బాలీవుడ్‌లో బ్రేక్ కోసం తపించే కొత్త నటులకు కాస్టింగ్ కౌచ్ నుండి ఎదురయ్యే దారుణాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు గార్నియర్, డోవ్‌తోసహా అనేక అంతర్జాతీయ చర్మసౌందర్య ఉత్పత్తులకు చెందిన వాణిజ్య ప్రకటనలలో దర్శనమిస్తున్న ప్రముఖ మోడల్ 25 ఏళ్ల మల్హార్ రాథోడ్ తాను బాలీవుడ్‌లో నటిగా ప్రయత్నిస్తున్న కొత్తలో ఒక వృద్ధ నిర్మాత నుంచి తనకు ఎదురైన లైంగిక వేధింపులకు సంబంధించిన ఉదంతాన్ని తాజాగా బయటపెట్టారు. నటిగా అవకాశమిస్తానని చెప్పిన ఆ 65 ఏళ్ల హిందీ చిత్ర నిర్మాతను కలసుకునేందుకు తాను ఆయన కార్యాలయానికి వెళ్లగా ఆయన కోరిన కోర్కెను విని తాను దిగ్భ్రాంతి చెందానని ఆమె చెప్పారు. నీకు నటిగా అవకాశమిస్తాను. కానీ, ఇప్పుడు నీ టాప్(షర్ట్) విప్పెయ్యాలి.. అని ఆయన అనడంతో భయపడిపోయాను. ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కాలేదు. అయితే వెంటనే మారుమాట్లాడకుండా అక్కడ నుంచి బయటకు వచ్చేశాను.. అని మల్హార్ రాథోడ్ ఒక వార్తాసంస్థకు వెల్లడించారు. సినిమా పరిశ్రమలో మీటూ ఉద్యమం మొదలయ్యాక ఎంతో మంది తారలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బట్టబయలు చేశారు. సినీ పరిశ్రమతోపాటు ఇతర రంగాలను కూడా కుదిపివేసిన మీటూ ఉద్యమం కారణంగా ఇప్పటికీ చాలామంది తారలు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకునేందుకు ధైర్యం చేస్తున్నారు. అలా దాదాపు ఏడెనిదేళ్ల క్రిత తనకు నటిగా బ్రేక్ ఇవ్వడానికి ఆ నిర్మాత పెట్టిన షరతును ఇప్పుడు రాథోడ్ బయటపెట్టారు. సినిమా నటి కావాలన్నది నా కల. దాన్ని ఎప్పటికైనా నెరవేర్చుకోవడం నా లక్ష్యం. అవకాశాలు దొరకకపోతే వేరే కెరీర్ ఎంచుకోవచ్చు. కాని ఏదో ఒకనాడు నా కల నెరవేరుతుందని నా ఆశ అన్నారు రాథోడ్. ఇద్దరు చెల్లెళ్లతోసహా ఐదుగురు కుటుంబ సభ్యులకు ఆమె సంపాదనే జీవనాధారం. హాట్‌స్టార్‌లో హోస్టేజస్ అనే షోతో టీవీ రంగంలోకి ప్రవేశించిన రాథోడ్ ఇప్పుడు టాప్ మోడల్స్‌లో ఒకరు. తనలాగే ప్రీతి జింటా, దీపికా పదుకొనె టీవీ యాడ్స్ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించి ఇప్పుడు స్టార్‌డమ్ సంపాదించుకున్నారని, తనకు కూడా ఆ అవకాశం లభించే రోజు ఎంతో దూరంలో లేదని రాథోడ్ నమ్ముతున్నారు.
బట్టలు విప్పమన్న వృద్ధ నిర్మాత
Related tags :