DailyDose

నేను రాను-వాణిజ్యం

Cyrus Mistry Not Interested In TATA Sons

* సుప్రీంకోర్టులో టాటాసన్స్‌ సవాలు పిటిషన్‌పై సోమవారం విచారణ ఉండగా.. సైరస్‌ మిస్త్రీ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను టాటా సన్స్‌ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోనని ఆయన ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. రికార్డుల్లో ఉన్న అన్ని విషయాలను సమీక్షించిన తర్వాత తనను తొలగించిన పద్ధతి చట్టవిరుద్ధమైనదని జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) గుర్తించిందని పేర్కొన్నారు. కాబట్టి ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలపై తనకు గౌరవం ఉందన్నారు. అయినప్పటికీ టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాలని తాను అనుకోవడం లేదని అందులో పేర్కొన్నారు. అదేవిధంగా టాటా గ్రూప్‌ నాయకత్వం గత మూడేళ్లుగా మైనారిటీ వాటాదారుల హక్కులపై అంతగా గౌరవం చూపడం లేదని తెలిపారు. టాటా గ్రూప్స్‌కు తనకు మధ్య న్యాయ పోరాటం కేవలం మైనారిటీ వాటాదారుల హక్కులను కాపాడటం కోసమే అని పేర్కొన్నారు.

* దిగ్గజ సెర్చింజన్‌ గూగుల్‌ తన న్యూస్‌ విభాగం నుంచి ప్రింట్‌ కాపీలకు సంబంధించిన పీడీఎఫ్‌లను తొలగించాలని నిర్ణయించింది. ప్రింట్‌ ప్రతిల పీడీఎఫ్‌లు ఉన్న మేగజైన్లను చాలా మంది చదవకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఇక నుంచి గూగుల్‌ న్యూస్‌ యాప్‌లో ఇవి కనిపంచవు. ఇప్పటికే టెక్‌దిగ్గజం వినియోగదారులకు ఈ మేరకు ఈమెయిల్స్‌ను పంపించింది. వారు చెల్లించిన మొత్తానికి నిధులను రీఫండ్‌ చేయనుంది. ‘‘ప్రింట్‌ కాపీల పీడీఎఫ్‌ ప్రతులు ఉన్న మేగజైన్లు ఇక నుంచి గూగుల్‌ న్యూస్‌లో ఉండవు’’ అని ఆ సంస్థ పేర్కొంది.

* అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల నుంచి ముడి చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అదే గనుక జరిగితే, క్రూడాయిల్‌ ధరలు మరింత ఎగబాకి 80 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని కమోడిటీ మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌లోని విమానాశ్రయంపై శుక్రవారం తెల్లవారుజామున అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి జనరల్‌ ఖాసిమ్‌ సులేమానీ హతమయ్యారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ శపథం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామ నేపథ్యంలో బ్రెంట్‌ రకం క్రూడ్‌ ధర ఏకంగా 4 శాతం పైగా పెరిగి 70 డాలర్లకు చేరువైంది. వారాంతం ట్రేడింగ్‌ ముగిసేసరికి ధర 68.60 డాలర్ల వద్ద స్థిరపడింది. వచ్చే వారంలోనూ బ్రెంట్‌ క్రూడ్‌ రేటు 70 డాలర్ల స్థాయిలోనే కదలాడనుందని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తీవ్రతరమైతే ధర 80 డాలర్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని కమోడిటీ విశ్లేషకులంటున్నారు.