WorldWonders

ఉరికొయ్య పిలుస్తోంది రా…కదలిరా…లేచిరా!

Nirbhaya Culprits To Be Hanged On The February 1st 2020

ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేకెత్తించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు చివరి సమయం ఆసన్నమైంది. ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి తిహాడ్‌ జైల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఉరిశిక్ష అమలు దగ్గరపడుతుండటంతో చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు దోషులను అడగ్గా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదట. ఈ విషయాన్ని తిహాడ్‌ జైలు వర్గాలు వెల్లడించాయి. నిబంధనల ప్రకారం.. మరణశిక్ష పడిన దోషులు చివరి కోరికగా తమ కుటుంబసభ్యులను కలుసుకోవాలని అడగొచ్చు. వారి ఆస్తులను తమకిష్టమైన వారికిచ్చేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే ఈ రెండు విషయాల పై జైలు అధికారులు నిర్భయ దోషులను అడగ్గా.. వారు మౌనంగా ఉన్నారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందని దోషులు ధీమాగా ఉన్నట్లు కన్పిస్తోందని జైలు వర్గాలు చెబుతున్నాయి. నిజానికి బుధవారమే ఈ నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉండగా.. క్షమాభిక్ష అభ్యర్థన రూపంలో ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే. దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకోవడంతో వీరి శిక్ష అమలు తేదీ వాయిదా పడింది. అయితే ముఖేశ్ అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంతో దిల్లీ కోర్టు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. దోషులను ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు ఉరితీయాలని అధికారులను ఆదేశించింది.