*ప్రత్యేకంగా తయారు చేయించిన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ
మేడారం జాతరకు ప్రముఖులను ఆహ్వానించేందుకు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వాన పత్రిక ఆకట్టుకునేలా ఉంది. ఈ పత్రికలో మేడారం జాతర చరిత్ర, గిరిజనుల సంప్రదాయాలను తెలియజేసే విశేషాలతో కూడిన పుస్తకం, గిరిజనులు గీసిన బొమ్మ, లక్ష్మీదేవరగా పిలువబడే చెక్కతో తయారు చేసిన గుర్రం తల, సమ్మక్క-సారలమ్మ ప్రతిరూపంగా పిలువబడే కర్రతో తయారు చేసిన కుంకుమభరణి ఉంది. ఇందులో అమ్మవార్ల పసుపు, కుంకుమ సైతం ఉంది.
*హిందీ, ఆంగ్ల భాషల్లోనూ..
ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖలు తరలివస్తుంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఆహ్వాన పత్రికలను తెలుగుతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లోనూ అచ్చు వేయించినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ఈ ఆహ్వాన పత్రికలో జాతర జరిగే రోజుల్లో ఏ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో తెలిపే సమయం, జాతర విశిష్టతను తెలియజేసేలా పలు అంశాలు పొందుపరిచారు. అలాగే మేడారం ఏ విధంగా చేరుకోవాలనేది సెల్ఫోన్లో గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌తో పాటు రూట్ మ్యాప్ సైతం ఇచ్చారు.
*పోచంపల్లి సింగారం
ఈసారి మేడారం జాతరలో పోచంపల్లి చేనేత వస్త్రాలు మెరవనున్నాయి. అక్కడ విధులు నిర్వర్తించే వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక పాన్కోట్లను ఆకర్షణీయంగా రూపొందించి అందజేస్తున్నారు. జాతరకు వచ్చే ప్రముఖులను సన్మానించేందుకు కండువాలను కూడా మేడారం చిహ్నంతో ప్రత్యేకంగా ముద్రించి తయారు చేసి అందించనున్నారు. సమ్మక్క-సారలమ్మలకు సారె రూపంలో భక్తులు మొక్కులు చెల్లించేందుకూ పోచంపల్లి వస్త్రాలను వాడేలా ప్రోత్సహించేందుకు అధికారులు ఆలోచిస్తున్నారు. మేడారం జాతర విశిష్టతను చాటి చెప్పేందుకే ఈసారి పోచంపల్లి వస్త్రాలను విరివిగా వినియోగించాలని నిర్ణయించినట్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.
అద్భుతంగా మేడారం జాతర ఆహ్వాన పత్రిక
Related tags :