Food

చలికాలం ఉలవలు తింటే వెచ్చగా ఉంటుంది

Ulavalu In Winter Helps With Digestion And Maintaining Body Heat

మనకు అందుబాటులో ఉన్న నవధాన్యాల్లో ఉలవలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉలవలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే జ్వరం, జలుబు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మూత్రపిండలు, కాలేయ సమస్యలు రావని, మహిళల్లో నెలసరిలో వచ్చే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది. ఉలవల్ని నిత్యం తింటే ప్రోటీన్లు, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ తదితర పోషకాలు లభిస్తాయి. ఉలవలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందువల్ల వీటిని చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా నిత్యం వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు ఉలవలను తీసుకోరాదు. ఇక ఉలవలను నిత్యం తీసుకోవడం వల్ల స్థూలకాయ సమస్యను తగ్గించుకోవచ్చు. ఒక కప్పు ఉలవలను తీసుకుని బాగా ఉడికించి ఉలవకట్టు తయారు చేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు కలిపి దాన్ని రోజూ ఉదయం పూట పరగడుపునే తీసుకోవాలి. దీంతో చాలా తక్కువ సమయంలోనే సన్నబడవచ్చు. ఉలవలు ఆకలిని పెంచుతాయి. ఆకలి లేని వారు, పైత్యం ఎక్కువగా ఉన్నవారు వీటిని తింటే ఫలితం కనిపిస్తుంది. అలాగే శరీరంలో ఉన్న కఫాన్ని తగ్గించడంలోనూ ఉలవలు బాగా పనిచేస్తాయి. మూత్రాశయం, మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను ఉలవలు కరిగిస్తాయి. ఎక్కిళ్లు తరచూ వచ్చేవారు ఉలవలను ఉడకబెట్టుకుని తినాలి. ఉలవల వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

*** సలాడ్స్ తో ఆరోగ్యం
కప్పు సలాడ్‌ తింటే శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఇతర లవణాలు లభిస్తాయి. సరిపడా పీచు లభిస్తుంది. దాంతో జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. జీవక్రియలు సవ్యంగా జరుగుతాయి.
వీటిలోని ఫైబర్‌ బరువును అదుపులో ఉంచడమే కాదు, రక్తంలో చక్కెరను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వివిధ రంగుల్లో ఉన్న పండ్లు, కూరగాయలు తింటే శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
గుమ్మడి, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలతో కూడిన సలాడ్‌ మీద అవకాడో ముక్కలు వేసుకొని తింటే ఒంట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు చేరతాయి.
విటమిన్‌ కె లోపం వల్ల మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గుతుంది. వారు పాలకూర, ఎరుపు లేదా ఊదా రంగు క్యాబేజీ సలాడ్‌ తింటే ఎముకలు దృఢంగా మారతాయి.
పలురకాల ఆకుకూరలతో చేసిన సలాడ్‌ తింటే విటమిన్‌ ఎ సమృద్ధిగా దొరకుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
వివిధ రకాల పండ్ల ముక్కలు తినడం వల్ల ఒంట్లో కావల్సినంత నీరు చేరుతుంది. దాంతో మలినాలు బయటకు పోయి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
ఫ్రూట్‌ లేదా వెజ్‌ సలాడ్‌ మీద కొద్దిగా మొలకెత్తిన గింజలు చల్లుకొని తింటే ఎ, సి, కె విటమిన్లు మెండుగా లభిస్తాయి.
తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు, ప్రొటీన్లు ఉండే చిరుధాన్యాల సలాడ్‌ కూడా ఆరోగ్యాన్ని పెంచేదే.