రాష్ట్రంలో మరో 45 రోజుల్లో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు నూతన చైర్మన్లు, అధ్యక్షులు కొలువుదీరనున్నారు. వచ్చే నెలన్నర రోజుల వ్యవధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, ఫలితాల వెల్లడి ప్రక్రియ ముగిసి నూతన సారథులను ఎన్నుకోవడం పూర్తి కానుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 333 మండలాల్లో తొలివిడతలో, 327 మండలాల్లో రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలో సగం మండలాల చొప్పున రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ముగిసిన నాలుగు రోజులకు రెండో దశ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది.
***17 సాయంత్రం షెడ్యూల్ విడుదల..
*ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు.
* ఈనెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అదే రోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.
*రాష్ట్రంలో 660 మండలాలు ఉండగా 333 జడ్పీటీసీలకు, 5,352 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 327 జడ్పీటీసీలకు, 4877 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి.
*ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల అనంతరం మూడు రోజుల వ్యవధితో జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి మరో నోటిఫికేషన్ విడుదల కానుంది.
* 660 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక ఒకే రోజు జరుగుతుంది. 13 జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికను కూడా ఒకే రోజు నిర్వహిస్తారు.
* జడ్పీటీసీ స్థానాలకు జిల్లా కలెక్టరు కార్యాలయం లేదా జడ్పీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు.
*ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు.
* రెండు విడతల్లో మొత్తం 660 జడ్పీటీసీ, 10,229 ఎంపీటీసీ స్థానాలకు 34,320 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.
* బ్యాలెట్ పేపర్ విధానంలో పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల నిర్వహణకు మొత్తం నాలుగు రకాల బ్యాలెట్ బాక్స్‌లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. చిన్నది, మధ్యస్తం, పెద్దది, జంబో తరహాలో బ్యాలెట్ బాక్స్‌లను వర్గీకరించారు. అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు.
* పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కోసం 30 గుర్తులను (ఫ్రీ సింబల్స్)
సిద్ధం చేశారు.
* మొదటి దశ ఎన్నికల్లో 1,45,05,502 మంది ఓటర్లు, రెండో దశలో 1,36,17,833 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.
* మొత్తం 2,17,908 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు.
*ప్రతి కేంద్రంలో పోలింగ్ అధికారితో పాటు మరో ఐదుగురు సిబ్బంది ఉంటారు. మండల పరిధిలో కొంతమంది సిబ్బందిని అదనంగా ఉంచుతారు.
**ఏర్పాట్లపై చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 17వ తేదీన షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ శుక్రవారం కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై చర్చించారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటైన చోట, ఉన్నవాటిని రెండుగా విభజించిన చోట ఎన్నికల నిర్వహణకు కొత్తగా ఓటర్ల జాబితా, వార్డులను వర్గీకరించాల్సి ఉంటుంది. ఆయా చోట్ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే ప్రక్రియను ఫిబ్రవరి 8 నాటికి పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి ఎన్నికల సిబ్బందికి ఒక విడత శిక్షణ పూర్తి కావాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను తెప్పించాలని సూచించారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రెండు దశల్లో పరిషత్ ఎన్నికలు
Related tags :