ScienceAndTech

సూపర్ బొగ్గు గురించి తెలుసా?

The story of super coal that doesn't pollute the environment

మామూలుగా కరెంట్ కోసం భూమి నుంచి బొగ్గును తవ్వి తీస్తున్నాం. భూమిలో సమాధి అయిన శిలాజాలు కొన్ని వందల ఏళ్లపాటు ఉండడం వల్ల ఆ బొగ్గు తయారవుతుంటుంది. కానీ, ఆ బొగ్గుతో వాతావరణానికి కలుగుతున్న ముప్పు, దాని వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. సముద్రాలు, భూమి లోలోతుల నుంచి ముడి చమురును వెలికి తీస్తున్నాం. దానిని రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ వంటి వాటిని తయారు చేస్తున్నాం. వాటితో కలుగుతున్న ముప్పునూ మనం చూస్తూనే ఉన్నాం. వాటికి బదులుగా కొన్నేళ్ల కింది నుంచే బయోడీజిల్పై దృష్టి పెట్టాం. …మరి, వాటి వాడకానికి రీప్లేస్మెంట్ లేదా..? అంటే సైంటిస్టులు ఇప్పటిదాకా చెబుతున్నది కరెంట్ బండ్లు, సోలార్ పవర్, విండ్ పవర్ అని అంటూ ఉంటారు. కానీ, చైనా సైంటిస్టులు మరో కొత్త మార్గాన్ని కనిపెట్టారు. అదే బయోకోల్.. సమర్థమైన బయో ఆయిల్. ఏంటీ బయోకోల్, బయో ఆయిల్..? వాటితో కలిగే లాభాలేంటి..? అసలు ఎట్లా తయారు చేస్తారు? మామూలుగా కర్ర ముక్కలను కాలబెడితే బొగ్గు వస్తుంటుంది. కానీ, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్టులు మాత్రం పంటలు, అడవుల్లోని చెట్ల వేస్ట్తోనే ఈ బయోకోల్ తయారు చేశారు. వడ్ల పొట్టు, వరి గడ్డి, గోధుమ గడ్డి, సోయాబీన్ వేస్ట్, చెరుకు పిప్పి, టింబర్ డిపోల్లో మిగిలిపోయిన చెత్తను తీసుకొచ్చి 464 డిగ్రీల ఫారన్హీట్ దగ్గర బాగా వేడి చేశారు. ఫలితంగా బయో ఆయిల్, బయో చార్(బొగ్గు పొడి) వచ్చింది. బయోఆయిల్ను మళ్లీ డిస్టిలేషన్ చేసి డిస్టిల్డ్ బయో ఆయిల్ను, బయోకోల్ను తయారు చేశారు. వడ్ల పొట్టు నుంచి తయారు చేసిన బొగ్గు వేడికి స్థిరంగా ఉందని గుర్తించారు. మామూలు శిలాజ బొగ్గుతో సమానంగా అది శక్తిని ఉత్పత్తి చేసినట్టు తేల్చారు. మామూలు బొగ్గులో ఉండే కాడ్మియం, లెడ్, జింక్, మాంగనీస్ వంటి లోహాలేవీ బయో కోల్లో ఉండవని చెబుతున్నారు. కాపర్, నికెల్ వంటి వాటి జాడ కూడా ఉండదన్నారు. కాబట్టి పర్యావరణానికి దీని నుంచి కలిగే ముప్పు ఏమీ ఉండదని చెబుతున్నారు. ప్రస్తుతం బయో డీజిల్ కోసం ప్రత్యేకంగా చెట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. దాని వల్ల పంట పొలాల్లో ఆహార ధాన్యాల సాగు తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. పైగా ఆయా చెట్ల నుంచి తయారు చేస్తున్న బయో ఆయిల్స్ త్వరగా ఆవిరైపోతాయని, వాటి పనితీరూ అంతంతమాత్రమేనని చెబుతున్నారు. కానీ, ఇలా పంట, చెట్ల వేస్ట్ నుంచి తయారు చేసిన బయో ఆయిల్స్తో అలాంటి నష్టాలేవీ ఉండవంటున్నారు. ఈ బయో ఆయిల్ కోసం ప్రత్యేకంగా పంటను వేయాల్సిన అవసరం ఉండదని, పండించే ఆహార ధాన్యాల పంటల వేస్ట్తోనే, ప్రత్యేకించి వరి వేస్ట్తో బయో ఆయిల్ను తయారు చేసుకుంటే, ఇటు ఆహార ధాన్యాల కొరత తీరుతుందని చెబుతున్నారు. మామూలు బయో ఆయిల్తో పోలిస్తే ఈ బయో ఆయిల్, చాలా బాగా పనిచేస్తుందని, శిలాజ ఇంధనాలతో పోలిస్తే బాగా మండుతుందని, కాలుష్య కారకాలేవీ విడుదల కావని అంటున్నారు. మామూలు బయో ఆయిల్స్ కెమికల్గా అంత స్థిరంగా ఉండవని, తక్కువ వేడి వద్ద మంచిగ మండవని చెబుతున్నారు. ఈ బయో ఆయిల్ తక్కువ వేడి వద్ద కూడా బాగా మండి కావాల్సిన ఫలితాలిస్తాయంటున్నారు. అంతేగాకుండా 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ను ఏటా 73 కోట్ల టన్నులకు పైగా తగ్గించొచ్చని సూచిస్తున్నారు. ఈ పద్ధతిలో 2030 నాటికి ఏటా 40 కోట్ల టన్నుల బయో కోల్ను తయారు చేస్తే, పెట్రోల్, డీజిల్, శిలాజ బొగ్గు వాడకాన్ని బాగా తగ్గించొచ్చని చెబుతున్నారు.