* ఈ సారి ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను భారీగా పెంచే అవకాశం ఉంది. కనీసం 18శాతం పెంపు అయినా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.1.60 లక్షల కోట్లుగా ఉన్న ఈ బడ్జెట్ 1.90లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. వచ్చే పదేళ్లలో మూలధన వ్యయాలను భారీగా పెంచాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కీలకమైన మౌలిక ప్రాజెక్టులపై పెట్టే ఖర్చును మూలధన వ్యయంగా చూపిస్తారు. నేషనల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ పైప్‌లైన్ ప్రాజెక్టును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. దాదాపు రూ.102 లక్షల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో 13 శాతానికి సమానమైన 13.7 ట్రిలియన్ డాలర్ల వాటా రైల్వేలదే కావడం విశేషం.
* కర్ణాటకలోని కొడగు జిల్లాకేంద్రం మడికేరిలోని ఒక ఏటీఎం సంచలనాలకు కేంద్రబిందువయింది. ఎందుకంటే… ఆ అటోమేటెడ్ టెల్లర్ మిషన్ (ఏటీఎం) రూ.100 నోట్లకు బదులు రూ.500 నోట్లు ఇవ్వటం మొదలు పెట్టింది మరి… కొందరు ఈ విషయాన్ని బ్యాంకు వారి దృష్టికి తీసుకెళ్లే వరకు ఈ తంతు కొనసాగింది. ‘‘ఆ ఏటీఎంలో నగదును ఉంచే సంస్థ ఒక పొరపాటు చేసింది. రూ.100 నోట్లు ఉంచవలసిన ట్రేలో రూ.500 నోట్లను ఉంచింది. దానితో ప్రజలు అక్కడకి వచ్చి రూ. 1.7 లక్షల నగదును చక్కగా విత్‌డ్రా చేసుకుని తీసుకెళ్లిపోయారు. బ్యాంకు నుంచి మాకు ఏ ఫిర్యాదు అందలేదు.’’ అని పట్టణ ఎస్పీ సుమన్ పెనిక్కర్ చెప్పారు.
* జనవరి 14వరకు ఒమన్‌కు ప్రయాణించే విమానాల్లో క్యాన్సిలేషన్ ఫీజును, రీషెడ్యూలింగ్ ఛార్జీలను రద్దు చేసినట్లు గోఎయిర్ సంస్థ వెల్లడించింది. ఒమన్ సుల్తాన్ మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. ‘‘ఒమన్ సుల్తాన్ అల్ సయిద్ అంతిమ సంస్కారాల కారణంగా మస్కట్ ఎయిర్‌ఎయిర్టులో తీవ్రమైన రద్దీ నెలకొనే అవకాశం ఉంది. వచ్చే మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఒమన్ సర్వీసుల్లో క్యాన్సిలేషన్ ఛార్జిలు, రీషెడ్యూల్ ఛార్జీలను పూర్తిగా తొలగించాము’’ అని గోఎయిర్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
* కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐ నిధులపై మరోసారి ఆదారపడే పరిస్థితి నెలకొంది. ఈ సారి ఆదాయాల అంచనాలు తప్పడంతో.. మరోసారి ఆర్‌బీఐ నుంచి మధ్యంతర డెవిడెండ్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం ఆర్‌బీఐ రూ.1.76లక్షల కోట్లను డివిడెండ్ రూపంలో చెల్లించింది. ఆర్‌బీఐ కరెన్సీ ట్రేడింగ్, బాండ్ల ట్రేడింగ్ నుంచి భారీగా ఆదాయం పొందుతుంది. దీనిలో తన కార్యాకలాపాల కోసం కొంత మొత్తం ఉంచుకొని మిగిలిన మొత్తం ప్రభుత్వానికి అందజేస్తుంది. గత ఏడాది ఈ రకంగా రూ.1.23లక్షల కోట్లను ఆర్జించింది. అంతకు ముందు ఏడాది కంటే ఇది చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఒక్క ఆర్థిక సవంత్సరం మినహాయింపు ఇస్తూ డివిడెండ్‌ను పరిశీలించాలని కోరుతోంది. ఈ సారి 11 ఏళ్లలో అత్యల్పంగా వృద్ధి రేటును నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 31తో ముగియనున్న ఈ ఏడాదికి మరో రూ.45వేల కోట్ల వరకు ఆర్‌బీఐ నుంచి ఆశిస్తోంది. దీనిపై ఆర్‌బీఐ ప్రతినిధి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఈ సారి బడ్జెట్‌లో వ్యయాలను పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఫిబ్రవరి1న భారీగా ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రకటించడంతో పాటు పన్ను మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.