Food

చక్కెర వేసిన టీ…క్యాన్సర్‌కి రాదారి

Sugary tea and fruit juices linked to cancer

చిక్కటి చక్కెర చాయ్‌ తాగితే నీరసంగా ఉన్న శరీరానికి అనుకోని బలం హఠాత్తుగా వచ్చినట్లు ఉంటుంది. గ్లాసుడు పళ్ల రసం పుచ్చుకున్న నిస్సత్తువ శరీరానికి ఎక్కడిలేని శక్తి వచ్చినట్లు ఉంటుంది. అయితే ఈ రెండింటి వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు భారీగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనం తేల్చారు. 100 మిల్లీ లీటర్ల స్వచ్ఛమైన పళ్ల రసం రోజు పుచ్చుకుంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశం 12 శాతం పెరుగుతుందని దాదాపు లక్ష మంది ప్రజలు ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసిన ఫ్రాన్స్‌ వైద్యులు తెలిపారు. ఇక అంతే మొత్తంలో కార్డియల్, ఫిజ్జీ పాప్‌లు తాగితే క్యాన్సర్‌ వచ్చే అవకాశం 19 శాతం పెరుగుతాయని వారు చెప్పారు. రెండు టేబుల్‌ స్పూన్ల చక్కెర వేసుకొని రోజుకు ఒక్క కప్పు టీ తాగినా అంతే ప్రమాదమట. కోక కోలా డ్రింక్‌ కన్నా కప్పు ఛాయ్‌ ప్రమాదమట. చక్కెర కలవడం వల్లనే ఈ పానీయాలన్నీ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను పెంచుతున్నాయని అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు. వయస్సును బట్టి చక్కెర పాళ్లను పరిమితం చేస్తే పెద్ద ప్రమాదమేమీ లేదని వారే చెబుతున్నారు. బ్రిటన్‌ పిల్లలు మోతాదుకు మించి చక్కెర తీసుకుంటున్నారని ‘పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌’ ఆందోళన చెందుతోంది. పిల్లలు, టీనేజర్లు కూల్‌ డ్రింకులను ఎక్కువగా తీసుకుంటున్నారని, వాటిల్లోనే క్యాన్సర్‌కు దారితీసే చక్కెర శాతం ఎక్కువ ఉంటుందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. బాటిళ్లలో దొరకి పళ్ల రసాల్లో కూడా చక్కెర కలుపుతారుకనుక సాధారణ పళ్ల రసాల కన్నా అవి మరింత ప్రమాదకారకాలని వారంటున్నారు. క్యాన్సర్‌ మరణాలను తగ్గించాలంటే అన్ని డ్రింకుల్లో చక్కెర పాళ్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైన ఉందని అధ్యయనకారులు ఫ్రెంచ్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. పారిస్‌లోని సార్బోన్, ఫ్రెంచ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ నిపుణులు సంయుక్తంగా ఈ తాజా అధ్యయనం జరిపారు.