Food

మునగాకు పొడి ఇలా తయారు చేసుకోండి

Drumstick leaves powder-Telugu food and diet news

పొడులు మన తెలుగువారికి బాగా ఇష్టం. మన ఇళ్లలో కంది పొడి, కరివేపాకు పొడి, ఇడ్లీ పొడి ఇలా చాలా పొడులను ఉంచుకుంటాం. మరి మునగాకు అవిసెగింజల పొడి తయారీ విధానం తెలుసుకుందాం. భోజనాలు, టిఫిన్లు తినేటప్పుడు మనం కచ్చితంగా కూరలు, చట్నీలు తయారుచేసుకుంటాం. ఐతే… ఒక్కోసారి చేసిన కూరలు సరిపోకపోవచ్చు. లేదా చట్నీ టేస్ట్ సరిగా ఉండకపోవచ్చు. లేదంటే… సరిగ్గా టిఫిన్ చేసే టైమ్‌కి పక్కింటివారో, స్నేహితులో ఇంటికి రావచ్చు. అలాంటప్పుడు అప్పటికప్పుడు కర్రీలు, చట్నీలూ చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సమయంలో ఆల్టర్నేట్‌గా కంది పొడి, వేరుశెనగ పొడి, ఇడ్లీ కారం లాంటివి ఉంటే… అవి ఉపయోగపడతాయి. అలాంటి పప్పుల్లో చాలా వరకూ మీకు తెలిసినవే. ఐతే… మునగాకు అవిసెగింజల పొడి గురించి కొంతమందికే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే… ఇది ఎక్కువ మంది తయారుచేసుకోరు. కానీ దీనితో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పైగా దీని ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది. తినేకొద్దీ తినాలని అనిపించకపోయినా నోటికి బాగానే ఉంటుంది. మీకు తెలుసా ఈ పప్పుల పొడులు చాలా మేలు చేస్తాయి. ఇవి మన ఆకలిని పెంచుతాయి. మంచిగా భోజనం తినేలా చేస్తాయి. అంతేకాదు… రకరకాల వ్యాధులు రాకుండా ఇవి కాపాడతాయి. ఇలా ఇదంతా చెబుతూ ఆలస్యం ఎందుకూ… ఎలా తయారుచెయ్యాలో స్ట్రైట్ గా చెబుతాను.
మునగాకు అవిసె గింజల పొడి : కావాల్సినవి –
మునగాకు – 250గ్రాములు (శుభ్రమైనవి)
అవిసెగింజలు – 50గ్రాములు
కరివేపాకు – 50గ్రాములు
పచ్చిశనగపప్పు – 10గ్రాములు
వేరుశనగ గింజలు – 5గ్రాములు
వెల్లుల్లి – 1 రెబ్బ (ఇది టేస్ట్ పెంచుతుంది)
ఎండుమిర్చి – సుమారు 6. ఎక్కువ స్పైసీ కావాలంటే మరో రెండు పెంచుకోండి.
ధనియాలు – 2టీస్పూన్లు
చింతపండి – కొద్దిగా
నువ్వులు – 2టీస్పూన్లు
ఉప్పు – తగినంత
తయారీ విధానం – ఉప్పు తప్ప పై అన్నింటిని సిమ్‌లో ఒకటి తర్వాత ఒకటిగా వేడి చేస్తూ… (రోస్ట్ చేస్తూ)… పక్కన పెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత… ఉప్పుతో సహా అన్నీ కలిపేసి… మిక్సీలో వేసి ఆడించేయడమే. ఇది మెత్తటి పొడిలా ఉండదు. కొద్దిగా మాత్రమే పొడిలా ఉంటుంది. అలా ఉన్నా చాలు. దాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని… కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందీ… అదిరిపోతుందంతే.