Sports

మాట కుదురు లేని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

PCB Changes Word On Asia Cup Between India-Pakistan

ఈ ఏడాది పాకిస్థాన్‌లో నిర్వహించే ఆసియా కప్‌లో టీమిండియా ఆడాలని బెదిరింపులకు పాల్పడ్డ పీసీబీ సీఈవో వసీమ్‌ ఖాన్‌ తాజాగా మాట మార్చాడు. భారత్‌ పాక్‌లో ఆసియా కప్‌ ఆడకుంటే.. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన వసీమ్‌ తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పాడు. ‘నేను చెప్పినవన్నీ తప్పుగా అర్థం చేసుకున్నారు. పాక్‌లో ఆసియా కప్‌ నిర్వహించడానికి ఇప్పటికీ మేం సిద్ధంగానే ఉన్నాం. అయితే, భారత్‌ పాల్గొనే మ్యాచ్‌లపై ఆసియా క్రికెట్‌ కౌన్సిలే నిర్ణయం తీసుకోవాలి’ అని పేర్కొన్నాడు. వీసాల మంజూరు, భద్రతాపరమైన అంశాలపైనే తాము ఆందోళన చెందుతున్నామని, అయినా.. అప్పటికి పరిస్థితులన్నీ చక్కబడతాయని వసీమ్‌ తెలిపాడు. అలాగే వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఈవెంట్‌ టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించబోమని ఆయన స్పష్టం చేశాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌ పాక్‌లో పర్యటిస్తేనే ఆసియా కప్‌ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తారనే వార్తలను వసీమ్‌ ఖండించారు. ఈ సందర్భంగానే పీసీబీ అధికారి బీసీసీఐను హెచ్చరించి ఇప్పుడు మాట మార్చాడు.