DailyDose

సుప్రీంకోర్టు తలుపు తట్టిన టెలికాం కంపెనీలు-వాణిజ్యం

Telecom Companies Reach Out To Supreme Court For Help

* రూ.1.47 లక్షల కోట్ల బకాయిలను చెల్లించేందుకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా సర్వీసెస్‌తో పాటు పలు టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను గతంలో ఏ ధర్మాసనం విచారించిందో అదే మళ్లీ దీన్ని స్వీకరిస్తుందని సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే తెలిపారు. వచ్చే వారం దీన్ని విచారణ జరగనుంది. తమ పిటిషన్‌ను ఛాంబర్‌లో కాకుండా బహిరంగ విచారణ జరపాలని టెలికాం కంపెనీలు అభ్యర్థించాయి. దీనిపై నిర్ణయాన్ని కూడా గతంలో టెలికాం కంపెనీల పిటిషన్‌ విచారించిన ధర్మాసనమే తీసుకుంటుందని సీజేఐ వెల్లడించారు. ఏజీఆర్‌ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ గతవారం టెలికాం కంపెనీలు సుప్రీంని ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఏస్‌ఏ నజీర్‌, జస్టిస్‌ ఎమ్‌ఆర్‌.షాలతో కూడిన బెంచ్‌ కొట్టేసింది. జనవరి 23 లోపు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు రూ.1.47లక్షల కోట్లను కేంద్రానికి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. బకాయి చెల్లించేందుకు ఉన్న సమయం చాలా తక్కువ అని దాన్ని పొడిగించాలని టెలికాం సంస్థలు న్యాయస్థానాన్ని కోరాయి. టెలికం సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి సుమారు రూ.92వేల కోట్ల మేర సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌) వసూలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంట్లో అత్యధికంగా ఎయిర్‌టెల్‌ రూ.21,682.13కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.19,823కోట్లు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ.16,456కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ.2,537కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,098కోట్లు బకాయి పడ్డాయి. వీటిపై వడ్డీలు, అపరాధ రుసుంలు కలిపి మొత్తం రూ.92,641కోట్లకు చేరాయి. వీటికి తోడు మరో రూ.55,054కోట్లు స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు కలిశాయి. మొత్తం రూ.1.47లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అపరాధ రుసుం, వడ్డీ నుంచి మినహాయించాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
*భారతీయ ఆహార సరఫరా దిగ్గజం జొమాటో, అమెరికన్‌ ఆన్‌లైన్‌ ఆహార సంస్థ ఉబెర్‌ ఈట్స్‌ను చేజిక్కించుకుంది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు దాదాపు రూ.2500 కోట్ల విలువైన వ్యాపార ఒప్పందం చేసుకొన్నాయి. దీనిప్రకారం ఉబెర్‌ ఈట్స్‌ జొమాటోతో విలీనంమైంది. అందుకు ప్రతిగా ఉబెర్‌కు జొమాటోలో 9.9శాతం వాటా లభించింది. అంతేకాకుండా ఉబెర్‌ ఈట్స్‌ వినియోగదారులందరినీ జొమాటోకు బదలాయించారు. అయితే ఉబెర్‌ ఈట్స్‌ ఉద్యోగులను మాత్రం జొమాటో స్వీకరించదట. భారత్‌లో పనిచేస్తున్న 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు పదవీ విరమణ ఇవ్వడంగానీ, లేదా వేరే విభాగాలకు మళ్లిస్తారు. ‘‘భారత్‌లో మా ఆహార సామ్రాజ్యాన్ని స్థాపించి దానిని 500 పైగా నగరాలకు విస్తరించినందుకు గర్విస్తున్నాం. మా తాజా కొనుగోలుతో ఆహార సరఫరా రంగంలో మా స్థానం మరింత బలోపేతం కానుంది’’ అని జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ప్రకటించారు.
* హీరో ఎలక్ట్రిక్‌… స్కూటర్‌పై ప్రత్యేక రాయితీ కల్పించింది. స్వల్పకాలం పాటు ఉండే ఈ ఆఫర్‌ కింద ఈ-స్కూటర్‌పై రూ.7,090 డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. పేటీఎం ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.10,500 వరకు ఆదా కానున్నది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఫ్లాష్‌ మోడల్‌ స్కూటర్‌ రూ.29,990కే లభించనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 615 టచ్‌పాయింట్ల వద్ద లభించనున్న 69 కిలోల బరువు కలిగిన ఈ-స్కూటర్‌లో మొబైల్‌ చార్జింగ్‌, రీజనరేటివ్‌ బ్రేకింగ్‌, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌ వంటి నూతన ఫీచర్స్‌తో తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
*దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభం నుంచే నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం ముగిసే సమయం అదే పరిస్థితిని కొనసాగించాయి. బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 205 పాయింట్లు నష్టపోయి 41,323 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 12,169 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.17 వద్ద కొనసాగుతోంది. మదుపర్లు షేర్ల అమ్మకాలతో పాటు బడ్జెట్‌పై దృష్టి సారించడం సహా ఎలాంటి తాజా సానుకూల పరిణామాలు లేకపోవడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్ఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, భారత్‌ పెట్రోలియం, భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభాల్లో పయనించగా.. టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.
* దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. భారత మార్కెట్‌లో సరికొత్త మోడల్ హ్యుందాయ్ ఆరా కారును విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో హ్యుందాయ్ ఆరా కారు ధర రూ. 5.80 లక్షల నుంచి రూ. 9.22 లక్షల వరకు ఉంటుంది. బీఎస్6 ప్రమాణాలతో హ్యుందాయ్ ఆరా కారు రెండు పెట్రోల్ ఇంజిన్లు, ఒక డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులోకి వస్తుంది. ఐదు కీ వేరియంట్స్, ఆరు రంగుల్లో హ్యుందాయ్ ఆరా కారును ప్రవేశపెట్టారు.
* డేటా అనలిటిక్స్‌ నుంచి అందిన సమాచారం ఆధారంగా డీమానిటైజేషన్‌ సమయంలో ఆభరణాల వర్తకులు భారీ మొత్తంలో చేసిన నగదు డిపాజిట్లపై ఆర్థిక మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేపట్టింది. డీమానిటైజేషన్‌ కాలంలో కొందరు ఆభరణాల వర్తకులు వారి ఆదాయంతో పొంతన లేని మొత్తంలో నగదు డిపాజిట్లు చేసినట్టు డేటా అనలిటిక్స్‌లో తేలింది.
* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా చల్లా శ్రీనివాసులు శెట్టిని నియమిస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుతం శెట్టి ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో మూడు బ్యాంకులకూ కొత్త అధిపతులు (ఎండీ, సీఈఓ) నియమితులయ్యారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)కు సంజీవ్‌ చద్దా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(బీఓఐ)కు అథను కుమార్‌ దాస్‌, కెనరా బ్యాంక్‌కు లింగం వెంకట్‌ ప్రభాకర్‌ సారథ్యం వహించనున్నారు. ఇప్పటివరకు సంజీవ్‌ చద్దా ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా, అథను కుమార్‌ దాస్‌ బీఓఐలోనే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)గా, వెంకట్‌ ప్రభాకర్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఈడీగాబాధ్యతలు నిర్వహించారు.
* అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌ యూనిట్‌లో యూఎ్‌సఎ్‌ఫడీఏ తనిఖీలు నిర్వహించింది. కొత్తగా ఒక ఔషధాన్ని తయారు చేసేందుకు దరఖాస్తు చేసుకోగా.. అనుమతినివ్వడానికి ముందు ఎఫ్‌డీఏ ఈ తనిఖీలు చేపట్టింది. తనిఖీలో భాగంగా ఎఫ్‌డీఏ మూడు లోపాలను గుర్తించగా, నిర్ణీత సమయంలో వీటిని సరిచేయనున్నట్లు తెలిపింది.
*అమెజాన్‌ : వినియోగదారులకు ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు 2025 నాటికల్లా 10 వేల విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టనుంది. గత ఏడాది ప్రయోగాత్మకంగా పలు నగరాల్లో వీటిని నడిపినట్లు తెలిపింది. త్వరలోనే 20 నగరాలకు వీటిని విస్తరించనున్నట్లు ప్రకటించింది.
*హౌసింగ్‌ డాట్‌కామ్‌ : కో లివింగ్‌ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఓయో, జోలో సంస్థలతో జట్టు కట్టింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌, చండీగఢ్‌, హైదరాబాద్‌ నగరాల్లో ప్రస్తుతం 5 లక్షల పడకల్ని అందిస్తోంది. ఇందులో 50 వేల పడకలు ఓయో, జోలోకి చెందినవి.
కోటక్‌ బ్యాంక్‌ : డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన రూ.1596 కోట్ల నికర లాభాన్ని ప్రకటిచింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.1291 కోట్లు. కాగా మొత్తం ఆదాయం రూ.7214.21 కోట్ల నుంచి రూ.8077.03 కోట్లకు పెరిగింది.
*ఫెడరల్‌ బ్యాంక్‌ : డిసెంబరు త్రైమాసికంలో రూ.3738.22 కోట్ల ఆదాయంపై రూ.440.64 కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.333.63 కోట్లు.
* విజయ్‌ మాల్యాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్‌ పారిపోయిన మాల్యా.. ఇప్పటి వరకు పైసా కూడా చెల్లించక పోవడాన్ని తప్పుబట్టింది. స్వాధీనం చేసుకున్న మాల్యా ఆస్తులను బ్యాంకులకు ఇవ్వడం ద్వారా రావాల్సిన రుణాలను ఈడీ రాబట్టుకోవచ్చన్న కర్ణాటక హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది.
* ఈ ఏడాదిలో ఆటోమొబైల్‌ రంగం పుంజుకుంటుందని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) ఆశిస్తోంది.
*జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడి, మన దేశంలోకి తొలిసారిగా పెద్ద స్థాయి ఎస్యూవీ-కూపే విభాగం కార్లను ప్రవేశపెట్టింది. బీఎస్-6 ప్రమాణాలతో క్రాసోవర్ ఎస్యూవీ ఆడి క్యూ8ని జర్మనీ ప్లాంటులో పూర్తిగా తయారు చేసి (సీబీయూ) ఇక్కడకు దిగుమతి చేసుకుంటారు. దేశీయంగా ఈ వాహనం ధరను రూ.1.33 కోట్లుగా నిర్ణయించింది. 2025 వ్యూహ లక్ష్యాల్లో భాగంగా ఈ మోడల్ను తీసుకువస్తున్నామని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ థిల్లాన్ పేర్కొన్నారు.
*ప్రపంచంలో ధనవంతుడైన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ అభివృద్ధికి ఎంతో అవకాశమున్న ప్రధానమైన మార్కెట్ అని, 21వ శతాబ్దం భారత్దేనని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారత్లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేసేందుకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు జెఫ్ బెజోస్ ప్రకటించారు. వైఫల్యాల నుంచి నేర్చుకొనేందుకు ‘అమెజాన్’ ఓ మంచి ప్రదేశమని చెప్పారు.
*దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకుల సమ్మె చేపట్టనున్నట్టు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులు తెలిపారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో తమ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీలలో తాము సమ్మె చేయనున్నామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలో బ్యాంకులు సమ్మె నిర్వహించటం ఇది రెండోసారి. జనవరి 8న భారత్ బంద్ సందర్భంగా బ్యాంకులు సమ్మెలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
*ఏజీఆర్ తీర్పును పునఃసమీక్షించాలని ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు వేసిన పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం రూ.92వేల కోట్ల బకాయిలను టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. రెండు టెలికం సంస్థలు వేసిన పిటిషన్లను జస్టిస్ట్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ప్రత్యేక ఛాంబర్లో సమావేశమై పరిశీలించింది.
*దేశీయ ఔషధ కంపెనీలు డిసెంబరు త్రైమాసిక ఆదాయాల్లో సగటున 8- 10 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని కొన్ని స్టాక్ బ్రోకింగ్- పరిశోధనా సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశీయ కంపెనీలు అమెరికా మార్కెట్లో అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశాలు కనిపించడం లేదు.
*దేశీయంగా 36.9 కోట్ల మంది చందాదారులతో అతి పెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో అవతరించింది. 2019 నవంబరు గణాంకాలను ట్రాయ్ గురువారం విడుదల చేసింది. 33.62 కోట్ల మంది చందాదారులతో వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో, 32.73 కోట్ల మంది చందాదారులతో భారతీ ఎయిర్టెల్ మూడో స్థానంలో నిలిచాయి. దేశంలో మొత్తం టెలిఫోన్ చందాదారులు అక్టోబరుతో పోలిస్తే నవంబరులో 2.4% తగ్గి 117.58 కోట్లకు పరిమితమయ్యారు. మొత్తం మొబైల్ కనెక్షన్ల సంఖ్య 118.34 కోట్ల నుంచి 2.43% తగ్గి, 115.43 కోట్లకు పరిమితమైంది. అక్టోబరు వరకు మొదటి స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా ఒకే నెలలో 3.6 కోట్ల మంది చందాదారులను కోల్పోవడంతో రెండో స్థానానికి పడిపోయింది. జియో కొత్తగా 56 లక్షలు, ఎయిర్టెల్ 16.59 లక్షలు, బీఎస్ఎన్ఎల్ 3.41 లక్షల మంది చందాదారులను పెంచుకున్నాయి.
*జీఎంఆర్ గ్రూపు తన విమానాశ్రయ వ్యాపార విభాగంలో 49 శాతం వాటా విక్రయించడానికి సిద్ధపడుతోంది. టాటా గ్రూపు సంస్థకు ఈ వాటా విక్రయించనున్నట్లు జీఎంఆర్ గ్రూపు సంస్థ అయిన జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది.