ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఆలియా భట్ ఓ కథానాయిక. అల్లూరి సీతా రామరాజుగా చరణ్, కొమరం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన తర్వాత ఆమె పాత్రలో సరిపోయే నటి కోసం దర్శక, నిర్మాతలు చూస్తున్నారు. నిత్యా మేనన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ కూడా సందడి చేయబోతున్నారట. తెలుగులో అల్లూరి, కొమరం పాత్రల్ని వెండితెరపై ఆయన వాయిస్ ఓవర్‌తోనే పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇందులోని ఓ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారట. ఈ వదంతులు నిజమైతే.. జక్కన్న, ప్రభాస్ అభిమానులకు ఇది ట్రీట్ అని చెప్పొచ్చు. ఒకే సినిమాలో తారక్, చరణ్, ప్రభాస్ కనిపించడం కూడా విశేషం. చరణ్ ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షూట్‌ను వాయిదా వేశారు. ఆయన కోలుకున్న తర్వాత మళ్లీ కొనసాగించనున్నారు. ఇదే సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించన్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.