DailyDose

నేటి పది ప్రధాన వార్తలు–04/01

Today's Top breaking News To Know-January 4 2020

1.కారు ప్రమాదంలో ఐదుగురి మృతి
శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో కారు డ్రైవర్‌, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
2. రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న బంద్‌
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, నిన్న మందడంలో మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రాజధాని గ్రామాల్లో స్వచ్ఛందంగా బంద్‌ కొనసాగుతోంది. పోలీసుల వైఖరికి నిరసనగా శనివారం ఉదయం తుళ్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యాపర, వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
3. బయోడైవర్సిటీ వంతెన పునఃప్రారంభం
43 రోజుల తర్వాత గచ్చిబౌలి బయోడైవర్సిటీ పై వంతెనపై రాకపోకలు పునరుద్ధరించారు. వంతెనపై వేగనియంత్రణ కోసం చేపట్టిన పనులను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అధికారులతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కారు ప్రమాదం అనంతరం ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసేశారు.
4. ఇరాక్‌లో మరో వైమానిక దాడి
ఇరాక్‌లో రెండోరోజూ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ మద్దతున్న పారామిలిటరీ బలగాల కాన్వాయ్‌పై శనివారం తెల్లవారుజామున దాడులు జరిగాయి. ‘హషీద్‌ అల్‌ షాబీ’ కమాండర్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ చర్యకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించనప్పటికీ ఇరాక్‌ మీడియా మాత్రం అమెరికా దాడులుగానే పేర్కొంటోంది. రాజధాని బాగ్దాద్‌కి ఉత్తర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
5. ఇరాన్‌ మీదుగా భారత విమానాలు వద్దు..!
ఇరాక్‌లో అమెరికా జరుపుతున్న వరుస వైమానిక దాడులతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌ గగనతలానికి దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం దేశీయ విమానయాన సంస్థలకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఎయిరిండియా, ఇండిగో సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌ నుంచి అమెరికా, పశ్చిమాసియా, యూరప్‌ వెళ్లే విమానాలను దారిమళ్లించే అవకాశాలున్నాయి.
6. పశ్చిమాసియాకు అమెరికా అదనపు బలగాలు
తాజాగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 3000 మంది సైనికుల్ని అక్కడికి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ తీవ్ర స్థాయిలో హెచ్చరించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇరాన్‌ ప్రతీకార దాడి చేపడితే ఎదుర్కోవడానికే అమెరికా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
7. పాక్‌లో గురుద్వారాపై దాడి..ఖండించిన భారత్‌..!
పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారా నన్‌కానా సాహెబ్‌ వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకర చర్యల్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీనిపై పాకిస్థాన్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది. ఓ సిక్కు యువతి వివాహం.. మతమార్పిడి విషయంలో కొందరు గురుద్వారాకు సమీపంలో నిరసనకు దిగారు. గురుద్వారాను ధ్వంసం చేయడానికి యత్నించారు. అక్కడికి వచ్చిన భక్తులపై రాళ్లు విసిరారు. దీంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణ తలెత్తింది.
8. మరోసారి తప్పులో కాలేసిన పాక్‌
ప్రధానిభారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాలనే ధోరణితో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి తప్పులో కాలేశారు. త్తర్‌ప్రదేశ్‌లో ముస్లింలపై భారత పోలీసుల దాడిగా అభివర్ణిస్తూ పాక్‌ ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో శుక్రవారం ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో పోలీసులు ‘ఆర్‌.ఎ.బి.’ అని ఉన్న షీల్డులను ధరించి ఉండటం చూడొచ్చు. ఆర్ఏబీ అంటే బంగ్లాదేశ్‌కు చెందిన రాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌. ఆ వీడియోకు భారత్‌కు అసలు ఎలాంటి సంబంధమూ లేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ చర్యను ఖండిస్తూ విమర్శలు వెల్లువెత్తాయి.
9. యాపిల్ సీఈవో వేతనం తగ్గింది
టెక్‌ దిగ్గజం యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ వార్షిక వేతనం గతేడాది కాస్త తగ్గింది. 2018లో కుక్‌ 15.7 మిలియన్‌ డాలర్ల వేతనం తీసుకోగా.. 2019 సంవత్సరానికి గానూ 11.6 మిలియన్‌ డాలర్లు మాత్రమే అందుకున్నారు. 2018తో పోలిస్తే గతేడాది యాపిల్ పర్‌ఫార్మెన్స్‌ తగ్గడంతో టిమ్‌ కుక్‌ వేతనంలో కోత పడింది. గతేడాదికి గానూ టిమ్‌ కుక్‌ 3 మిలియన్‌ డాలర్ల మూలవేతనం అందుకోగా.. 7.7 మిలియన్‌ డాలర్లు ప్రోత్సాహక బోనస్‌ కింద తీసుకున్నారు.
10. నిజమే.. సీబీఐకి ఫిర్యాదు చేసింది వాళ్లే : రాయపాటి
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీలు, ఇళ్లపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సీబీఐతో పాటు ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో రాయపాటి, ఆయన కుమారుడు మీడియాతో మాట్లాడిన దీనిపై క్లారిటీ ఇచ్చారు. శనివారం నాడు విద్యాదాత గోగినేని కనకయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాయపాటి మాట్లాడారు.