*ఎన్టీఆర్ హయాంలో రద్దు – వైఎస్ హయాంలో పునరుద్ధరణ
**పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపాలని శాసన మండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ నిర్ణయించడంతో ఇరుకునపడ్డ అధికార పక్షం… శాసన మండలినే రద్దు చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపై కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో అసలు మండలిని ఏర్పాటు చేయాలన్నా.. రద్దు చేయాలన్నా అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? రాజ్యాంగం ఏం చెబుతోంది? రాష్ట్రం ఏకపక్షంగా రద్దు చేయగలుగుతుందా? కేంద్రం నిర్ణయం ఎలా ఉంటుంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
***రాజ్యాంగం ఏం చెబుతోంది?
ఒక రాష్ట్రంలో కొత్తగా శాసన మండలిని ఏర్పాటు చేయాలన్నా, రద్దు చేయాలన్నా, పునరుద్ధరించాలన్నా అది భారత రాజ్యాంగంలోని 169వ అధికరణకు లోబడే జరుగుతుంది. మండలి ఏర్పాటు లేదా రద్దుపై శాసనసభ తీర్మానమే చేయగలుగుతుంది. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. పార్లమెంటులో బిల్లు ద్వారానే కొత్తగా మండలి ఏర్పాటు.. లేదా రద్దు సాధ్యం.
***ప్రక్రియ ఇదీ..
* మండలి ఏర్పాటు చేయాలనుకున్నా, రద్దు చేయాలనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలి. సభలోని మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాలి. ఓటింగ్ నిర్వహిస్తే… సభలో ఉన్నవారిలో మూడింట రెండొంతుల మెజారిటీ రావాలి.
* సాధారణంగా శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందుగా, ఆ ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి ఆమోదం పొందుతారు. అది సంప్రదాయమే.. తప్పనిసరి కాదు.
* తీర్మానాన్ని శాసనసభ ఆమోదించిన తర్వాత… కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు వెళుతుంది. కేంద్రం దానిని సంబంధిత శాఖల పరిశీలనకు పంపిస్తుంది. తర్వాత కేంద్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం పార్లమెంటులో బిల్లు పెడుతుంది. ఉభయసభల ఆమోదం పొంది, చట్టరూపం దాల్చాకే ప్రతిపాదన ఆచరణలోకి వస్తుంది.
* మండలి ఏర్పాటు లేదా రద్దు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వంనుంచి కేంద్రానికి వెళ్లిన తర్వాత ఇంత వ్యవధిలోగా పార్లమెంటులో బిల్లు పెట్టాలన్న నిబంధన లేదు. కేంద్రం తన వెసులుబాటు, విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుంటుంది.
***ఒకసారి రద్దు.. ఒకసారి పునరుద్ధరణ
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా మండలి రద్దయి, మళ్లీ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా పునరుద్ధరణ జరిగింది.
* ఏపీ శాసనమండలి 1958 జులై1న ఏర్పాటైంది. జులై 7న హైదరాబాద్ జూబ్లీహాల్లో మండలిని నాటి రాష్ట్రపతి డా.బాబూ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. తాత్కాలిక ఛైర్మన్‌గా గొట్టిపాటి బ్రహ్మయ్య నియమితులయ్యారు. జులై 7న మండలి ఛైర్మన్‌గా మాడపాటి హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
* 1983 మార్చి 24న మండలి రద్దుకు శాసనసభ తీర్మానం ఆమోదించింది. అప్పట్లో 90 మంది సభ్యుల మండలిలో తెదేపాకి ఆరుగురే ఉండటం, కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉండటంతో మండలిని రద్దుచేయాలని ఎన్టీఆర్ భావించారు.
* కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం మండలి రద్దుకు అంగీకరించలేదు. దీన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసినా, సానుకూల ఫలితం రాలేదు.
* 1985 ఏప్రిల్ 30న మండలి రద్దుకు మళ్లీ శాసనసభ తీర్మానం చేసింది. అప్పుడు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 1985 ఏప్రిల్ 24న పార్లమెంటు బిల్లును ఆమోదించింది.
* 1989లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మండలి పునరుద్ధరణకు ప్రయత్నించినా కేంద్రం పక్కన పెట్టింది.
* వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 2007 మార్చి 30న పునరుద్ధరించారు.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండలి సభ్యుల సంఖ్య 90గా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వేర్వేరు మండళ్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మండలిలో 58 మంది సభ్యులున్నారు.
**రద్దయితే బిల్లుల పరిస్థితేంటి?
శాసనసభ ఆమోదం పొంది, మండలి ఆమోదం పొందాల్సిన బిల్లులు ఉన్నప్పుడు.. అవన్నీ గవర్నరుకు వెళ్లి ఆయన ఆమోదంతో చట్టరూపం దాలుస్తాయి. ఉదాహరణకు.. ఏపీలో సెలక్ట్ కమిటీ బిల్లులపై నివేదిక ఇవ్వకముందే మండలి రద్దయితే, ఆ బిల్లులకు ఆమోదం లభించినట్టే.
****రాజకీయ అవసరాలే ప్రాతిపదిక
* సాధారణంగా మండలి ఏర్పాటుకైనా, రద్దుకైనా అధికారంలోఉన్న పార్టీల రాజకీయ అవసరాలే ప్రధాన ప్రాతిపదికగా ఉంటున్నాయి.
* పార్టీ నాయకుల్లో అర్హత ఉన్న అందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేనప్పుడు, దానికి సమాన స్థాయి పదవులు వారికి ఇవ్వాల్సిన అవసరం, ఒత్తిడిఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మండలి ఏర్పాటుకు మొగ్గుచూపుతోంది.
* మండలిలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉండి కీలక బిల్లులు అక్కడ ఆగితే.. మండలిని రద్దు చేయాలని అధికారపక్షం భావిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది అదే.
* మండలిలో తెదేపాకి మెజారిటీ ఉంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లుల్ని మండలి ఇటీవలే సవరణలతో తిప్పి పంపింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల విషయంలోనూ అధికార పక్షానికి చేదు అనుభవం ఎదురైంది. ఆ బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి నిర్ణయించింది. ఆ నేపథ్యంలోనే మండలి రద్దు ప్రతిపాదనను అధికారపక్షం తెరపైకి తెచ్చింది.
* ప్రస్తుతం దేశంలోని 28 రాష్ట్రాలకు.. 7 రాష్ట్రాల్లోనే శాసనసభతో పాటు.. శాసనమండళ్లూ ఉన్నాయి. కొత్తగా శాసనమండలి ఏర్పాటు చేయాలని కొన్ని రాష్ట్రాలు పంపిన తీర్మానాలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి.
* ప్రస్తుతం శాసనమండలి ఉన్న రాష్ట్రాలు… ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్. జమ్మూ-కశ్మీర్లో ఇటీవలే రద్దయింది.
మండలి వ్యవస్థను రద్దు చేయాలంటే….
Related tags :