అమెరికాలో జనగణన మొదలైంది. మనదేశంలో మాదిరిగానే అక్కడా పదేళ్లకోమారు పక్కాగా ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రజలకు ఇచ్చే మార్గదర్శక సమాచారాన్ని 59 భాషల్లో రూపొందించారు. తెలుగుతోపాటు 7 భారతీయ భాషలకు చోటుకల్పించారు. జనగణనలో పాల్గొనడానికి ఏమేం చేయాలి, ఎలా సమాచారం ఇవ్వాలనే అంశాలన్నీ ఈ భాషల్లో చదువుకోవచ్చు. వీడియో చిత్రాలు సైతం ఆయా భాషల్లో రూపొందించారు. ఎక్కువ మంది మాట్లాడే భాషలను ఇందుకు ఎంపిక చేసినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. తెలుగుతోపాటు బెంగాలీ, గుజరాతీ, తమిళం, హిందీ, మలయాళం, మరాఠీల్లో ఈ సమాచారం రూపొందించారు. అయితే, ఈ సమాచారం ఆధారంగా ప్రజల్ని అడిగే ప్రశ్నావళిని మాత్రం 13 భాషల్లో మాత్రమే సిద్ధంచేశారు. ఈ ప్రశ్నావళి తెలుగులో లేదు. 2020 ఏప్రిల్ ఒకటి నుంచి అమెరికాలో ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేస్తారు. అలస్కాలో మారుమూల సముద్రతీర గ్రామం ‘టోక్సుక్’లో మాత్రం ఇప్పటికే జనాభా లెక్కల్ని ప్రారంభించారు. ఏప్రిల్ నాటికి వాతావరణం అనుకూలించని ప్రాంతాల్లో ఇప్పుడు సేకరిస్తున్నారు. మెయిల్ లేదా ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వొచ్చు. జనగణనలో పాల్గొనాలంటూ దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మెయిల్ లేదా ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తారు. ఇందులో పాల్గొనడం ఎంత అవసరమో ప్రజలకు వివరించేందుకు రూ.3500 కోట్లతో అమెరికా ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తోంది. మనదేశంలో జనగణన రెండు దశలుగా జరుగుతుంది. తొలిదశలో 2020 ఏప్రిల్-సెప్టెంబరు మధ్య ఇళ్లు, కట్టడాల లెక్కలు, కుటుంబాల వివరాలను సేకరిస్తారు. తుది దశ కింద 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి పౌరుడి సమాచారం తీసుకుంటారు. కానీ, అమెరికాలో ఒకే దశ కింద 2020 ఏప్రిల్ నుంచి సమాచారమంతా సేకరిస్తారు. అక్కడ ఐటీ పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడుతున్నారు. మనదేశంలోనూ మొబైల్ యాప్ లేదా కాగితాలపై రాతపూర్వకంగా సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఈ క్రతువుకు వినియోగిస్తారు. అమెరికాలో 5 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తున్నారు.
అమెరికా జనాభా లెక్కల్లో తెలుగు
Related tags :