లడ్డూలు పెరిగాయి.ఇక హుండీ ఆదాయం విషయానికి వస్తే రూ. 1161 కోట్ల ఆదాయం వచ్చింది ఇతరు రూపాలలో వచ్చే ఆదాయం దీనికి అదనంగా ఉంటుంది.
10. మేడారం జాతర.. ఏర్పాట్ల‌పై మంత్రుల స‌మీక్ష‌
మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కలిసి వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. జంపన్నవాగు వ‌ద్ద నిర్మించిన‌ స్నానఘట్టాలను, ఇత‌ర ప‌నుల‌ను మంత్రులు పరిశీలించారు. అభివృద్ది ప‌నుల పురోగ‌తి, ఏర్పాట్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తారని, భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రులు అధికారుల‌ను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు శ్రద్ధ వహించాలన్నారు.
11. డ‌య‌ల్ యువ‌ర్ ఈవో ముఖ్యాంశాలు
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి :
జనవరి 6న ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వర్ణరథం, జనవరి 7న ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం జ‌రుగ‌నున్నాయి.
ప్రత్యేక దర్శనాలు నిలుపుదల :
జనవరి 5 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలను, గదులను కేటాయించడం లేదు.జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, సుపథం మార్గంలో ప్రవేశించేవారికి ప్రత్యేక దర్శనాలు కేటాయించడం లేదు. జనవరి 4 నుండి 8వ తేదీ వరకు దివ్యదర్శనం టోకెన్లు, టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు నిలుపుదల చేయడమైనది. జనవరి 5 నుండి 8వ తేదీ వరకు అంగప్రదక్షిణ టోకెన్లు నిలుపుదల.
దర్శనం :
జనవరి 6న ఉదయం ధ‌నుర్మాస కైంక‌ర్యాల అనంత‌రం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభం. జ‌న‌వ‌రి 7వ తేదీ రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తాం.జనవరి 5వ తేదీ ఉద‌యం నుండి భక్తులను క్యూలైన్ల‌లోకి అనుమతిస్తాం.జ‌న‌వ‌రి 6న భ‌క్తుల‌కు పంపిణీ చేసేందుకు 3 ల‌క్ష‌ల తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచుకున్నాం.వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో 15 వేల మంది, మాడ వీధుల్లో 1.70 కోట్ల‌తో ఏర్పాటుచేసిన జ‌ర్మ‌న్ షెడ్ల‌లో 40 వేల మంది, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో రూ.26 కోట్ల‌తో నిర్మించిన షెడ్ల‌లో 30 వేల మంది క‌లిపి మొత్తం 85 వేల మందికి పైగా భ‌క్తులు చ‌లికి ఇబ్బందులు ప‌డ‌కుండా ఏర్పాట్లు.
24 గంటల పాటు ఘాట్‌ రోడ్లు :
భక్తుల సౌకర్యార్థం జనవరి 6న 24 గంటల పాటు ఘాట్‌ రోడ్లు తెరిచి ఉంచడం జరుగుతుంది.
జనవరి 7న తిరుమల నుండి తిరుపతికి వెళ్లే ఘాట్‌ రోడ్డు మాత్రమే తెరిచి ఉంచుతాం.
అన్నప్రద వితరణ :
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో జనవరి 6న ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు, జనవరి 7న ఉదయం 7 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ.
డెప్యుటేషన్‌ సిబ్బంది :
భక్తులకు సేవలందించేందుకు 700 మంది డెప్యుటేషన్‌ సిబ్బంది సేవలు. వీరిలో 26 మందికి సెక్టోరియల్‌ అధికారులుగా బాధ్యతలు.
శ్రీవారి సేవకులు :
– 3,500 మంది శ్రీవారి సేవకులు, 1300 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో భక్తులకు సేవలు.
టిటిడి డైరీలు, క్యాలెండర్లు
ప్రింటింగ్ సంస్థ‌లు స‌కాలంలో చేర‌వేయ‌క‌పోవ‌డంతో డైరీలను స‌కాలంలో భ‌క్తుల‌కు అందించ‌లేక‌పోయాం. ఈసారి మ‌రింత ముందుగా టెండ‌ర్లు ఖ‌రారుచేసి ప్రింటింగ్ చేయిస్తాం. క్యాలెండ‌ర్లు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచాం.
శ్రీవారి ఆలయాలు :
వైజాగ్‌లో రూ.17 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి ఆలయ నిర్మాణం
ముంబ‌యిలో దాత‌ల స‌హ‌కారంతో రూ.30 కోట్ల‌తో శ్రీ‌వారి ఆల‌యం నిర్మిస్తాం.జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి అక్క‌డి ప్ర‌భుత్వం రెండు స్థ‌లాలను ఎంపిక చేసింది. టిటిడి అధికారుల బృందం వెళ్లి స్థ‌లాన్ని ఎంపిక చేసిన త‌రువాత ఆల‌య నిర్మాణం ప్రారంభిస్తాం.
ప్రత్యేక దర్శనాలు :
జనవరి 21, 28వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తాం. జనవరి 22, 29వ తేదీల్లో 5 ఏళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.అనంత‌రం 2018, 2019 సంవ‌త్స‌రాల్లో న‌మోదైన వివ‌రాల‌ను ఈవో తెలియ‌జేశారు.
దర్శనం :
2018వ సంవ‌త్స‌రంలో 2.68 కోట్ల‌ మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 2019వ సంవ‌త్స‌రంలో 2.79 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం :
శ్రీవారి హుండీ ఆదాయం 2018లో రూ.1066.48 కోట్లు కాగా, 2019లో రూ.1161.74 కోట్లు వచ్చింది.
న్నప్రసాదం :
2018లో 6.09 కోట్ల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, 2019లో 6.46 కోట్ల మంది భక్తులకు అందజేయడం జరిగింది.
లడ్డూలు :
2018లో 11.06 కోట్ల లడ్డూలు అందించగా, 2019లో 12.49 కోట్ల లడ్డూలను అందించాం.
దులు :
గ‌దుల ఆక్యుపెన్సీ 2018లో 99 శాతం న‌మోదు కాగా, 2019లో 106 శాతం న‌మోదైంది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.