తీవ్ర కరవుతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా ఐదు రోజుల్లో 5వేలకు పైగా ఒంటెలను చంపేసింది. హెలికాప్టర్లలో తిరుగుతూ ఒంటెలను చంపేసినట్లు అధికారులు వెల్లడించారు. అనంగు పిజంజజరా యకుంజజరా ప్రాంత అధికారుల (ఏపీవై) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే కార్చిచ్చు (బుష్‌ఫైర్) వల్ల కొన్ని వేల జంతువులు చనిపోయాయి. దీని కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్ర కరవు పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడటంతో ఒంటెలను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని జంతు సంరక్షణ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై ఏపీవై జనరల్ మేనేజర్ రిచర్డ్ కింగ్ స్పందించారు.
ఆదివారం వరకు సుమారు 5వేలకు పైగా ఒంటెలను చంపేసినట్లు కింగ్ వెల్లడించారు. ఆస్ట్రేలియా గతేడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను నమోదు చేసుకున్న సంవత్సరంగా నిలిచింది. బుష్‌ఫైర్, నీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కార్చిచ్చు 27 మంది ఫ్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు.
ఈ దేశంలో దాదాపు 10 లక్షల ఒంటెలున్నాయి. 19వ శతాబ్దంలో దాదాపు 20 వేల ఒంటెలను భారత్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటి సంతతి పెరిగి దాదాపు 10 లక్షలకు చేరుకుంది. 2019 ఆస్ట్రేలియాలో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదు చేసింది. దక్షిణ భాగంలో తీవ్ర కరవు ఏర్పడటంతో ఒంటెలు నీటి వనరులన్న ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించాయి. ఇవి నీటిని బాగా తాగి నిల్వచేసుకుంటాయి. ఇప్పటికే క్షామంతో అల్లాడుతున్న దేశంలో ఒంటెల మందలు నీటివనరులపై పడటంతో నీటి లభ్యత మరింత తగ్గిపోనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 10 వేల ఒంటెల వరకు కాల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది