DailyDose

నిత్యానందపై InterPol కేసు-తాజావార్తలు

Interpol lodges case on nityananda-telugu breaking news

* తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వరుసలో నిలబడిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. 7613 పోలింగ్‌ కేంద్రాల్లో బుధవారం పోలింగ్‌ కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* ఏపీ శాసన మండలిలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను ఛైర్మన్‌ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపారు. దీనిపై తెదేపా సభ్యులు హర్షం వ్యక్తం చేయగా.. వైకాపా సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

* ఏపీలో చేపట్టే ఏ కార్యక్రమం అయినా రెండు పార్టీలు కలిసే చేస్తాయని భాజపా-జనసేన నేతలు స్పష్టం చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించుకుని రాజకీయ పరిస్థితులు, కార్యాచరణపై చర్చిస్తామన్నారు. రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీలు ప్రకటించిన తర్వాత తొలి సమావేశం 28 నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి విలీనం అంశాన్ని ప్రస్తావించగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముందు ప్రస్తావించగా ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అయోమయం సృష్టించొద్దని వారించారు.

* మరణశిక్ష విధించిన దోషులకు ఉన్న న్యాయపరమైన హక్కులను సవరించాల్సిందిగా కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన తర్వాత 14 రోజులు కాకుండా వాళ్లను ఏడు రోజుల్లోనే ఉరి తీసేందుకు అనుమతివ్వాలని కేంద్రం తన పిటిషన్‌ ద్వారా కోరింది. దోషులకు క్యురేటివ్‌ పిటిషన్‌, క్షమాభిక్ష పిటిషన్లు వేసుకునేందుకు ఎక్కువ సమయం ఉండటంతో వాళ్లు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చట్టంతో ఆడుకుంటున్నారని కేంద్రం ఆరోపించింది.

* హైకోర్టులో రాజధాని కేసులను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులు వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీని నియమించుకుంది. ఆయనకు ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా అడ్వాన్స్‌గా ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

* సెంట్రల్‌ బోర్డు ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్‌(సీబీఎస్‌సీ) పరీక్షలు రాసే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు తమ వెంట కాలిక్యులేటర్లు తెచ్చుకునేందుకు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది నుంచి 10, 12వ తరగతి పరీక్షలు రాసే దివ్యాంగులు తమ వెంట బేసిక్‌ కాలిక్యులేటర్లు తెచ్చుకోవచ్చని తెలిపింది. సీఎస్‌డబ్ల్యూఎన్‌(చిల్డ్రన్‌ విత్‌ స్పెషల్‌ నీడ్స్‌) విభాగం కింద ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు సీబీఎస్‌ఈ అన్ని పాఠశాలలకు లేఖలను పంపించింది.

* పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులపై ఏపీ శాసన మండలిలో వాడీవేడి చర్చ కొనసాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. చర్చలో భాగంగా ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ కొన్ని భూముల వివరాలు చదివి వినిపించారు. అనంతరం తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై దమ్ము, ధైర్యం ఉంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని.. అవసరమైతే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్‌ విసిరారు.

* ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారినప్పుడు పీఎఫ్‌ ఖాతాలో డబ్బులు బదిలీ చేయడానికి/ విత్‌డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కారణం.. మీరు గతంలో పనిచేసిన సంస్థ.. మీరు ఉద్యోగం నుంచి వైదొలగిన తేదీని ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. కేవలం సదరు కంపెనీలకే ఇప్పటి వరకు ఆ అవకాశం ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. అలాంటి వారి కోసం ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులే ఆన్‌లైన్‌లో ఉద్యోగం వైదొలిగిన తేదీని నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

* రాజధాని రైతులు తమ హక్కుల కోసం పోరాడాలే కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ కుమారి అన్నారు. మందడంలో మహిళా రైతుల దీక్షాశిబిరాన్ని ఆమె సందర్శించి అమరావతికోసం పోరాడుతున్న రైతులకు సంఘీభావం తెలిపారు. ‘రాజధానిని కాపాడుకోవడం భూములిచ్చిన రైతులుగా మీ హక్కు.. అందుకోసం ఎవ్వరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదు’ అని గల్లా అరుణ రైతులకు ధైర్యం చెప్పారు.

* తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు తెరాస కైవసం చేసుకుంటుందని తెరాస ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల నాడి పసిగట్టడం.. సరైన అభ్యర్థులను ఎంచుకోవడంలో ప్రతిపక్షాలు మరోసారి విఫలమయ్యాయని రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లు తెరాసకు మద్దతుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.

* గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా శాసన సభాపక్షం లేఖ రాసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు జోక్యం చేసుకోవాలని లేఖలో ఆయన్ను కోరింది. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులపై దాడులు చేయండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ప్రోత్సహిస్తుంటే సభాపతి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని పేర్కొంది. రాష్ట్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

* శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ మాట్లాడుతూ… ‘‘అమరావతిలో సీఎం ఒక్క రోజు కూడా పర్యటించలేదు. దాదాపు అన్ని భవనాల నిర్మాణం పూర్తయింది. రాజధాని తరలిస్తే అమరావతిలో పెట్టిన ప్రజాధనం వృథా అవుతుంది. అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలని కేంద్రం చెబుతోంది. దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా మూడు రాజధానులు లేవు. మూడు రాజధానులతో ప్రజా ధనం వృథా అవుతుందని ఆదేశ అధ్యక్షుడే చెప్పారు’’ అని లోకేశ్‌ తెలిపారు.

* రాష్ట్రంలో రాక్షస పాలన, పోలీసుల రాజ్యం నడుస్తోందని తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విమర్శించారు. ఫ్యాక్షనిస్టుల తరహాలో ఐపీఎస్‌ అధికారి లాఠీతో మహిళలను విచక్షణా రహితంగా కొట్టడం తన రాజకీయ జీవితంలో తొలిసారిగా చూస్తున్నానని.. ఒక ఎస్పీ స్థాయి అధికారి అలా వ్యవహరించడం సరికాదని ఆక్షేపించారు. అనంతపురంలో జేసీ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ ఫ్యాక్షనిస్టు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పరిపాలనలో కీలకమైన సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించే ఏకపక్ష నిర్ణయాలను విడనాడాలని ఆయన హితవు పలికారు.

* కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1న స్టాక్‌మార్కెట్లు పనిచేస్తాయని, ఆ రోజున ట్రేడింగ్‌ జరుగుతుందని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 శనివారం. సాధారణంగా శని, ఆదివారాల్లో మార్కెట్లకు సెలవు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా మార్కెట్లు సెలవు దినాల్లో పనిచేయవు. అయితే బడ్జెట్ నేపథ్యంలో ఈ సారి శనివారం కూడా ట్రేడింగ్‌ నిర్వహించనున్నట్లు బీఎస్‌ఈ ఓ సర్క్యులర్‌లో తెలిపింది. సాధారణ రోజు మాదిరిగానే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సెషన్‌ కొనసాగుతుందని వెల్లడించింది.

* మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు, హైకోర్టు తరలింపు అంశాలపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. తరలింపును ఆపేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై మండలిలో చర్చ జరుగుతోందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) వివరణ ఇచ్చారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

* కాలుష్య నివారణపై చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 ఇంజిన్‌ ఉన్న వాహనాలను మాత్రమే విక్రయించేలా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే తాము 5 లక్షల యూనిట్ల బీఎస్‌-6 వాహనాలను విక్రయించినట్లు దేశీయ దిగ్గజ ఆటోమొబైల్‌ సంస్థ మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్రస్తుతం బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌తో 10 మోడళ్లను విక్రయిస్తున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

* భారత జట్టు డిక్షనరీలో ‘నా’ అనే పదం లేదని, సహచరుల విజయాల్ని ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారని టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా గురించి రవిశాస్త్రి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘మా సమీకరణాల నుంచి టాస్‌ను తీసేశాం. ప్రపంచంలో ఎక్కడైనా, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనుకుంటున్నాం. ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాం. మా డిక్షనరీలో ‘నా’ అనే పదం లేదు. ‘మా’ అని మాత్రమే ఉంటుంది’’ అని రవిశాస్త్రి తెలిపాడు.

* వాట్సాప్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డార్క్‌మోడ్‌ ఫీచర్‌ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. అయితే, కేవలం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లు మాత్రమే ఈ ఫీచర్‌ను వినియోగించుకోగలరు. సాధారణ యూజర్లకు ఈ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.

* వివాదాస్పద గురువు నిత్యానంద ఆచూకీ తెలుసుకునేందుకు గుజరాత్‌ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. వారి అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద గతేడాది భారత్‌ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిత్యానందకు చెందిన ఆశ్రమంలో అమ్మాయిలను అక్రమంగా నిర్బంధించి వారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు గతేడాది అతడిపై కర్ణాటకలో కేసు నమోదైంది.

* వరుసగా మూడో రోజు దేశీయ సూచీలు నష్టపోయాయి. ట్రేడింగ్‌ ఆరంభం లాభాలతో మొదలైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అప్పటి నుంచి ఏ సమయంలోను మార్కెట్లు కోలుకోలేదు. చివరికి నష్టాలతోనే ముగిశాయి. ఐటీ రంగం మినహా మిగతా కంపెనీల షేర్లన్నీ నష్టాల బాటలోనే కొనసాగాయి. సెన్సెక్స్‌ 208.43 పాయింట్లు నష్టపోయి 41,115.38 వద్ద ముగియగా.. నిఫ్టీ 62.95 పాయింట్లు దిగజారి 12,106.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.22 వద్ద కొనసాగుతోంది.