WorldWonders

స్ట్రాటోలాంచ్‌ ఎగిరింది

worlds biggest plane stratolaunch flies for first time

ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేరుగాంచిన స్ట్రాటోలాంచ్‌.. ప్రయోగాత్మక పరీక్షల్లో భాగంగా శనివారం తొలిసారి ఎగిరింది. 2,26,800 కేజీల బరువున్న ఈ విమానం రెక్కల పొడవు ఏకంగా 117మీటర్లు అంటే దాదాపు ఫుట్‌బాల్ గ్రౌండ్‌ పొడవుతో సమానం. కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో ఉండే మోజావే విమానాశ్రయం నుంచి తొలి టేకాఫ్ తీసుకుంది. గంటకు 304కి.మీ వేగంతో ఎగిరిన ఈ విమానం దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ప్రయాణించింది. స్ట్రాటోలాంచ్ అనే కంపెనీ దీనిని తయారుచేసింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు దివంగత పాల్ అలెన్ 2011లో ఈ కంపెనీని స్థాపించారు. గాలిలో నుంచి నేరుగా రాకెట్లను ప్రయోగించి తద్వారా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలన్నది ఈ విమానం తయారీ వెనక ముఖ్య ఉద్దేశం. భూమి నుంచి రాకెట్లను ప్రయోగించి జరిపే ప్రయోగం కంటే ఇది సులభతరమైనదేగాక.. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఆరు ఇంజిన్లు, రెండు విమాన బాడీలు (డ్యూయల్ ఫ్యూజ్‌లాజ్) కలిగిన ఈ విమానం గరిష్ఠంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరేలా రూపొందించారు. ఈ విమానం విజయవంతంగా టేకాఫ్ కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన విమానం టేకాఫ్ అయిన రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఈ విమానం ఎగరడానికి చాలా పెద్ద రన్‌వే కావాల్సి ఉంటుంది. మరిన్ని పరీక్షల అనంతరం పూర్తి స్థాయి వినియోగానికి దీనికి అనుమతులు లభించనున్నాయి. అన్నీ సజావుగా సాగితే వచ్చే సంవత్సరానికి ఇది తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.