Business

కార్యాలయాల అద్దెల్లో హైదరాబాద్ నెం.1

Hyderabad ranked no.1 in office space leases

కార్యాలయాల లీజుకు సంబంధించి దేశంలోని నగరాలలో హైదరాబాద్ తొలిసారి అగ్రస్థానానికి చేరింది. గత ఏడాది ద్వితీయార్థం (జులై-డిసెంబరు)లో 89 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఐటీ (41%), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా 18%, కో వర్కింగ్ స్పేస్ 12%.. కార్యాలయాలను లీజుకు తీసుకున్నాయి. 70 లక్షల చ.అ.తో బెంగళూరు రెండోస్థానానికి పరిమితమైంది. అయితే ఏడాది మొత్తంమీద కార్యాలయాల లీజ్ పరంగా బెంగళూరే (1.53 కోట్ల చ.అ.) మొదటి స్థానంలో ఉంది. 1.28కోట్ల చ.అ.తో రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. కానీ 2018తో పోలిస్తే ఇది దాదాపు రెండింతలు. నైట్ఫ్రాంక్ ఇండియా 2019 ద్వితీయార్థ స్థిరాస్తి నివేదికలో ఈ విశేషాలున్నాయి. కార్యాలయాల లీజ్, గృహ నిర్మాణ కొత్త ప్రాజెక్ట్ల ప్రారంభం, ఇళ్ల విక్రయాలు.. ఇలా అన్నింట్లోనూ ఆశాజనక వృద్ధి హైదరాబాద్లోనే కన్పించిందని నైట్ఫ్రాంక్ ఇండియా, హైదరాబాద్ డైరెక్టర్ శాంసన్ అన్నారు. 2019లో కార్యాలయాల లీజ్ దేశవ్యాప్తంగా 6.06 కోట్ల చ.అ.మేర జరిగి, నూతన గరిష్ఠ స్థాయికి చేరింది. 2018తో పోలిస్తే వార్షిక వృద్ధి 27 శాతం.
***రూ.50 లక్షల లోపు అధికం:
దేశంలోని 8 నగరాల్లో కలిపి గత ఏడాది 2.23 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్లను ప్రారంభించారు. 2018తో పోలిస్తే ఇవి 23 శాతం అధికం. ద్వితీయార్థంలో చేపట్టిన 1.12 లక్షల ఇళ్లలో రూ.50 లక్షల లోపు వాటా దాదాపు 61 శాతంగా ఉంది. ద్వితీయార్థంలో ఇళ్లు/ఫ్లాట్ల విక్రయాల పరంగా బెంగళూరు 10% వృద్ధితో ముందు ఉండగా.. 9% తో హైదరాబాద్, కోల్కతా నగరాలు ఉన్నాయి.
****ధరల్లో 10 శాతం పెరుగుదల:
హైదరాబాద్లో ఇళ్ల ధరలు దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువగా 10శాతం మేర పెరిగాయి. బెంగళూరులో 6.3 శాతం, దిల్లీలో 4.5 శాతం, కోల్కతాలో 3.1 శాతం, అహ్మదాబాద్లో 2శాతం పెరిగాయి. హైదరాబాద్లో ఫ్లాట్ సగటు చదరపు అడుగు ధర రూ.4,500గా ఉంది. పశ్చిమ హైదరాబాద్ ఇప్పటికీ గిరాకీ ఉన్న ప్రాంతం.
* హైదరాబాద్లో రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్న ఇళ్లకు అధిక డిమాండ్ కన్పించిందని నివేదికలో పేర్కొన్నారు. మేనేజ్మెంట్ స్థాయి మధ్య, ఉన్నత స్థాయి అధికారులు స్థిరనివాసం వైపు చూస్తున్నారు. దీంతో కోటి నుంచి కోటిన్నర ధరల శ్రేణిలోని ఇళ్లకు డిమాండ్ పెరిగింది.