రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. లేనిపోని అపోహలు కల్పించి రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తించే హైపవర్ కమిటీ ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. బీసీజీ, జీఎన్ రావు కమిటీ నివేదికలను పరిగణలోకి తీసుకుని వాటిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఇచ్చే ప్రతిపాదనలపై కూడా చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. చంద్రబాబు అమరావతిలో శాశ్వత రాజధాని ఏమైనా నిర్మించారా? అని కురసాల ప్రశ్నించారు. ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును ప్రతిపక్షం గౌరవించాలని హితవు పలికారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం జోలె పట్టి రూ.50కోట్లు సేకరించారు.. ఆ నిధులు ఏమయ్యాయంటూ మంత్రి ప్రశ్నించారు. మళ్లీ ఇప్పుడు ఉద్యమాలంటూ ప్రజల జేబుల్లోంచి డబ్బులు లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రైతుల భావోద్వేగాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. శాంతిభద్రతలను అదుపు చేసేందుకే రాజధాని ప్రాంతంలో పోలీసుల్ని కాపలా పెట్టామని మంత్రి తెలిపారు. రాజధానిలో తాత్కాలిక నిర్మాణాల కోసమే చంద్రబాబు వేల ఎకరాలు, వేల కోట్ల అప్పులు చేశారని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో భూములు కొనడంతోపాటు నిధులు కూడా మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే బీసీజీ, జీఎన్‌రావు కమిటీలు నివేదిక ఇచ్చాయని తెలిపారు. ఈ నివేదికల సారాంశం బయటకు రాకుండానే.. ఏదో జరిగిపోతోందని చంద్రబాబు లేనిపోని హడావిడి సృష్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అవసమైతే రాజధాని అంశంపై చంద్రబాబు పలు సూచనలు, సలహాలు ఇవ్వొచ్చన్నారు.
రైతులను పట్టి పీడిస్తున్న చంద్రబాబు
Related tags :