DailyDose

కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటే భాజపాలోకి పోతా-తాజావార్తలు

JC Says He Will Join BJP If POK Is Captured Back-Telugu breaking News

* జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగవుతాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 370 ఆర్టికల్‌ రద్దును సమర్థిస్తున్నాని, కొన్ని విషయాల్లో ప్రధాని మోదీకి జై అనాల్సిందేనని దివాకర్‌ రెడ్డి అన్నారు. భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను అనంతపురం ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో ఇవాళ జేసీ కలిశారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం తగ్గిపోతోందని చెప్పారు. అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు తెలుగుదేశంలో ఉంటానని జేసీ స్పష్టం చేశారు. కానీ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటే మాత్రం భాజపాలో చేరుతానన్నారు.

* పాకిస్థాన్‌ చెరలో ఉన్న 20 మంది భారత మత్స్యకారులకు విముక్తి లభించింది. పాక్‌లోని లంధి జైలులో ఉన్న జాలర్లను పాక్‌ ఆదివారం విడుదల చేసింది. జాలర్లను రేపు వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించనున్నారు. పాకిస్థాన్‌ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారులను విడుదల చేసేందుకు అంగీకరించిన పాక్‌ ఈ నెల 4వ తేదీన భారత విదేశాంగశాఖకు సమాచారం అందించింది. తాము విడుదల చేయబోతున్న మత్స్యకారుల జాబితాను సైతం పాకిస్థాన్‌ ప్రభుత్వం భారత విదేశాంగ శాఖకు పంపించింది.

* భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. సోమవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి హంస వాహనంపై విహరించారు. వైకుంఠ ఏకాదశి ముందురోజున తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. రాముల వారిని ఊరేగింపుగా ఆలయం నుంచి గోదావరికి తీసుకొచ్చి రుత్వికులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారు హంసవాహనంపై ఆసీనులై విహరించారు.

* ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డితో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని కేసీఆర్ చెప్పారన్నారు.‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపు- తెలంగాణపై ప్రభావం’ అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌, తెదేపా సీనియర్‌ నేత రావుల చంద్రశేకర్‌, సీపీఐ నాయకుడు బాల మల్లేశం, రిటైర్డ్‌ ఇంజినీర్‌ లక్ష్మీనారాయణ హజరయ్యారు.

* ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 9న చిత్తూరులో సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అన్నారు. తిరుపతిలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాజధానిపై అంశంపై ప్రభుత్వం వేసిన రెండు కమిటీల నివేదికలు అందాయని, ఈ విషయమై హైపవర్‌ కమిటీలో చర్చిస్తామని అన్నారు. కొత్త ఐటీ, పారిశ్రామిక పాలసీలు రూపొందిస్తున్నామని, కొత్త విధానాలపై వచ్చే బడ్జెట్‌లో ప్రకటిస్తామని గౌతమ్‌రెడ్డి చెప్పారు.

* గతంలో మాదిరిగానే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. తితిదే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వైకుంఠ ద్వారాలను 10 రోజులు తెరవాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నామని సుబ్బారెడ్డి వెల్లడించారు. మరోవైపు శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

* దేశ రాజధాని దిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వర్సిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు ఐషే ఘోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మాస్కులు ధరించిన వ్యక్తులు తనను తీవ్రంగా గాయపరిచారని ఘోష్‌ తెలిపారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని వర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

* సుప్రీంకోర్టులో టాటాసన్స్‌ సవాలు పిటిషన్‌పై సోమవారం విచారణ ఉండగా.. సైరస్‌ మిస్త్రీ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను టాటా సన్స్‌ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించబోనని ఆయన ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. రికార్డుల్లో ఉన్న అన్ని విషయాలను సమీక్షించిన తర్వాత తనను తొలగించిన పద్ధతి చట్టవిరుద్ధమైనదని ఎన్‌సీఎల్‌ఏటీ గుర్తించిందన్నారు. కాబట్టి ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలపై తనకు గౌరవం ఉందన్నారు. అయినప్పటికీ టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాలని తాను అనుకోవడం లేదని అందులో పేర్కొన్నారు.

* గతంలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార సంగక్కరతో చోటుచేసుకున్న స్లెడ్జింగ్‌ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ నోరు విప్పాడు. ఆ సందర్భంలో సంగక్కర భార్యను ఉద్దేశించి తాను ఏదో అన్నానన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా అగ్గి రాజుకుందని తెలిపాడు. శనివారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇర్ఫాన్‌ నాటి సంగక్కర విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

* తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో సర్వేలన్నీ తెరాసకు అనుకూలంగా ఉన్నప్పటికీ పని విషయంలో అలసత్వం వద్దని మంత్రి హరీశ్‌రావు పార్టీ నేతలకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన తెరాస మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ప్రతి వార్డులో ఇంటింటికెళ్లి ప్రతి ఓటరును కలవాలని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు. టికెట్‌ రాలేదని ఆశావహులు నిరాశ చెందొద్దని చెప్పారు. అవకాశం రానివారిని నామినేటెడ్‌ పోస్టులతో గౌరవించుకుందామని చెప్పారు.

* చేయని తప్పులకు రాజధాని రైతుల్ని ప్రభుత్వం శిక్షిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాజధాని అమరావతిలోనే పెట్టాలని గతంలో అక్కడి రైతులు అడగలేదని, ప్రభుత్వమే వారిని ఒప్పించిందని గుర్తు చేశారు. మూడు ప్రాంతాల్లో రాజధాని భూ ప్రపంచం మీద ఎక్కడా వినలేదని ఆయన వ్యాఖ్యానించారు.ఆదివారం మధు విలేకరులతో మాట్లాడుతూ.. వేర్వేరు చోట్ల అసెంబ్లీ, సచివాలయం అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

* అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 19 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధానిరైతులు ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ అమరావతి రైతులు సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని వేడుకున్నారు. మహిళా రైతులు భావోద్వేగానికి గురై .. తమను కాపాడాలంటూ కిషన్‌రెడ్డి కాళ్లు పట్టుకుని ప్రాథేయపడ్డారు.

* ‘మూడు ముక్కలాటలొద్దు పాలకులారా?..మా జీవితాల్తో ఆటలొద్దు పాలకులారా?’ అంటూ రాజధాని రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా ఒక ఉద్యమ గీతం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. 6.13 నిమిషాల నిడివితో ఉన్న గీతంలో అమరావతికి ప్రధాని శంకుస్థాపన నుంచి.. ప్రస్తుత పరిణామాల వరకూ ప్రస్తావించారు. ‘రాజధాని మార్పుపేర మా బతుకులు బుగ్గిచేస్తే.. భూమిచ్చిన రైతన్నను ముంచాలని మీరు చూస్తే… ఊరుకోము మేమంతా పాలకులారా?..ఊరువాడ కదిలొస్తాం పాలకులారా? ఉప్పెనై లేచొస్తాం పాలకులారా? ఉద్యమమై ఉరికొస్తాం పాలకులారా?’ అంటూ సాగుతుంది.

* రాజధాని అంశంపై జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం జరగాల్సిన హైపవర్‌ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల భేటీని మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో హైపవర్‌ కమిటీ తొలి సమావేశం ఎల్లుండి జరగనుంది. సచివాలయం లేదా సీఆర్డీయే కార్యాలయంలో హైపవర్‌ కమిటీ సమావేశం కానుంది.

* నోట్ల రద్దు తర్వాత దాదాపు భారీగా డబ్బును వాయుసేన విమానాల్లో తరలించామని వాయుసేన మాజీ చీఫ్‌ బీఎస్‌ ధనోవా వెల్లడించారు. ఆయన ఐఐటీ టెక్‌ ఫెస్ట్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 20016లో నోట్ల రద్దు తర్వాత దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వైమానిక దళం సాయంతో దాదాపు 625 టన్నుల బరువున్న కొత్త కరెన్సీ కట్టలను చేర్చామన్నారు. రూ.కోటి రూపాయల బరువు 20 కేజీలు ఉండవచ్చన్నారు. దాదాపు ఎంత వెళ్లిందో తెలియదని చెప్పారు. దీనికోసం ఐఏఎఫ్‌ 33 మిషన్స్‌ను చేపట్టినట్లు వివరించారు.

* బాగ్డాద్‌లో అమెరికా వైమానిక స్థావరంపై దాడి జరిగిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాడి కొనసాగితే తీవ్ర ప్రతిదాడి తప్పదని ఉద్ఘాటించారు. కొన్ని గంటల వ్యవధిలో ఇరాన్‌కు రెండు సార్లు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ‘‘వారు మాపై దాడి చేశారు. మేం గట్టిగా తిప్పికొట్టాం. మరోసారి దాడికి పాల్పడొద్దని నేను గట్టిగా సూచిస్తున్నా. ఒకవేళ చేస్తే.. మునుపెన్నడూ లేనంత బలంగా దాడి చేస్తాం’ అని చెప్పారు.