Devotional

ఏప్రిల్ 7న ఒంటిమిట్టలో టిటిడీ కళ్యాణం

Ontimitta TTD Kalyanam On April 7th

1. ఏప్రిల్ 7న ఒంటిమిట్టలో టిటిడీ కళ్యానోత్సవం – ఆద్యాత్మిక వార్తలు – 28/01
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఏప్రిల్ 7న జరగనుంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ఏప్రిల్ 1నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాలని తితిదే అధికారులు నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా 1న అంకురార్పణ చేస్తారు. 2న ధ్వజారోహణం జరుగుతుంది. అదేరోజు శ్రీరామనవమి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తారు. 7న కల్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
2. శబరిమలపై 10 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి
శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ కోసం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం 10 రోజుల్లో తన విచారణ ముగిస్తుందని ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బోబ్డే మంగళవారం సూచనప్రాయంగా వెల్లడించారు. శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల కోసం గత ఏడాది ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం లేవనెత్తిన కొన్ని రాజ్యాంగపరమైన అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల మొదట్లో తొమ్మిదిమంది న్యాయమూర్తులతో చీఫ్ జస్టిస్ బోబ్డే ధర్మాసనం ఏర్పాటు చేశారు. అయోధ్యలోని రామజన్మ భూమి వివాదంపై గతంలో రూపొందించిన తీరులో కొన్ని ప్రశ్నల పట్టికను రూపొందించి తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఎదుట ఉంచాలని చీఫ్ జస్టిస్ ఇదివరకు ఆదేశించారు. ఇందుకోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జనవరి 17న ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఈ సమావేశంలో వివిధ అంశాలపై న్యాయవాదులలో ఏకాభిప్రాయం కుదరలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం చీఫ్ జస్టిస్‌కు తెలియచేశారు.
3.మహిమాన్వితుడు కార్తికేయుడు-నేటి నుంచి మోపిదేవిలో బ్రహ్మోత్సవాలు
భక్తుల మనో సంకల్పం సిద్ధింపజేసే మహిమాన్వితుడుగా మోహినీపురవాసుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని కొలుస్తారు. భక్తుల కొంగు బంగారంగా నిలిచే మోపిదేవి శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబైంది. మంగళవారం నుంచి శనివారం వరకు అయిదు రోజుల పాటు వార్షిక మాఘమాస బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం వరకు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. స్వామి వారి ప్రతిమను సుందరంగా అలంకరించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఎల్సీడీ టీవీలను ఏర్పాటుచేయనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ జీవీడీన్ లీలాకుమార్ సోమవారం తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. విద్యుద్దీప కాంతులతో దేవస్థాన కూడలి విరాజిల్లుతోంది.
**సాంస్కృతిక కార్యక్రమాలు : 28న రాత్రి 6 గంటలకు ఆలిండియా రేడియో, బుల్లితెర నటుడు గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన సాంబశివరావు వారిచే భక్తిరంజని, అనంతరం నటరాజ నృత్య కళానికేతన్ విజయవాడ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన.
* 29న గుడిపాటి జయరామ్ సుధాకర్ విజయవాడ వారిచే భక్తి గాన సుధ పాటల కార్యక్రమం. రాత్రి 7.30 గంటలకు అభినయ నాట్య అకాడమీ కూచిపూడి వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, 9 గంటలకు హైమశ్రీ గోపాల నాట్యమండలి రేపల్లె వారిచే గయోపాఖ్యానంలోని యుద్ధ ఘట్టములు, శ్రీకృష్ణ రాయబారములోని పడక ఘట్టము, మయ సభలోని ఘట్టములు, సత్య హరిశ్చంద్రలో వారణాసి ఏకపాత్రాభినయ ప్రదర్శనలు.
* 30న రాత్రి 6గంటలకు గద్వాల చంద్రశేఖరరావు మహబూబ్నగర్ వారిచే భక్తి గానామృతం, పాదర్తి సిస్టర్స్ గుడివాడ వారిచే కూచిపూడి, జానపద, నాగిని నాట్య ప్రదర్శనలు, శ్రీబాలా సరస్వతి నాట్య మండలి చిన్నాపురం వారిచే చింతామణి నాటక ప్రదర్శన.
* 31న రాత్రి 6 గంటలకు నటరాజ నృత్య కళా నిలయం, విజయవాడ వారిచే భరత నాట్యం, పీవీఏప్రసాద్ విజయవాడ వారిచే భక్తిపాటలు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాట్యమండలి నాగాయతిప్ప వారిచే సత్య హరిశ్చంద్ర నాటక ప్రదర్శన రావివారిపాలెంలో నిర్వహిస్తున్నట్లు లీలాకుమార్ తెలిపారు.
4.భక్తుల చెంతకే దుర్గమ్మ
వందలాది కిలోమీటర్లు వ్యయప్రయాసాలతో ప్రయాణించి ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శనం చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వయసు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అమ్మవారి అనుగ్రహం పొందని భక్తులు లక్షల్లో ఉన్నారు. వారి కోసం భక్తుల చెంతకే దుర్గమ్మను తెచ్చేందుకు 2012లో అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ జేఎస్వి ప్రసాద్ సూచనలతో ఈవో రఘునాథ్ ప్రత్యేక ప్రచార రథాన్ని రూ.50 లక్షలతో ఏర్పాటు చేశారు. మొదట్లో దుర్గమ్మ ప్రచార రథం రూట్ మ్యాప్ తయారు చేసుకొని మారుమూల గ్రామాల్లో సాగింది. దారి పొడవునా భక్తులు, దాతల నుంచి విశేష స్పందన వచ్చింది. గత ఐదేళ్లుగా ప్రచార రథం ప్రాధాన్యతను దేవస్థానం కార్యనిర్వహణ అధికారులు దృష్టి సారించకపోవడంతో ఏడాదిలో పది రోజులు కూడా తిరగని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జగ్గయ్యపేటకు ప్రచార రథం వెళ్లగా, భక్తులు దుర్గమ్మ తమ ఊరు వచ్చినట్లుగా భావించి కల్యాణాల్లో పాల్గొన్నారు. భవానీ దీక్షలు ముగిసి, దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే వరకు ప్రచార రథం రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో పయనిస్తే దుర్గమ్మ చెంతకు రాలేని భక్తులకు అమ్మవారి ఆశీస్సులు అందించేందుకు వీలుపడుతుంది.
5. కన్నియాకుమారి శ్రీవారి ఆలయంలోనూ ఉచితమే
ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం కన్నియకుమారిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మించిన శ్రీవారి ఆలయంలోనూ భక్తులకు లడ్డూ ప్రసాదం, ఉచిత బస్సు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు చెన్నై సలహా మండలి అధ్యక్షుడు శేఖర్రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. కన్నియాకుమారిలో శ్రీవారి ఆలయం నిర్మించి, విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం జరిగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం ఆగమశాస్త్రాల ప్రకారం పుణ్యావచనం, శతకల శాభిషేకం, తిరుమంజనం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవిల్లిపుత్తూరు నుంచి పత్రాలతో తయారుచేసిన చిలుకలు తీసుకొచ్చి వేంకటేశ్వరస్వామికి అలంకరించారు. ఎల్ఏసీ అధ్యక్షుడు శేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులు అనిల్కుమార్ రెడ్డి, ఆనందకుమార్ రెడ్డి, ఇతర సభ్యుల నిర్వహణ బాధ్యతలు చేపట్టగా, సహాయ కార్యనిర్వహణాధికారి మురళి, సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో రాజ్యసభ సభ్యులు విజయ్కుమార్, టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత, తిరునల్వేలి డీఐజీ ప్రవీణ్కుమార్, వివేకానంద కేంద్రం సభ్యులు కూడా పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శేఖర్రెడ్డి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి వేంకటాచలపతి ఆలయాన్ని దర్శించే భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ప్రతిరోజూ 5 వేల మంది దర్శించుకుంటున్నారని, రెండేళ్లలో ఈ సంఖ్య 25 వేలకు పెరిగే అవకాశముందన్నారు. భక్తుల రాక పెరిగేందుకు అనుగుణంగా టీటీడీ చర్యలు చేపడుతుందని చెప్పారు. అలాగే కన్నియకుమారి వచ్చే భక్తులు ఆలయానికి చేరుకొనేలా ఉచిత బస్సులను నడిపే ఆలోచనలో టీటీడీ ఉందన్నారు. ఇంకా ప్రతినెలా స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నామని, ఈ ప్రాంతంలో వివాహాలు జరిపేందుకు వసతిగా కల్యాణమండప నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అందించేందుకు వివేకానంద కేంద్ర నిర్వాహకులు అంగీకరించారని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పర్యాటకశాఖ చిత్రపటాల్లో కన్నియకుమారి ఆలయం స్థానం పొందేలా చర్యలు చేపట్టామని, ముఖ్యంగా పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లో ఆలయ నిత్యపూజలతో కూడిన వివరాలను తెలిపేలా బోర్డుల ఏర్పాటుకు కన్నియకుమారి మున్సిపాలిటీ అనుమతి కోరనున్నట్టు శేఖర్రెడ్డి తెలిపారు.
6. నేటి తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. అయితే, స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, టైం స్లాట్ సర్వదర్శనం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. సోమవారం 72512 మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు.
7. జనవరి 28 మంగళవారం 2020 మీ రాశిఫలాలు
మేషరాశి : ఈ రోజు వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలోవిదేశీ యానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
వృషభం: ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ లేదా మూత్ర సంబంధ అనారోగ్యం కారణంగా బాధపడతారు.
మిథునం: ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహపూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.
కర్కాటకం : మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు.
సింహం : ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.
కన్య : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.
తుల : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.
వృశ్చికం : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.
ధనుస్సు: ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టు వదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.
మకరం : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమ్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.
మీనం : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది.
8. శుభమస్తు _ నేటి పంచాంగం
తేది : 28, జనవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి
(పూర్తిగా ఉంది)
నక్షత్రం : శతభిష
(ఈరోజు ఉదయం 7 గం॥ 39 ని॥ వరకు)
యోగము : పరిఘము
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 2 గం॥ 44 ని॥ నుంచి 4 గం॥ 30 ని॥ వరకు)
మ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 1 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 23 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 48 ని॥ నుంచి 11 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 2 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 8 ని॥ లకు
9. చరిత్రలో ఈ రోజు జనవరి 28
సంఘటనలు
1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.
1950: భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది.
జననాలు
1865: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (మ.1928)
1885: గిడుగు వెంకట సీతాపతి, ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965)
1929: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. ((మ.2004)
1930: పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.
1955: వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్
మరణాలు
2014: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
2016: గౌరు తిరుపతిరెడ్డి, ప్రముఖ వాస్తునిపుణుడు (జ.1935)
2016: అరిందమ్ సేన్‌గుప్తా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.
10. తిరుమల\|/సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు మంగళవారం,
28.01.2020
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 17C°-28C°
• నిన్న 72,512 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 04 కంపార్ట్మెంట్ లో
సర్వదర్శనం కోసం భక్తులు
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
03 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.02 కోట్లు,
• నిన్న 16,323 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
గమనిక
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
ప్రత్యేక దర్శనాలు:
• ఈరొజు వృద్ధులు,
దివ్యాంగులకు శ్రీవారి
ప్రత్యేక దర్శనం,
• రేపు 5 ఏళ్లలోపు
చిన్నపిల్లల తల్లిదండ్రులకు
ప్రత్యేక దర్శనం.
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్‌
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామిttd Toll free#18004254141
11. తృష్ణ
తృష్ణ అంటే దప్పిక, కోరిక అని రెండు అర్థాలున్నాయి. దప్పిక నీళ్లు తాగాలనే కోరికను పెంచుతుంది. కోరిక అనుకున్నది సాధించాలనే ఆశను పెంచుతుంది. స్థూలంగా ఈ రెండూ ఒకటే అయినా, వీటి మధ్య సూక్ష్మభేదం ఉందిమనిషి పుట్టినప్పటి నుంచి అతణ్ని వెంటాడేది తృష్ణ. తృష్ణ దాహమే కదా? మానవ శరీరం నిరంతరం నీటిని కోరుతుంది. దాహాన్ని తీర్చుకోకుండా మనిషి ఎక్కువకాలం బతకలేడు. మనిషిలోని జలదాహం ఆజీవనాంతం తీరనిది. అంటే మనిషికి శరీరధారణ మొదలుకొని, శరీరనాశం వరకు తృష్ణ వెంటాడుతూనే ఉంటుంది. మనిషి దాహాన్ని తీర్చే జలం ప్రాణంతో సమానం. అందుకే నీటికి జీవనమని, అమృతమని పేర్లున్నాయి. మనిషిలోని తృష్ణ కేవలం నీటిని మాత్రమే కోరదు. ఈ ప్రపంచంలోని అన్ని సంపదలను, సుఖాలను కోరుతుంది. తృష్ణ ఎన్నటికీ ఆరని నిప్పువంటిది. అందుకే మహాత్ములు తృష్ణను ఆర్పివేయడానికి ప్రయత్నిస్తుంటారు. తృష్ణను వదులుకుంటేనే సుఖం లభిస్తుందని అందరికీ ప్రబోధిస్తారు. తృష్ణను వదిలించుకోవడం మాటలు చెప్పినంత సులభం కాదు. మహాకవులు సైతం ఈ సత్యాన్ని అంగీకరించారు. మనిషి బాల్యదశలో ఎన్నో విధాలుగా క్రీడించినా తృప్తిలేదు. యౌవనంలో సకల సౌఖ్యాలు అనుభవించినా శాంతి కలగలేదు. అంతలోనే వార్ధక్యం దాపురించింది. తల వెంట్రుకలు తెల్లబడ్డాయి. శరీరం మీద ముడతలు కనబడుతున్నాయి. అవయవాలన్నీ పట్టుతప్పి పోతున్నాయి. నిలవడానికి శక్తి లేదు. ఒక్క అడుగైనా ముందుకు సాగలేని దుస్థితి. ఇంతటి దయనీయ దశలోనూ తృష్ణ మాత్రం చావనే చావదు. ఇంకా ఏదో సంపాదించాలని, ఇంకా ఎన్నో సుఖాలను జుర్రుకోవాలని, ఎన్నెన్నో ఆస్తులు కూడబెట్టాలని మనిషి మనసు ఉవ్విళ్లూరుతూనే ఉంటుంది.మనిషి భోగాలను అనుభవిస్తూ, తాను భోగజీవినని భ్రమపడతాడు. భోగాలే తనను మింగేస్తున్నాయనే సత్యాన్ని గ్రహించలేడు. వయసు పెంచుకొంటూ కాలం గడిచిపోతోందని అనుకుంటాడే కాని- గడుస్తున్నది కాలం కాదని, తన ఆయుష్షే తరిగిపోతున్నదని నమ్మలేడు. కోరికలను తీర్చుకుంటూ తాను అన్నింటినీ అనుభవించానని అనుకుంటాడేకానీ, కోరికలు తనను మింగేస్తున్నాయని విశ్వసించలేడు.మనిషిలోని తృష్ణ ఎంత చెడ్డదంటే, దాన్ని తీర్చుకోవడం కోసం మనిషి అడ్డమైన గడ్డీ తినడానికి వెనకాడడు. అడ్డదారుల్లో అందలాలు ఎక్కేందుకు సిగ్గుపడడు. మానమర్యాదలను సైతం ఇతరులకు తాకట్టు పెట్టడానికి ఏ మాత్రం సంకోచించడు. కాకిలాగా ఎంగిలి మెతుకులు తినడానికీ సిద్ధపడతాడు. తృష్ణ చాలా చెడ్డది. ఎన్నో చెడు పనులు చేయడానికీ సంకోచపడదు.తృష్ణ సముద్రంలో ఎగసిపడే కెరటం వంటిది. అది ఎంతో వేగంగా వచ్చి, పైకి ఎగురుతుంది. అంతలోనే మటుమాయమైపోతుంది. అది శాశ్వతం అనుకుంటే మనిషికి అధోగతి తప్పదు.మనిషి తృష్ణకు లోనై తాను నూరేళ్లూ బతుకుతానని అనుకుంటాడు. నిజానికి ఎన్నేళ్లు బతికేదీ మనిషికి తెలియదు. బతికినంతకాలం ఎలాంటి అశాంతి లేకుండా కాలం గడిపేందుకు ప్రయత్నించాలి.‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్నట్లు శరీరం స్వాధీనంలో ఉన్నప్పుడే తృష్ణను దూరం చేసుకోవాలి. అది పెరిగి పెద్దదైతే భూతంలా వెంటాడుతుంది. పిశాచంలా పట్టి పీడిస్తుంది. మనిషిని అన్ని విధాలుగా దిగజారుస్తుంది. మహా వృక్షాన్ని సైతం తొలిచివేసే పురుగులా తృష్ణ మనిషి హృదయాన్ని తొలిచి, శరీరాన్ని కబళించి అంతు చూస్తుంది. కనుక మనిషి తృష్ణను దూరం చేసుకోవాలి. శాంతిని స్వాగతించాలి.
12. ఋణానుబంధం
ఋణము వుంటేనే తప్ప ఏవీ కూడా మన దరికి చేరవు. పూర్వజన్మలో చేసుకున్న ఋణం బట్టి భార్య కాని, భర్త కాని
వివాహబంధంతో ఏకమవుతారు.అలాగే పిల్లలు పుట్టాలన్న వారి ఋణము మనకు వుండాలి. ఇక ఇంట తిరిగే పశువులు. ఏ ఇతరాలైనా కూడా ఋణము వుంటేనే తప్ప మనకు దక్కవు.అంతెందుకు ఋణము వుంటేనే ఎవరితోనైనా స్నేహాలు. బాంధవ్యాలు కలుస్తాయి. మనకు ఎవరైనా ఎదురుపడినా. లేక మాట కలిపినా కూడా అది కూడా ఋనానుబంధమే…..ఋణమనేది లేకుంటే ఎవరిని కలలో కూడా మనం చూడలేము, ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు. ఈ రుణానుబంధం విలువ తెలుసుకుని మసలుకోవాలి….ఋణం కేవలం ధనం మాత్రమే కాదు,బాంధవ్యం కూడా. అందుకే ధన బంధం కంటే ఈ బంధానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. “మానవతా విలువలు మరచిపోతున్న ఈ సమాజంలో ఋణబంధం విలువ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. ఋణం లేనిదే త్రుణం కూడా ముట్టదు, అని మన పెద్దలు చెప్పారు ఇది నిజం. మనం ఎంత యత్నించినా కూడా రుణం లేకపోతే ఏది జరగదు, ఏ బంధం నిలువదు. ఏ బంధమైనా వదిలేసినా, ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడకండి నిందించకండి, ఆ బంధం అంత వరకే అని అర్థం చేసుకోండి, దూరంగా ఉన్నా మన వాళ్లేగా ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా వాళ్ల సంతోషాన్ని కోరుకోండి! బంధాలు కల్పించినదీ, కాలగర్భంలో కలిపేసేదీ ఆ భగవంతుడే
13. పరమౌషధం
అనారోగ్యంతో ఉన్నప్పుడుగానీ ఆరోగ్యం విలువ తెలియదంటారు అనుభవజ్ఞులు. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో పడితేగానీ డబ్బు విలువ తెలియదంటారు.మనిషి అన్నీ బావుంటే నేలమీద నడవడు. నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహిస్తుంది. ఏవి నిషిద్ధమో అవే ఆచరిస్తాడు. ఫలితంగా చిక్కులు తప్పవు.ఆరోగ్యం, ఆర్థిక పుష్టి మనిషికి రెండు చేతుల్లాంటివి. ఏది బలహీనంగాఉన్నా ప్రగతి కుంటువడుతుంది. ఆరోగ్యం బావుండి ఆర్థిక సమస్యలున్నా, అలాగే ఆర్థికంగా బావుండి ఆరోగ్య సమస్యలున్నా ఆ జీవితంలో సుఖశాంతులుండవు.మనిషి మనసెప్పుడూ సుఖశాంతులనే కోరుకుంటుంది. అందుకోసం మనిషిని ప్రోద్బలం చేస్తుంది. సుఖశాంతులు శాశ్వతం కాదు. అవి మనిషితో దోబూచులాడుతుంటాయి. మనిషి జీవితంలో అధికభాగం సుఖశాంతుల వేటలోనే గడిచిపోతుంది. సుఖం సిరిసంపదల్లో ఉందనిపిస్తుంది. శాంతి ఆనందంలో ఉంటుందనిపిస్తుంది. కానీ, అవి రెండూ భ్రమలే.సుఖశాంతులు తృప్తిలో నిక్షిప్తమై ఉంటాయి. రాక్షసుడి ప్రాణం చిలుకలో ఉందన్నట్లుగా తృప్తి అనే నిత్యానందం మనసులోనే ఒక మూల మౌనిలా నిశ్చలంగా ఉంటుంది. దాని ఉనికి తెలియనంతమేరకు మనిషికి తిప్పలు తప్పవు.తృప్తి అంటే తనకు ఉన్నదానితో సంతుష్టి చెందడం. గొంతువరకు తిని ఇక చాలనుకోవడం తృప్తి కాదు. ఎందుకంటే, కడుపు ఖాళీకాగానే మళ్ళీ అంతకు అంత తినాలని ఆరాటపడతారు.యుక్తాహార విహారాలే ఆరోగ్యానికి, ఆయుష్షుకు ఆలంబనాలు. అమితాహారం ఆరోగ్యభంగం. ఆయుష్షుకు హాని చేస్తుంది. ఎంతో ఆరోగ్యంగా ఉండే శరీరాన్ని అనారోగ్యం పాలుచేసుకుని, ఔషధాలతో గడపడం జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తుంది.మన సంప్రదాయంలో వివిధ సందర్భాల్లో ఉపోషాలు పాటిస్తారు. దీనినే ‘ఉపవాసం’ అని వ్యవహరిస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే ‘ఉపవాసం’ దైవ సన్నిధిలో వసించడం. ఆరోగ్యపరంగా చూస్తే ఆయుర్వేదం చెప్పిన ‘లంఖణం పరమౌషధం’గా ఆరోగ్యరక్షణ చేస్తుంది.ఆహారం నియమిత వేళల్లో, మితంగా తీసుకోకపోతే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. శరీరాన్ని రక్షించినా, శిక్షించినా జీర్ణవ్యవస్థదే ప్రధాన పాత్ర.శరీరం బావుంటేనే ధర్మాచరణ సాధ్యపడుతుంది. యోగసాధనలన్నీ శరీర రక్షణతోపాటు, మనసునూ బలోపేతం చేస్తాయి. ఆధ్యాత్మిక సాధనలు మనసులోని తృప్తిని జాగృతం చేస్తాయి. ‘సత్యదర్శనం అయ్యాక పూజలతో పనిలేదు’ అంటారు శ్రీరామకృష్ణులు. మనిషి క్రమంగా ఆ స్థాయికి ఎదగాలి.
‘ఔషధం’ అంటే సాధారణ రుగ్మతలకు వాడేది. ‘పరమౌషధం’ అంటే ప్రాణాంతక వ్యాధులను నివారించేది. మనిషి స్వయంకృతాలన్నీ ప్రాణాంతక పర్యవసానాలకే దారితీస్తాయి. వాటికి పనికొచ్చే పరమౌషధాలను మనమే వెతుక్కోవాలి!
14. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ..
రాజధాని అమరావతి తరలింపులో రైతులకు తప్పకుండా న్యాయం చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి జగన్ పై ఉంది…ఈ రోజుల్లో ఏదైనా గ్రామంలో రోడ్డు వేయాలంటే సెంటు భూమి కూడా రైతులు ఇవ్వని పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు ఇచ్చారంటే వారి త్యాగాన్ని గుర్తించాలి…13 జిల్లాల చిన్న రాష్ట్రంలో కావాలని విభేదాలు సృష్టిస్తున్నారు.. నా 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు ఇటువంటి విభేదాలు చూడలేదు…రాష్ట్రం బాగుండాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు…దాని కోసం ప్రజల్లో విభేదాలు తీసుకురావడం సరికాదు.
15. 1న పద్మావతి అమ్మవారికి సప్తవాహన సేవలు
రథసప్తమిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారు ఫిబ్రవరి 1న సప్త వాహనాలపై ఊరేగనున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాహనసేవలు నిర్వహించనున్నారు. వేకువజామున ఆరు గంటలకు శ్రీసూర్య నారాయణుడు అశ్వ వాహనంపైఊరేగనున్నారు. అనంతరం అమ్మవారు ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం, 8.30 గంటలకు హంసవాహనం, 10 గంటలకు అశ్వవాహనం, 11.30 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం ఒంటి గంటకు చిన్నశేషవాహనం, సాయంత్రం ఆరు గంటలకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవలు జరగనున్నాయి. అదే రోజు ఆలయంలో మధ్నాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు అమ్మవారి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.నేడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంరథ సప్తమిని అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. తిరుమంజనం నేపథ్యంలో ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. ఉదయం 9.30 గంటల అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.
16. భక్తజన సంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. మంగళవారం, మేడారం జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. ఇసుకేస్తే రాలనంత జనం తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. ఇప్పటి వరకు లక్షమందికి పైగా భక్తులు అంజన్నను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో భక్తులు ఆలయం వెలుపలి వరకు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కొండగట్టు పరిసర ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించింది. మేడారం జాతర ముందు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ.
17. శ్రీలంకలో సీతాదేవి మందిరం: కమల్‌నాథ్
శ్రీలంకలో సీతాదేవి భవ్య మందిరాన్ని, సాంచిలో అంతర్జాతీయ స్థాయి బుద్ధ మ్యూజియంను నిర్మించనున్నట్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మహోబోధి సొసైటీ ప్రతినిధి బృందం సోమవారంనాడిక్కడ రాష్ట్ర ప్రజా సంబంధాల మంత్రి పీసీ శర్మ, ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో సమావేశమైంది. అనంతరం శ్రీలంకలో సీతాదేవి ఆలయం, ఎంపీలోని సాంచిలో బుద్ధ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు సీఎం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీతాదేవి మందిరాన్ని నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్మించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం, శ్రీలంక ప్రభుత్వం, మహాబోధి సొసైటీకి చెందిన ప్రతినిధులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఆ ప్రకటన తెలిపింది. అదేవిధంగా సాంచీలో బుద్ధుని మ్యూజియం కమ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణను త్వరితగతిని పూర్తి చేయాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు.
18. నాగోబాకు భక్తుల క్యూ
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో నాగోబా జాతర వైభవంగా జరుగుతోంది. నాగోబాను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు సహా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, జార్ఘండ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. మెస్రం వంశీయులు గోడవ్లో సంప్రదాయ పూజలు చేస్తున్నారు. టెంపుల్ వెనుక భాగంలో భక్తులు రూపాయి బిళ్లను అతికించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు భారీ సంఖ్యలో వస్తుండడంతో జాతరలో సందడి నెలకొంది. జాతర ఈ నెల 31న ముగియనుండడంతో మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్, కాగజ్నగర్ తదితర డిపోల నుంచి ఆదిలాబాద్కు… ఆదిలాబాద్ నుంచి ఆయా డిపోలకు బస్సులను కేస్లాపూర్మీదుగా నడిపిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు సహా ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కేస్లాపూర్ వైపు వెళ్తున్నాయి.
19. వేములవాడలో జన జాతర
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క సారక్క జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం అనవాయితీ. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, చత్తీగఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. సోమవారం ఒక్క రోజే 2లక్షల మందికి పైగా భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. దర్శనానికి 8గంటలకు పైగా సమయం పట్టింది. మరోవైపు భక్తుల సంఖ్య పెరగడంతో ఉండేందుకు గదులు దొరకలేదు. రాజన్న ఆలయ వసతి గదులు, ప్రైవేట్గదులు నిండిపోయాయి. దీంతో చాలామంది బయట చలిలోనే బస చేశారు. చిన్నారులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
20. ఘనంగా శంబర పోలమాంబ ఉత్సవాలు
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారి ఉత్సవాలు విజయగరం జిల్లా మక్కువ మండలం శంబరలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం సిరిమానోత్సవం. ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరగనుంది. సిరిమానోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా శంబరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. సిరిమానోత్సవం సందర్భంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.