ScienceAndTech

భారతదేశానికి కాసేపు ప్రశాంతత లభించింది

India Faces Calm And Peace Due To WhatsApp Down

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయమేర్పడింది. ఫొటోలు, వీడియోలు, జిఫ్‌ ఇమేజ్‌లు పంపించడం వీలు కాకపోవడంతో యూజర్లు అవస్థలు పడ్డారు. దాదాపు రెండు గంటల తర్వాత వాట్సాప్‌ సేవలు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయి. భారత్‌ సహా బ్రెజిల్‌, యూఏఈలో ఈ పరిస్థితి తలెత్తింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్‌ వినియోగదారులూ ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో ఫొటోలు, ఆడియో ఫైల్స్‌, జిఫ్‌ ఇమేజ్‌లు, స్టిక్కర్లు, వీడియోలు వెళ్లడం లేదంటూ ట్విటర్‌ వేదికగా #whatsappdown హ్యాష్‌ట్యాగ్‌తో ఫిర్యాదు చేశారు. అయితే, టెక్ట్స్‌ సందేశాలు మాత్రం యథావిధిగా పనిచేశాయి. కాసేపటి తర్వాత వాట్సాప్‌ తన సేవలను పునరుద్ధరించింది. 2020లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోవడం ఇదే తొలిసారి. ఇమేజ్‌లు, వీడియోలు వెళ్లకపోవడంతో పలువురు నెట్‌వర్క్‌ పనిచేయక పోవడమే కారణమని భావించారు. ట్విటర్‌ వేదికగా ఎప్పుడైతే ఫిర్యాదులు వచ్చాయో ఇది వాట్సాప్‌ సమస్య అని తెలుసుకున్నారు. దీనిపై పలువురు మీమ్స్‌ కూడా రూపొందించారు. ‘వాట్సాప్‌కు ఏమైందో తెలియాలంటే ట్విటర్‌లోకి వెళ్లాలి పదండి’ అంటూ ఫన్నీ మీమ్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు నెటిజన్లు.